ETV Bharat / crime

తల్లీకుమారుడి ఆత్మాహుతి.. తమ మరణానికి వారే కారణమంటూ..!

author img

By

Published : Apr 16, 2022, 8:53 AM IST

Updated : Apr 17, 2022, 4:23 AM IST

Mother and son commit suicide by setting fire in kamareddy lodge room with selfie video
Mother and son commit suicide by setting fire in kamareddy lodge room with selfie video

08:47 April 16

తల్లీకుమారుడి ఆత్మాహుతి.. తమ మరణానికి వారే కారణమంటూ..!

ఆత్మహత్యకు ముందు.. తల్లీకుమారుల సెల్ఫీవీడియోలో ఆత్మఘోష..

selfie suicide: రాజకీయ నేతల వేధింపులకు.. చేష్టలుడిగిన పోలీసుల వైఖరికి విసిగివేసారి తల్లీకొడుకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి గంగం సంతోష్‌(41), ఆయన తల్లి పద్మ(68) ఆత్మాహుతి చేసుకున్నారు. తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన పల్లె జితేందర్‌గౌడ్‌ (పురపాలక సంఘం అధ్యక్షుడు), ఐరేని పృథ్వీరాజ్‌ అలియాస్‌ బాలు, సరాబ్‌ యాదగిరి (మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌), తోట కిరణ్‌, కన్నాపురం కృష్ణాగౌడ్‌, సరాబ్‌ స్వరాజ్‌ (యాదగిరి కుమారుడు), తాండూరి నాగార్జునగౌడ్‌ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ) కారణమంటూ ఫేస్‌బుక్‌లో వేర్వేరుగా సందేశాలు పెట్టి ప్రాణాలొదిలారు. ‘మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు.

.

అధికార పార్టీ నాయకులు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు

‘‘ఏడాదిన్నర కాలంగా నిత్య నరకం చూపిస్తున్నారు. వారంతా అధికార పార్టీ నాయకులు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక పోలీసుస్టేషన్‌తో ప్రారంభించి డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, ఐజీ, కలెక్టర్‌, డీజీపీలతో పాటు సీఎంవో కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదు. మరణమే శరణమనుకున్నాం’’ అని వివరిస్తూ సంతోష్‌ ఐదు పేజీల లేఖను రామాయంపేటలోని ఇంట్లో ఉంచారు. దానినే చనిపోయే ముందు వాట్సప్‌లో మిత్రులు, కుటుంబసభ్యులకు పంపారు. లేఖలోని అంశాలనే ఆడియోలో వివరించారు. ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా తెలియజేశారు. ఆధారాలను రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ మాయం చేస్తాడనే ఇన్ని మార్గాల్లో విషయాన్ని వివరిస్తున్నట్టు సంతోష్‌ వాటిల్లో వివరించారు.

.

ఆత్మహత్య చేసుకుంటున్నామని 15న సోదరుడికి ఫోన్‌..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన గంగం సంతోష్‌ అవివాహితుడు. తల్లిదండ్రులు పద్మ, అంజయ్యతోపాటు ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. ఈ నెల 11న సంతోష్‌.. తండ్రికి కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి ఇంటికి పంపించారు. అనంతరం తల్లి పద్మతో కలిసి కొత్త బస్టాండు సమీపంలోని మహారాజా లాడ్జిలో బస చేశారు. రామారెడ్డిలోని కాలభైరవస్వామి దర్శనం చేసుకుని వస్తామని చెప్పారు. తరువాత ఐదు రోజులు లాడ్జిలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు మాత్రం ఆలయంలోనే బస చేసినట్లు చెప్పారు. శుక్రవారం(ఈ నెల 15న) రాత్రి పది గంటల సమయంలో సంతోష్‌.. సోదరుడు శ్రీధర్‌కు ఫోన్‌ చేసి ‘నేను, అమ్మ ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని చెప్పారు. గతంలోనూ ఇలాగే ఒకసారి చెప్పడంతో తేలికగా తీసుకున్న శ్రీధర్‌ ఎవరికీ చెప్పకుండా వదిలేశారు. కానీ శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు లాడ్జి గదిలోనే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. మృతుడి సోదరుడు శ్రీధర్‌ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరేష్‌ తెలిపారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశామని విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించామని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

.

జితేందర్‌ ఇంటి వద్ద మృతదేహాలతో నిరసన..

పోస్టుమార్టం అనంతరం సంతోష్‌, ఆయన తల్లి పద్మ మృతదేహాలను మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ ఇంటికి తరలించేందుకు భాజపా, కాంగ్రెస్‌ వారితో పాటు మృతుడి కుటుంబసభ్యులు, స్థానిక యువకులు ప్రదర్శనగా బయలుదేరినప్పుడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి మధ్య తీవ్ర వాగాద్వం, తోపులాట జరిగింది. ఆ సమయంలో జితేందర్‌ ఇంట్లో లేడు. పరిస్థితులు అదుపు తప్పుతున్న నేపథ్యంలో మెదక్‌ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు ఎస్పీని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని మృతుడి సోదరుడు శ్రీధర్‌ చెప్పడంతో జనం కాస్త శాంతించారు. అంతకుముందు పట్టణంలోని దుకాణాలను భాజపా, కాంగ్రెస్‌ నాయకులు మూసివేయించారు.

ఇదీ నేపథ్యం...

‘బాల్యమిత్రుడైన బాసం శ్రీనివాస్‌తో కలిసి నేను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశా. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ సాయం చేశారు. ఆయన 50శాతం వాటా కావాలని అడగ్గా కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పిల్ల జమిందార్‌ అని ఏదో పోస్టు పెడితే జితేందర్‌గౌడ్‌ మిత్రబృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ నాగార్జునగౌడ్‌ నన్ను ఠాణాకు పిలిచారు. నా ఫోన్‌ని తిరిగివ్వకుండా పది రోజులు ఉంచుకున్నారు. మరుసటి రోజు మెదక్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశా. సీఐ నాగార్జునగౌడ్‌ నా ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత డేటాను దొంగిలించి జితేందర్‌గౌడ్‌ మిత్రబృందానికి ఇచ్చారు. వారు దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. ఈ విషయంపైనా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశా. ఏడాది పాటు ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ నా వ్యాపారం సాగనీయకుండా చేశారు. దీంతో అప్పుల పాలయ్యా. ఇంతటితో ఆగకుండా జితేందర్‌ మనుషులు నా కుటుంబసభ్యులను సైతం ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. శ్రీనివాస్‌ చిన్ననాటి మిత్రుడు కావడంతో అన్ని విషయాలు పంచుకునేవాడిని. కొన్ని రోజుల క్రితం జితేందర్‌గౌడ్‌ అయ్యప్పమాల వేసుకుంటూ శ్రీనివాస్‌తోనూ వేయించారు. అప్పటి నుంచి అతనితోనే అంట కాగుతూ నన్ను దగా చేశాడు’ అంటూ ఆడియోలో సంతోష్‌ పేర్కొన్నారు. ఈ ఆడియోలోని సారాంశాన్ని మరణ వాంగ్మూలంగా భావించాలని కోరారు. ‘‘మా వాడితో మంచిగా ఉండే జితేందరే అంతా చేయిస్తుండు. మా కుటుంబానికి పెట్టిన కష్టాలే వారూ అనుభవించేలా చూడాలి. ఆ ఏడుగురిని అందరూ చూస్తుండగా శిక్షించాలి’’ అని సంతోష్‌ తల్లి పద్మ వీడియోలో విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

Last Updated :Apr 17, 2022, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.