ETV Bharat / business

ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానానికి అదానీ

author img

By

Published : Apr 12, 2022, 9:48 PM IST

World Richest List 2022: ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 118 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ఆరో స్థానానికి ఎగబాకారు. గూగుల్‌ వ్యవస్థాపకులైన లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లను దాటేసి ఆయన ఈ స్థానానికి చేరుకున్నారు.
adani news
ప్రపంచ కుబేరుల జాబితా

World Richest List 2022: బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. 118 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకారు. గూగుల్‌ వ్యవస్థాపకులైన లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లను దాటేసి ఆయన ఈ స్థానానికి చేరుకున్నారు. సోమవారం అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.65,091 కోట్లు ఎగబాకింది. ఈ నేపథ్యంలోనే అదానీ సంపద అమాంతం పెరిగింది. మరోవైపు అమెరికాలో టెక్‌ స్టాక్‌లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. దీంతో లారీ పేజ్‌, బ్రిన్‌ సంపద విలువలో తగ్గుదల నమోదైంది. ఇది కూడా అదానీ స్థానం ఎగబాకడానికి దోహదపడింది. ఫోర్బ్స్‌ రియల్‌టైం బిలియనీర్స్‌ జాబితాలోనూ అదానీ ఆరోస్థానంలో ఉండడం విశేషం.

గత ఏడాది వ్యవధిలో అదానీ సంపద 41.6 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్‌ ఎనర్జీ దేశంలో అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన తొలి పది సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,22,526.28 కోట్లకు చేరి పదో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ స్టాక్‌ ధర ఏకంగా 19.99 శాతం ఎగబాకడం విశేషం. మార్కెట్‌ విలువ పరంగా రూ.17.65 లక్షల కోట్లతో రిలయన్స్‌ తొలిస్థానంలో ఉండగా.. టీసీఎస్‌ రూ.13.52 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.8.29 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.7.43 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.5.27 లక్షల కోట్లు, హెచ్‌యూఎల్‌ రూ.5.08 లక్షల కోట్లు, ఎస్‌బీఐ రూ.4.59 లక్షల కోట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.4.44 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.4.39 లక్షల కోట్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.4.22 లక్షల కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి: ఐటీ కంపెనీ బంపర్ గిఫ్ట్స్... 100మంది ఉద్యోగులకు కార్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.