ETV Bharat / health

ఈ పనులు అలవాటు చేసుకోండి - మీ బ్రెయిన్​ సూపర్ పవర్​గా మారిపోతుంది! - Best Habits to Make Brain Powerful

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 10:52 AM IST

Brain Powerful Habits : మన బాడీలో మెదడు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రెయిన్ ఆరోగ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. అందుకే.. బ్రెయిన్​ చురుగ్గా, పవర్​ఫుల్​గా వర్క్ చేసేందుకు కొన్ని పనులు అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు నిపుణులు..

Best Habits to Make Brain Powerful
Best Habits to Make Brain Powerful (Etv Bharat)

Best Habits to Make Brain Powerful : ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు సవాలక్ష పనులు. ఎన్నో ఒత్తిళ్లు. ఈ ఒత్తిళ్లతో మెదడు మొద్దుబారిపోతుంటుంది. చురుగ్గా ఉండలేకపోతుంటాం. చేసే పనిపై ఏకాగ్రత ఉండదు. ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అయితే.. ఈ సమస్యలన్నీ తొలగిపోయి మెదడు చురుగ్గా, పవర్ ఫుల్​గా పనిచేయాలంటే కొన్ని పనులు అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తితోపాటు మొత్తంగా మెదడు శక్తిమంతం అవుతుందని వివరిస్తున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వ్యాయామం: శరీరంలో రక్త సరఫరా తగిన విధంగా ఉండాలంటే వ్యాయామం కంపల్సరీ అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా పెరిగి.. ఆక్సిజన్, పోషకాలు తగిన స్థాయిలో అందుతాయంటున్నారు. అంతేకాదు.. వ్యాయామం కొత్త న్యూరాన్ల పెరుగుదలనూ ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అలా అనీ మరీ కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని.. ఏరోబిక్ వ్యాయామాలు, నడక, జాగింగ్ వంటివి సరిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

2011లో జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేసే వృద్ధులలో జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరు మెరుగుపడిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అడ్వెంట్‌హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాన్స్‌లేషనల్ న్యూరోసైన్స్ డైరెక్టర్‌ డాక్టర్ కిర్క్ I. ఎరిక్సన్, Ph.D పాల్గొన్నారు.

ఆహారం: యాంటీ ఆక్సిడెంట్లు, గుడ్ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే.. మెదడుకు సంబంధించి సమస్యలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, బెర్రీస్, చేపలు, డ్రైఫ్రూట్స్ వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని, అల్జీమర్స్​ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అంటున్నారు.

నిద్ర: మన నిద్ర పోయిన సమయంలోనే మన బ్రెయిన్​కు రెస్ట్​ దొరుకుతుంది. అప్పుడే మన జ్ఞాపకాలు, కొత్తగా నేర్చుకున్న అంశాలను ఓ క్రమపద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం నిద్ర లేకపోవడం అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుందని, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుందని కనుగొన్నారు. కాబట్టి మెదడును పదునుగా ఉంచడానికి ప్రతి రాత్రి తగినంత నాణ్యమైన నిద్ర పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

సోషల్ యాక్టివిటీస్: స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా అభిజ్ఞా పనితీరును మెరుగుపరచవచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన ప్రకారం సోషల్​ యాక్టివిటీస్​ డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.

ధ్యానం: రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడులోని గ్రేమేటర్ పెరుగుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల్లో తేలింది. మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి ఈ గ్రేమేటరే కీలకమని కనుగొన్నారు.

పజిల్స్: పజిల్స్ సాల్వ్​ చేయడం వంటివి మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధనల్లో కూడా ఇదే తేలింది. మెదడుకు ఎప్పుడూ పని చెపుతూ ఉండటం వల్ల న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు కణాలు యాక్టివ్​గా ఉండటాన్ని పెంచుతుందని అంటున్నారు.

కొత్త వాయిద్యం నేర్చుకోవడం: ఏదైనా కొత్త వాయిద్యాన్ని నేర్చుకోవడం వంటివి మెదడులోని వివిధ భాగాలను యాక్టివేట్ చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శరీరంలోని చేతులు, కాళ్లు, చర్మం, కళ్లు వంటి అవయవాలను నియంత్రించే సామర్థ్యం మరింత పెరుగుతుందని.. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను ఇది దూరంగా ఉంచుతుందని వివరిస్తున్నారు.

చేతి రాత: చేతి రాతను ప్రాక్టీస్ చేయడం కూడా మెదడు పనితీరును, మోటార్ స్కిల్స్​ను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది భాష, ఆలోచనా శక్తి వంటి వాటిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

చల్లటి నీటితో స్నానం: రోజూ కొద్దిసేపు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో వేగస్ నాడీ స్టిమ్యులేట్ అవుతుందని.. నోరాడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందని అంటున్నారు. ఇది యాంగ్జైటీని తగ్గించి.. మెదడు చురుగ్గా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పాజిటివ్ ఆటిట్యూడ్​: నెగెటివ్ ఆలోచనలను దూరం పెట్టి.. పాజిటివ్ థింకింగ్​ను పెంచుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ బ్రెయిన్​కు​ రెస్ట్​ ఇస్తున్నారా - సైన్స్​ చెబుతున్న ఆశ్చర్యకర విషయాలు!

మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్​ అయిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.