ETV Bharat / crime

TRAGEDY: విశాఖ జిల్లాలో విషాదం.. బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి..!

author img

By

Published : Jul 27, 2021, 9:16 AM IST

Updated : Jul 27, 2021, 9:26 AM IST

నలుగురు పిల్లలు రోజంతా కలిసి ఆటలాడుకున్నారు. చూసినవారికి తెలియలేదు అవి వారి ఆఖరి ఘడియలని... అమ్మల వెంట అడుగులో అడుగేస్తూ నదికి వెళ్లారు. ఆ తల్లులకు తెలియలేదు అవి వారి చివరి అడుగులని... అందరూ చూస్తుండగానే నీటిలోకి దిగారు. అక్కడున్న ఎవరికీ తెలియలేదు మిగిలేది కన్నీరేనని.

TRAGEDY
విశాఖ జిల్లాలో విషాదం

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా మాడుగుల మండలం జమ్మాదేవిపేట పంచాయతీ శివారు గవరవరంలో సోమవారం నలుగురు పిల్లలు పెద్దేరులో మునిగి మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ కళ్లముందే తమ కంటిపాపలు నీటిలో మునిగిపోవడం చూసిన కన్నతల్లుల ఆవేదనకు అంతులేకుండా పోయింది.

విశాఖలోని గవరవరం గిరిజన గ్రామం. ఇక్కడ చాలావరకూ వంతాల కుటుంబీకులే ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో గ్రామంలోని వంతాల వెంకట ఝాన్సీ, వంతాల గౌతమి షర్మిల, వంతాల భవ్య జాహ్నవి, నీలాపు మహేంద్ర మధ్యాహ్నం అందరితో భోజనాలు చేసి ఆటలాడుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ఉతకడానికి పెద్దేరుకు వెళ్లారు. వారితో పాటే ఝాన్సీ, జాహ్నవి, మహేంద్ర, గౌతమి సరదాగా రేవు వద్దకు వెళ్లారు. పెద్దేరుకు వచ్చే మహిళల వెంట వారి పిల్లలు వస్తుండటం మామూలే. ఎప్పుడూ పిల్లలు నీటిలో దిగేచోటనే పిల్లలు అడుగుపెట్టడం చూసి తల్లులు వారించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ ఊబి ఏర్పడింది. దానిలో నలుగురూ కూరుకుపోయారు. చిన్నపిల్లలు కావడంతో పైకి రాలేక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలేశారు.

TRAGEDY
మృతదేహాల వద్ద తల్లిదండ్రుల రోదన

క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరగడం కళ్లారా చూసిన తల్లులు అచేతనులై ఉండిపోయారు. విషయం తెలపడంతో గ్రామస్థులు పరుగున వచ్చి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. ఈసారి వర్షాలకు ఊబి ఏర్పడిందనే విషయం ఎవరికీ తెలియకపోవడం తీవ్ర విషాదానికి కారణమైంది.

‘ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. పెద్ద చదువులు చదివించాలని ఎంతో ఆశపడ్డాం. మా ఆశలు అడియాశలు చేస్తూ మమ్మల్ని ఒంటరి చేసిపోయాడంటూ’ మహేంద్ర తల్లి రాజేశ్వరి కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆమె ఒక్కసారిగా కూలబడిపోయింది.

‘కాయకష్టం చేసైనా కూతురును గొప్పగా చదివిద్దామని అనుకున్నాం. ఇలా అయిందేంటి దేవుడా? మాకెవరు దిక్కు ఏం పాపం చేశామని మాకీ పెద్ద శిక్ష విధించావంటూ’ షర్మిల తల్లి అమ్మాజీ కూతురు మృతదేహాన్ని చూసి బోరుమంది.

‘దేవుడు మాకిచ్చిందే ఒక్క కూతురును. ఇప్పుడూ దానినీ తీసుకెళ్లిపోయాడు. మేం ఏమైపోవాలి? ఎవరి కోసం బతకాలంటూ’ ఝాన్సీ తల్లి రాజకుమారి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

విప్‌ దిగ్భ్రాంతి

పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై విప్‌ బూడి ముత్యాలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల ద్వారా ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన ఘటనపై అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎంపీడీఓ పోలినాయుడు, ఇన్‌ఛార్జి, తహసీల్దారు సత్యనారాయణ, ఎస్సై రామారావు సిబ్బందితో వెళ్లారు. పసిపిల్లల మృతదేహాలను ఎక్కడికో తీసుకువెళ్లి పోస్టుమార్టం చేయొద్దని తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. దీంతో ఎంపీడీఓ పోలినాయుడు, వైకాపా మండల అధ్యక్షుడు తాళపురెడ్డి రాజారామ్‌ కలిసి ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుతో ఫోన్‌లో సంప్రదించి వైద్యులను గ్రామానికి పిలిపించారు. ఊబిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

స్పందించిన అధికారులు

రెండు వారాల కిందటే బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట వద్ద పెద్దేరు దాటుతూ ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మాడుగుల మండలంలో మరో నలుగురు బాలలు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: Three died in river: నదిలో మునిగి ముగ్గురు మృతి

Last Updated :Jul 27, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.