ETV Bharat / crime

భాగ్యనగరంలో నకిలీ దందా.. భూములు గోవిందా!

author img

By

Published : Mar 10, 2022, 10:56 PM IST

Updated : Mar 11, 2022, 12:07 AM IST

Land mafia with fake certificates
నకిలీ డాక్యుమెంట్స్

Land mafia in Hyderabad: భూమి కాజేసేందుకు తుపాకులు.. క‌త్తులు అక్క‌ర్లేదు. న‌కిలీ డాక్యుమెంట్స్‌తో ద‌ర్జాగా య‌జ‌మాని కావ‌చ్చు. కాదంటే.. అస‌లు ఓన‌ర్ల‌ను బెదిరించి అందినంతా దండుకోవ‌చ్చు. కాదు.. కూడ‌దంటే.. కోర్టుల్లో కేసులు వేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేయ‌వ‌చ్చు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఇప్పుడు ఇదే దందా. భూముల ధ‌ర‌లు వంద‌ల కోట్ల‌రూపాయ‌ల‌కు చేర‌టంతో రౌడీషీట‌ర్లు, ఖ‌ద్ద‌రు నేత‌లు, ఖాకీలు కొంద‌రు ఇదే దందా న‌డిపిస్తున్నారు. ఎప్ప‌టివో పాత డాక్యుమెంట్స్ దాచుకున్న వారికి ఇప్పుడు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది.

Land mafia in Hyderabad: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఇప్పుడు కొత్త దందా నడుస్తోంది. భూముల ధ‌ర‌లు వంద‌ల కోట్ల‌రూపాయ‌ల‌కు చేర‌టంతో రౌడీషీట‌ర్లు, ఖ‌ద్ద‌రు నేత‌లు, ఖాకీలు కొంద‌రు న‌కిలీ డాక్యుమెంట్స్‌ సృష్టిస్తూ కోట్లు కాజేస్తున్నారు. ఎప్ప‌టివో పాత డాక్యుమెంట్స్ దాచుకున్న వారికి ఇప్పుడు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది.

Land mafia with fake certificates: బంజారాహిల్స్‌లో ఒక రౌడీషీటర్‌ రూ.100 కోట్ల విలువైన భూమిని కాజేయాలని ప్రయత్నించాడు. ఎన్నో ఏళ్ల క్రితం తాను కొనుగోలు చేసినట్టు పత్రాలు చూపాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి హక్కులు పొందే ప్రయత్నం చేశాడు. రెవెన్యూ అధికారులు ఆ స్థలానికి సంబంధించిన రికార్డులను న్యాయస్థానం ఎదుట ఉంచటంతో మాయగాడి గుట్టు బట్టబయలైంది. రామాంతపూర్‌లో వృద్ధురాలి రూ.2కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు ముగ్గురు మహిళలు కలసి డ్రామా నడిపించారు. వయోధికురాలు మరణ ధ్రువీకరణపత్రం, వారసురాలిని తామేనంటూ కార్యదర్శి ఫోర్జరీ సంతకంతో పత్రాలు సృష్టించారు. మూడు రోజుల వ్యవధిలోనే వేర్వేరు పేర్లతో స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేశారు.

బాధితులు ఫిర్యాదు చేయటంతో...

Land mafia: చివరకు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయటంతో ముగ్గురు మహళలూ అరెస్టయ్యారు. హయత్‌నగర్‌లో ఆరుగురు వ్యక్తులు నకిలీ పత్రాలతో బ్యాంకు నుంచి రూ.10లక్షలు రుణం తీసుకున్నారు. మహానగరంలో నకిలీరాయుళ్ల భూ దందాలకు ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇటీవల ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన స్థిరాస్తి వ్యాపారుల హత్యకేసులో ప్రధాన నిందితుడు మట్టారెడ్డి కూడా ఇదే తరహాలో నకిలీపత్రాలతో భూ కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ, పోలీసు అధికారులు నిర్దారించారు.

కాసులిస్తే క్షణాల్లో పత్రాలు...

Land mafia: ఖాళీస్థలం కనిపిస్తే చాలు. దాని గురించి పక్కా సమాచారం సేకరిస్తారు. యజమాని దూర ప్రాంతంలో ఉన్నా, అంగ, ఆర్ధిక బలం లేదని గుర్తించినా అంతే సంగతులు. ఆ స్థలాన్ని తాము పదేళ్ల క్రితమే కొనుగోలు చేశామంటూ ఎదురుతిరుగుతారు. ఆ తరువాత అది నాలుగైదు చేతులు మారిందంటూ రిజిస్ట్రేషన్‌ అయినట్లు ఆధారాలు చూపుతారు. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సాగుభూములు, ఖాళీస్థలాలపై వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి. అసలు హక్కుదారులం తామేనంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నవారు పెరుగుతున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ డివిజన్‌లో పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో 70శాతం భూ వివాదాలే ఉంటున్నాయంటున్నారు అధికారులు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రతిరోజూ 80-90 ఫిర్యాదులు వస్తే అధికశాతం స్థలాలకు సంబంధించినవే కావటం అక్కడ పరిస్థితికి అద్దంపడుతోంది. నకిలీపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో పోలీసులను ఆశ్రయిస్తున్న అక్రమార్కులు అధికం.

ఏకంగా తహసీల్దార్ సంతకాన్ని...

షేక్‌పేట్‌ రెవెన్యూ మండల పరిధిలో రూ.150 కోట్ల విలువైన భూమికి కాజేసేందుకు ఒక ప్రబుద్ధుడు తహసీల్దార్‌ సంతకాన్ని రెండు సార్లు ఫోర్జరీ చేశాడు. కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, చార్మినార్, ఘాన్సీబజార్, మలక్‌పేట్, ఎల్బీనగర్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పాతపత్రాలు, స్టాంపులు విక్రయించే దళారులు, ఫోర్జరీ సంతకాలు చేయగల మాయగాళ్లు కార్యాలయాలు ఏర్పాటు చేసి మరీ దందా కొనసాగిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నకిలీపత్రాలు తయారు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో లైసెన్స్‌డ్‌ స్టాంపు వెండర్, విశ్రాంత రెవెన్యూ అధికారి, స్థిరాస్తి వ్యాపారి ఉన్నారు.

ఇదీ చదవండి:డీసీసీబీలో రూ.2.86 కోట్ల కుంభకోణం.. 4మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై వేటు

Last Updated :Mar 11, 2022, 12:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.