ETV Bharat / crime

మూఢ నమ్మకాలతో.. కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

author img

By

Published : May 19, 2021, 2:26 PM IST

witchcraft murder
చేతబడి హత్య

మారుమూల గ్రామాల్లో మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. చదువుకున్న వారు సైతం బాణామతి వంటి వాటిని మూర్ఖంగా విశ్వసిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే.. పక్కవారు చేతబడి చేశారని అనుమానం పెంచుకుంటున్నారు. వాటిని పగలుగా మార్చుకొని, కక్షలు పెంచుకొని.. ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలాగే ఓ వ్యక్తి.. కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు.

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో.. కన్న కొడుకే కాల యముడయ్యాడు. అర్ధరాత్రి.. నిద్రలో ఉన్న తండ్రిని దారుణంగా హతమార్చాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

తండ్రే చేతబడి చేశాడని..

అమీరాబాద్‌కు చెందిన గడ్డమీది బీరుగొండ(65)కు ఆరుగురు కుమారులు సంతానం. నాలుగో కుమారుడు తుకారాం.. బీఎస్సీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవించేవాడు. తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నందుకు.. తండ్రి చేతబడి చేయడమే కారణమని భావించాడు. గ్రామానికి వచ్చి తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. తుకారాం మానసిక పరిస్థితిని గుర్తించిన కుటుంబీకులు.. అతడిని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించారు. ఇటీవలే కోలుకున్న తుకారం.. తిరిగి గ్రామానికి వచ్చాడు.

కంటిలో పొడిచి..

మంగళవారం అర్ధరాత్రి.. నిద్రిస్తోన్న తండ్రిపై తుకారం దాడికి పాల్పడ్డాడు. కంటిలో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని.. తానే హత్య చేసినట్లు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జహీరాబాద్ డీఎస్పీ శంకర రాజు, గ్రామీణ సీఐ నాగేశ్వరరావులు.. నిందితుడు తుకారాన్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి మరో కుమారుడి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.