ETV Bharat / business

'ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన లక్ష్యం'

author img

By

Published : Sep 2, 2022, 5:48 PM IST

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన కర్తవ్యమని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ధరల పెరుగుదల, జీడీపీ వృద్ధిపై ప్రపంచ పరిణామాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. భారత్‌ వద్ద పెద్ద ఎత్తున విదేశీ మారక నిల్వలు ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు.

taming inflation
రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ప్రస్తుతం 'రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ముందున్న ప్రథమ కర్తవ్యమని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పునరుద్ఘాటించారు. అయితే, ఈ క్రమంలో వృద్ధిపై ఉండే ప్రతికూల ప్రభావాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ధరల పెరుగుదల, వృద్ధిపై ప్రపంచ పరిణామాలు ప్రభావం చూపుతాయని దాస్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమన ప్రభావం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 13.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 20.1 శాతంగా ఉంది. త్రైమాసికంవారీగా చూస్తే 4.1 శాతం పెరిగింది.

జూన్‌ త్రైమాసికంలో వృద్ధిరేటు 16.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తొలుత ఆర్‌బీఐ అంచనా వేసింది. లెక్కలు తప్పడంతో దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు దాస్‌ తెలిపారు. వచ్చే ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో దీనిపై వివరణ ఇస్తామని పేర్కొన్నారు. బ్యాంకుల రుణ వృద్ధిని ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ సమీక్షిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రాంతంలో పరిధి దాటినట్లు భావిస్తే వెంటనే బ్యాంకులను హెచ్చరిస్తామని పేర్కొన్నారు.

భారత్‌ వద్ద పెద్ద ఎత్తున విదేశీ మారక నిల్వలు ఉన్నాయని దాస్‌ వెల్లడించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద అండ అని వివరించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయిని ఇవే స్థిరంగా ఉంచుతున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ పెంచిన వడ్డీరేట్లు ఇంకా రుణరేట్లకు పూర్తిగా బదిలీ కాలేదని పేర్కొన్నారు. రుణ, డిపాజిట్‌ రేట్ల మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గుతోందన్నారు. గత నెల ఆర్‌బీఐ రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే.

భారత బ్యాంకుల వద్ద సరిపడా మూలధన నిల్వలు ఉన్నాయని దాస్‌ తెలిపారు. ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మరిన్ని నిధుల్ని సమీకరించుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ దిశానిర్దేశం చేస్తుందని వివరించారు. రుణ వృద్ధిని స్థిరంగా కొనసాగించాలంటే బ్యాంకులు మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిందేనని తెలిపారు.

ఇవీ చదవండి: ఐటీ రిఫండ్​ జమ అయిందా? ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

స్టార్​బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.