ETV Bharat / crime

ఆక్సిజన్ అందక సర్కారు దవాఖానాలో బాలింత మృతి.. కుటుంబీకుల ఆందోళన

author img

By

Published : Jun 14, 2022, 7:06 PM IST

Updated : Jun 14, 2022, 7:15 PM IST

సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచుతున్నామని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు వైద్యం సరిగా అందడం లేదంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం అనారోగ్యానికి గురైన ఓ బాలింత.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

ఆక్సిజన్ అందక సర్కారు దవాఖానాలో బాలింత మృతి.. ఆందోళన
ఆక్సిజన్ అందక సర్కారు దవాఖానాలో బాలింత మృతి.. ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామగుండం కార్పొరేషన్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన పులి ప్రణయ అనే గర్భిణీ శనివారం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం.. నిన్న రాత్రి అనారోగ్యానికి గురైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. వెంటనే ఆక్సిజన్‌ అందించాల్సి ఉండగా.. అందుబాటులో లేకపోవడంతో బాలింత మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళన చేపట్టారు. వీరికి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు మద్దతుగా నిలిచారు.

ప్రణయకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్సుకు చెప్పాం. వచ్చి చూసి.. పర్లేదు ఏం కాదు అని చెప్పింది. ఇబ్బంది మరింత ఎక్కువ కావడంతో మళ్లీ వెళ్లి చెబితే.. ఆక్సిజన్​ తెచ్చి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అది సరిగా లేకపోవడంతో డాక్టర్​ను తీసుకొస్తానని వెళ్లింది. 20 నిమిషాల తర్వాత డాక్టర్​ వచ్చి చూసేసరికి ప్రణయ చనిపోయింది.-ప్రతాప్​, మృతురాలి సోదరుడు

ప్రతాప్​, మృతురాలి సోదరుడు
ప్రతాప్​, మృతురాలి సోదరుడు

ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోకపోవడం వైద్యుల నిర్లక్ష్యమే అంటూ స్థానిక కాంగ్రెస్ నేత రాజ్ ఠాగూర్ మక్కాన్​సింగ్ ఆరోపించారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ఆరోపణలను వైద్యులు ఖండించారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే బాలింత చనిపోయిందని గోదావరిఖని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హిమబిందు పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రణయ ఆరోగ్యం బాగానే ఉంది. నిన్న అర్ధరాత్రి సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే.. వెంటనే వైద్యులు వచ్చి పరీక్షించారు. అప్పటికే ఆమె పల్స్​ పడిపోయింది. ఆక్సిజన్ పెట్టేలోపే చనిపోయింది. ఇలాంటి పరిస్థితిని పల్మోనరీ ఎంబోలిజమ్​ (రక్తం గడ్డకట్టడం వల్ల ఊపిరితిత్తుల్లోని రక్త నాళాలు నిరోధించబడటం) అంటారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ ఘటనపై నేను పూర్తి విచారణ చేస్తాను. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే.. కచ్చితంగా చర్యలు తీసుకుంటా.-హిమబిందు, గోదావరిఖని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్

హిమబిందు, గోదావరిఖని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్
హిమబిందు, గోదావరిఖని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్

ఇవీ చూడండి..

పారిపోయిన ప్రేమజంట.. యువకులను చితకబాదిన సర్పంచ్.. మనస్తాపంతో..!

సైక్లిస్ట్​పై పొదల్లోంచి దూకి చిరుత దాడి.. వృద్ధుడిని తొక్కి చంపిన ఎద్దు

Last Updated :Jun 14, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.