ETV Bharat / crime

ఐటీ నిపుణులే లక్ష్యంగా.. సైబర్ మోసాలు

author img

By

Published : Feb 9, 2023, 1:32 PM IST

Hyderabad Cyber crimes : కొత్త సంవత్సరం కొత్త పంథాలో సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌సెంటర్లు, క్యూఆర్‌కోడ్స్‌.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. లక్షల కొద్ది నగదును కాజేస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులు, ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులే వీరి టార్గెట్. గ్రేటర్‌ హైదరాబాద్​లో నెలరోజుల్లోనే 500కు పైగా కేసులు నమోదయ్యాయి.

cyber crime
cyber crime

Hyderabad Cyber crime : సైబర్‌ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌సెంటర్లు, క్యూఆర్‌కోడ్స్‌.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలో జనవరిలో 500కుపైగా సైబర్‌ కేసులు నమోదయ్యాయి. 2023తో నేరస్థులు ట్రెండ్‌ మార్చారు. యువతీ, యువకులే లక్ష్యంగా కొత్త పంథాలో పంజా విసురుతున్నారు.

గాజులరామారానికి చెందిన ఐటీ నిపుణురాలి (26)కి పశ్చిమగోదావరి జిల్లా యువకుడినంటూ ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో పరిచయమయ్యాడు. వాట్సాప్‌ ద్వారా ఇద్దరూ వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు. తన బ్యాంకు ఖాతాలు నిలిపివేశారంటూ ఆ యువతి నుంచి దఫాల వారీగా రూ.34 లక్షలు కొట్టేశాడు.

ఆర్టీసీ కాలనీ యువతి (25)కి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మిత్రుడు.. కొన్నాళ్ల తరువాత లండన్‌ నుంచి బహుమతి పంపినట్లు యువతి వాట్సాప్‌కు సమాచారమిచ్చాడు. ముంబయి కస్టమ్స్‌ కార్యాలయానికి చేరిన బహుమతిని తీసుకొనేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.1.24 లక్షలు కాజేశారు. మల్లేపల్లికి చెందిన యువతి(24)కి వాట్సాప్‌ ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.లక్ష తీసుకొని ముఖం చాటేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ మాదాపూర్‌లోని ఐటీ నిపుణుడికి రూ.28 లక్షలు టోకరా వేశారు.

ఇక్కడా.. పాన్‌ఇండియా.. సైబర్‌ నేరస్థులు పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగారు. అన్ని భాషల్లోనూ కాల్‌సెంటర్లు, టెలీకాలర్స్‌ను ఏర్పాటు చేసుకొని హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌ రాష్ట్రాల్లో గ్రామాల నుంచి చక్రం తిప్పుతున్నారు. దిల్లీలో నకిలీ కాల్‌సెంటర్‌పై దాడి చేస్తే ఓ అపార్ట్‌మెంట్‌లో తెలుగు, తమిళం, మళయాళం, ఒడియా, హిందీ, ఇంగ్లిషు మాట్లాడేందుకు వేర్వేరుగా టెలీకాలర్స్‌ను నియమించినట్లు నగర సీసీఎస్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ గజరావు భూపాల్‌ తెలిపారు. మోసాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులు, ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

అత్యాశతో కష్టార్జితం నష్టపోవద్దు.. బ్యాక్‌డోర్‌ ఉద్యోగాలు, కొద్దిపెట్టుబడితో అధికరాబడి వస్తుందని చెప్పగానే నమ్మేయవద్దు. సాధ్యాసాధ్యాలను గుర్తించాలి. అవతలి వారు చెబుతున్న మాటలో నిజమెంత అనేది విచక్షణతో ఆలోచించాలి. ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపించగానే అనుసరించకుండా కొంత సమయం వాటిపై స్టడీ చేయాలి. నిజానిజాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. అత్యాశ ఉన్నంత వరకూ మోసాలు జరుగుతూనే ఉంటాయి. సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించగానే పోలీసులకు ఫిర్యాదు చేయండి. 1930 సేవలను ఉపయోగించుకోండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.