ETV Bharat / city

ఇవి ఫాలో అయితే చాలు.. పోలీసు జాబ్ మీ సొంతమైనట్టే..!

author img

By

Published : Apr 26, 2022, 8:59 AM IST

Police Jobs in Telangana : పోలీసులు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది. 16వేలకుపైగా పోస్టుల కోసం కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నారు. పరీక్షలకు ప్రిపరేషన్‌ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి? ఎలాంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలి? ఫిజికల్ టెస్టులకు ఎలా సన్నద్ధం కావాలి? ఇలా ఆశావహుల కోసం పోలీసు జాబ్ ఈజీగా కొట్టేసేలా తెలంగాణ పోలీసు అకాడమీలో క్రితంసారి టాపర్లుగా నిలిచిన ఎస్సైలు సూచనలిచ్చారు. మీరూ చదివేయండి. పోలీసు కొలువు కొట్టేయండి.

Police Jobs in Telangana
Police Jobs in Telangana

Police Jobs in Telangana : పోలీసు కొలువుల జాతరకు తెర లేచింది. 16వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్‌ సోమవారం వెలువడింది. దీంతో కొలువుల్ని దక్కించుకునేందుకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్ల ఉచిత శిక్షణ శిబిరాల్లోకి అర్హుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో వారికి ఎలాంటి శిక్షణ అవసరముంటుంది? రాతపరీక్షలో ఏయే అంశాలకు ప్రాధాన్యమివ్వాలి? శారీరక దారుఢ్య పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి? తదితర అంశాలపై తెలంగాణ పోలీస్‌ అకాడమీలో క్రితంసారి టాపర్లుగా నిలిచిన ఎస్సైల సూచనలు ఇవీ...

రాతపరీక్షలో అర్థమెటిక్‌ అండ్‌ రీజనింగ్‌ కీలకం : పోలీస్‌ ఎంపిక పరీక్షల్లో కీలకమైనది అర్థమెటిక్‌ అండ్‌ రీజనింగ్‌ సబ్జెక్ట్‌. ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి సిలబస్‌ దాదాపు ఒకటే. ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించిన 200 మార్కుల్లో ఈ సబ్జెక్ట్‌ నుంచి 100 మార్కులుంటాయి. మెయిన్స్‌కు సంబంధించి ఎస్సై పోస్టులకు 400 (కానిస్టేబుల్‌ పోస్టులకు 200) మార్కుల్లో సగం ఈ సబ్జెక్ట్‌వే. మిగిలిన సగం జనరల్‌ సైన్స్‌కు సంబంధించినవి. మెయిన్స్‌లో 65 శాతానికిపైగా మార్కులొస్తే ఉద్యోగం దక్కే అవకాశముంది. ఈ సబ్జెక్టులో మూడొంతులు, జనరల్‌ సైన్స్‌లో సగం మార్కులు సాధిస్తే కొలువుకు దగ్గరైనట్లే.

Preparation for Police Jobs : రాతపరీక్షకు సంబంధించి అర్థమెటిక్‌లో 10-15, రీజనింగ్‌లో 20వరకు టాపిక్స్‌ ఉంటాయి. వీటిని 5-6 విడతలు క్షుణ్నంగా చదవాలి. రోజువారీ సన్నద్ధతలో సగం సమయం ఈ సబ్జెక్ట్‌కే కేటాయించాలి. ఉదాహరణకు రోజూ 10 గంటలు సాధన చేస్తే 5 గంటలు ఈ సబ్జెక్ట్‌పై దృష్టి సారించాలి.

దిల్‌సుఖ్‌నగర్‌లాంటి ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాల్లో వారాంతపు పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీలైనన్ని ఎక్కువసార్లు వీటిని రాయాలి. ఈ పరీక్షలు మెయిన్స్‌ ప్యాటర్న్‌లో ఉంటాయి కాబట్టి తుదిపరీక్షకు బాగా ఉపయుక్తమవుతాయి. అలాగే మెయిన్స్‌ పరీక్షలో సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది తెలుసుకోవచ్చు.

పరుగును మెరుగుపరుచుకోవడంపై దృష్టి.. : ఈ ఉద్యోగాలకు లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, రన్నింగ్‌లాంటి శారీరక దారుఢ్య పరీక్షలు అదనంగా ఉంటాయి. ఎస్సైతోపాటు కానిస్టేబుళ్ల పోస్టులకూ ఈ ఈవెంట్లు ఒకేలా ఉంటాయి. వీటిలో పరుగుపందెం కీలకం. మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తుండగా, పురుషులకు 100 మీటర్లతో పాటు 800 మీటర్ల పరుగుపందెం అదనం. ఈ క్రమంలో పందెంలో నెగ్గుకురావడానికి సన్నద్ధత కీలకం.

సాధన సమయంలో ఒకేసారి ఎక్కువగా పరుగెత్తకూడదు. తొలుత 100 మీటర్లు.. 150 మీటర్లు.. అనంతరం 200 మీటర్లు ఇలా రోజుకు కొంత పెంచుకుంటూ పోవాలి. పరుగుతో పాటు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ను సాధన చేసే ముందు వార్మప్‌ ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి. సాధన అయిపోయిన తర్వాత కూడా స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కచ్చితంగా చేయాలి.

జిల్లాల్లో నిర్వహిస్తున్న పోలీసు ఉచిత శిక్షణ శిబిరాలు శారీరక దారుఢ్య పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటాయి. ఈ శిబిరాల్లో పోలీసు నిపుణులే శిక్షణ ఇస్తుంటారు కాబట్టి చాలావరకు మెలకువలు నేర్చుకోవచ్చు.

లావుడ్య శ్రీకాంత్‌

లావుడ్య శ్రీకాంత్‌ ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా ఉన్నారు. 2019-20లో తెలంగాణ పోలీస్‌ అకాడమీలో జరిగిన శిక్షణలో బ్యాచ్‌ టాపర్‌ ఈయనే. బెస్ట్‌ ఆల్‌రౌండర్‌, బెస్ట్‌ అవుట్‌డోర్‌ పెర్‌ఫార్మెన్స్‌లో టాపర్‌గా నిలిచి ముఖ్యమంత్రి రివాల్వర్‌తో పాటు డైరెక్టర్‌ జనరల్‌ పోలీస్‌ ట్రోఫీని అందుకున్నారు.

పెంటబోయిన మాధవి

పెంటబోయిన మాధవి ప్రస్తుతం హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు. క్రితంసారి ఎస్సై తుది రాతపరీక్షలో 232మార్కులు సాధించారు. 2019-20లో తెలంగాణ పోలీస్‌ అకాడమీలో జరిగిన రెండో బ్యాచ్‌ శిక్షణలో మొత్తం 661 మంది మహిళ ఎస్సై(సివిల్‌) అభ్యర్థుల్లో ఇండోర్‌ పెర్‌ఫార్మెన్స్‌లో టాపర్‌గా నిలిచారు. హోంమినిస్టర్‌ బ్యాటన్‌తోపాటు డైరెక్టర్‌ మెడల్‌ను అందుకున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.