ETV Bharat / entertainment

KGF 2: 'కేజీఎఫ్​ 2' ఎడిటర్​ 20 ఏళ్ల కుర్రాడా?.. ఎవరతను?

author img

By

Published : Apr 16, 2022, 7:43 AM IST

Updated : Apr 16, 2022, 12:24 PM IST

KGF 2 Movie Editor: సూపర్​ హిట్​ టాక్​తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కేజీఎఫ్​ 2' సినిమాకు ఎడిటర్​ 20ఏళ్ల కుర్రాడు అంటే మీరు నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే. అతడి గురించే ఈ కథనం..

.
.

KGF 2 Movie Editor: దర్శకుడు ఓ సినిమా ద్వారా చాలా చెప్పాలనుకుంటాడు. కానీ, నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు కథ రుచించకపోవచ్చు. అందుకే వారికి ఎప్పుడు? ఎంత? ఎలా చెప్పాలో, చూపించాలో ఎడిటరే నిర్ణయిస్తాడు. సినిమా జయాపజయాల విషయంలో కీలక బాధ్యత తీసుకుంటాడు. అయితే తాజాగా విడుదలైన 'కేజీఎఫ్​ 2' సినిమా సూపర్ హిట్​గా దూసుకెళ్తోంది. బాక్సాఫీస్​ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కథ, నటీనటుల యాక్టింగ్​,బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా సినిమా చూపించిన విధానం (ఎడిటింగ్)​ మరింత బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రానికి ఎడిటర్​ ఎవరు అనే ఆసక్తి సినీప్రియుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. ఓ 20ఏళ్ల కుర్రాడు ఎడిటర్​గా వ్యవహరించాడని తెలిసింది. అవును మీరు విన్నది నిజమే. దీని గురించి తెలిసిన చాలా మంది ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఉజ్వల్​ కులకర్ణి అనే టాలెంటెడ్​ యంగ్​స్టర్​ ఈ సినిమాకు ఎడిటింగ్ చేశాడు. గతంలో యూట్యూబ్​ వీడియోలు, ఫ్యాన్ మేడ్​ వీడియోలు ఎడిట్ చేసేవాడు. కొత్త వారికి ప్రోత్సాహమిచ్చేందుకు ఎప్పుడూ ముందుండే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. అతడి గురించి తెలుసుకుని, పనితీరును మెచ్చి ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్లే హాలీవుడ్​ రేంజ్​లో తన పనితనాన్ని నిరూపించుకున్న ఉజ్వల్​.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.

KGF 2 movie editor 20 years old boy
ఉజ్వల్​ కులకర్ణి

ఈ నేపథ్యంలోనే 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. తనకు దక్కిన ఈ గౌరవానికి ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు ఉజ్వల్​. ప్రశాంత్ నీల్​ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. "నేను హీరో యశ్​కు వీరాభిమానిని. 'కేజీఎఫ్​ 1' సినిమా నాకు చాలా నచ్చింది. ఆ సమయంలో పీయూసీ చదువుతున్నాను. నా పెద్ద అన్న ​ సినిమాల్లోకి వెళ్లమని సూచించారు. అప్పుడు ఎడిటింగ్​పై ఆసక్తి ఏర్పడింది. అలా ఈ రంగంలోకి వచ్చాను. నేను ఎడిట్​ చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​కు ఆయన​ భార్య లిఖిత చూపించారు. అది చూసి ప్రశాంత్​ నాకు 'కేజీఎఫ్ 2' సినిమాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో నాకు 17ఏళ్లు. ఆయన నన్నెంతగానో ప్రోత్సాహించారు. ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అది నా అదృష్టం. అయితే అప్పుడు మా తల్లిదండ్రులు నాపై కోపంగా ఉన్నారు. ఎందుకంటే నేను ఉన్నత విద్యను అభ్యసించలేదు. కానీ ఇప్పుడు వారు నాపట్ల ఎంతో గర్వంగా, సంతోషంగా ఉన్నారు." అని ఉజ్వల్​ అన్నాడు.

KGF 2 movie editor 20 years old boy
ఉజ్వల్​ కులకర్ణితో ప్రశాంత్ నీల్​

అంతకుముందు 'కేజీఎఫ్​ ఛాప్టర్‌ 1కు ఎడిటర్​గా శ్రీకాంత్‌ గౌడ పనిచేశారు. 'విజన్‌ వరల్డ్‌' అనే సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా చేరిన శ్రీకాంత్‌.. ఎడిటింగ్‌పై ఉన్న ఆసక్తితో పలు కన్నడ ధారావాహికలు, డాక్యుమెంటరీలు, వాణిజ్య ప్రకటనలు, పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసి, నిర్మాతగానూ మారాడు. ప్రశాంత్‌ నీల్‌ 'ఉగ్రం' సినిమాతో కన్నడ సినీ పరిశ్రమను ఆకర్షించిన శ్రీకాంత్‌ 'కేజీఎఫ్‌ 1'తో ఎడిటర్‌గా మరో మెట్టెక్కాడు. తెలుగులో రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న 'రావణాసుర' అవకాశం అందుకున్నాడు.

ఇదీ చూడండి: 'రాఖీభాయ్'​కు బాక్సాఫీస్​ సలాం- హిందీలో ఆమిర్​ఖాన్​ రికార్డ్​ బద్దలు

Last Updated :Apr 16, 2022, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.