ETV Bharat / business

'రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేస్తే అధికారులే నేరుగా విచారించొచ్చు'

author img

By

Published : Sep 3, 2022, 6:56 AM IST

GST
జీఎస్‌టీ

రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. విచారణ ప్రక్రియ చేపట్టాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు సరైన సాక్ష్యాలు ఉన్నాయా అని పరిశీలించడం ముఖ్యమని వెల్లడించింది.

రూ.5 కోట్లకు మించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత.. లేదా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) దుర్వినియోగానికి పాల్పడిన వారిపై జీఎస్టీ అధికారులే నేరుగా విచారణ ప్రక్రియ చేపట్టొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తరచు పన్ను (రెండు సార్లకు మించి) ఎగ్గొట్టేవారికి, దర్యాప్తు సమయంలో అరెస్టు చేసిన సందర్భాల్లో ఈ పరిమితి వర్తించబోదని పేర్కొంది.

'విచారణ ప్రక్రియ చేపట్టాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు సరైన సాక్ష్యాలు ఉన్నాయా అని పరిశీలించడం ముఖ్యమ'ని జీఎస్టీ దర్యాప్తు విభాగం వెల్లడించింది. పన్నుల అధికారులు విచారణ చేపట్టడం అంటే.. అపరాధిపై న్యాయపరమైన చర్యలు ప్రారంభమైనట్లుగా భావించాల్సి ఉంటుంది. 'ఒక కంపెనీ లేదా పన్ను చెల్లింపుదారు గత రెండేళ్లలో రెండు సార్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడినా లేదంటే తప్పుడు పద్ధతిలో రిఫండ్‌ లేదా ఐటీసీని క్లెయిమ్‌ చేసుకున్నా 'తరచు' ఎగవేతకు, ఐటీసీ దుర్వినియోగానికి పాల్పడిన వారిగా పరిగణిస్తారు. ఇటువంటి వారిని గుర్తించేందుకు డిజిటల్‌ సమాచారాన్ని ఉపయోగించుకోవాల'ని సీబీఐసీ తెలిపింది. దర్యాప్తు సమయంలో అరెస్ట్‌ చేసినప్పుడు, బెయిల్‌ రాని సందర్భంలో.. అరెస్టు అయిన 60 రోజుల్లోగా విచారణ ఫిర్యాదును కోర్టులో సమర్పించాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇతర అరెస్టు సందర్భాల్లోనూ నిర్దిష్ట సమయంలోగా ఫిర్యాదును సమర్పించాలి. ఎలాంటి సందర్భమైనప్పటికీ విచారణ ప్రక్రియ కోసం నిర్ణయం తీసుకునే ముందు నేర స్వరూపం, దాని తీవ్రత, ఎగ్గొట్టిన పన్ను లేదా తప్పుగా క్లెయిమ్‌ చేసుకున్న రిఫండ్‌ విలువ, సేకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.

ఇవీ చదవండి: 'ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన లక్ష్యం'

ఐటీ రిఫండ్​ జమ అయిందా? ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.