ETV Bharat / business

ఐటీ రిఫండ్​ జమ అయిందా? ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

author img

By

Published : Sep 2, 2022, 3:01 PM IST

మన ఖాతాలోకి డబ్బు వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు. ఇది రిఫండుకూ వర్తిస్తుంది. ఏదో ఖర్చుకు దీన్ని వాడుకోవడం వల్ల ఫలితం ఉండదు. ఒక ఆర్థిక లక్ష్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తే బాగుంటుంది. మరి, మీ రిఫండును మీరు ఎలా వాడుకుంటున్నారు?

IT Refund
IT Refund

IT Refund : చెల్లించాల్సిన పన్నుకన్నా అధికంగా చెల్లించినప్పుడు.. రిటర్నులు దాఖలు చేసి రిఫండు పొందేందుకు వీలుంటుంది. కొన్నిసార్లు మినహాయింపులు సరిగ్గా క్లెయిం చేసుకోని సందర్భంలోనూ చెల్లించిన పన్ను కొంత వెనక్కి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను జులై 31లోగా రిటర్నులు దాఖలు చేసి, రిఫండు అర్హత ఉన్నవారి ఖాతాలో డబ్బు జమ అవుతోంది. మరి, మీ రిఫండును మీరు ఎలా వాడుకుంటున్నారు?

ప్రీమియం చెల్లించండి..
ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, జీవిత బీమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. ఇప్పటి వరకూ మీకు ఈ పాలసీలు లేకపోతే.. రిఫండు మొత్తాన్ని ఈ పాలసీలు తీసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏటా మీకు రిఫండు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి, వచ్చే ఏడాది ప్రీమియానికి ఇప్పుడే తగిన ఆలోచన ఉండాలి.

చిన్న అప్పులు తీర్చేయండి..
క్రెడిట్‌ కార్డు బిల్లు బాకీ పడ్డారా? వ్యక్తిగత రుణం తీసుకున్నారా? రిఫండుగా వచ్చిన మొత్తంతో వీటిని తీర్చేందుకు వాడుకోవచ్చు. దీనివల్ల అప్పుల నుంచి కాస్త ఊరట లభిస్తుంది. స్వల్ప మొత్తం వచ్చినా.. క్రెడిట్‌ కార్డు బాకీ తీర్చేయడం ఉత్తమం.

అత్యవసర నిధిగా..
నిబంధనల మేరకు మీకు రావాల్సిన మొత్తమే అయినా.. ఇది ఇప్పటికే మీరు ఖర్చు చేసినట్లు. ఇప్పుడు వచ్చిన రిఫండును అత్యవసర నిధిగా వాడుకునేందుకు పక్కన పెట్టుకోండి. కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపోయే మొత్తం ఎప్పుడూ అత్యవసర నిధిగా ఉండాలని మర్చిపోవద్దు.

దీర్ఘకాలిక పెట్టుబడిగా..
ఈ మొత్తంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి అవసరాలూ లేకపోతే.. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కేటాయించండి. ఇందుకోసం ఈక్విటీ పథకాలను ఆశ్రయించవచ్చు. పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. దీనివల్ల పన్ను భారం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

పన్ను బాకీ చెల్లింపు..
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన రిఫండును ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు. ఎటూ మీ వేతనం నుంచి టీడీఎస్‌ వెళ్తుంది కాబట్టి, అందులో కొంత మొత్తాన్ని ఇప్పుడు వచ్చిన రిఫండుతో భర్తీ చేసుకోవచ్చు.

పిల్లలకు బహుమతి..
రిఫండు మొత్తాన్ని పిల్లలకు బహుమతిగా ఇవ్వండి. అంటే వారి కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. వారి భవిష్యత్తుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి: ఆ ఫోన్​ కాల్స్​, మెసేజెస్​ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా ్వాహా!

స్టార్​బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.