ETV Bharat / international

'రష్యా, చైనాలది అవకాశవాద బంధం కాదు'- పుతిన్ - Putin China Visit

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 2:49 PM IST

Putin China Visit : చైనా, రష్యా మధ్య అవకాశావాద సంబంధాలు లేవని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి సుస్థిరత, ఇతర దేశాలకు ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తాయని రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ సంయుక్త ప్రకటన చేశారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. తొలి రోజు వ్యూహాత్మక భాగస్వామ్యం, దౌత్య, వాణిజ్య, భద్రతా సంబంధాలపై ఇరుదేశాల అధినేతలు చర్చించుకున్నారు.

Putin China Visit
Putin China Visit (APTN)

Putin China Visit : రష్యా, చైనాల మధ్య అవకాశావాద సంబంధాలు లేవని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి సుస్థిరత కలిగించే అంశంగా మారాయని, ఇతర దేశాలకు చక్కటి ఉదాహరణగా నిలిచాయని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంయుక్త ప్రకటన చేశారు. చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, దౌత్య, వాణిజ్య, భద్రతా సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల అధినేతలు జిన్​పింగ్, పుతిన్ చర్చించుకున్నారు. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

పుతిన్​కు ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా వచ్చిన పుతిన్​కు గురువారం ఘనస్వాగతం లభించింది. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ పరిస్థితి, పశ్చిమ దేశాలతో రష్యా ఘర్షణలపై పుతిన్, జిన్​పింగ్​ల మధ్య చర్చలు జరిగాయి. "మేం విశ్వసించే మంచి స్నేహితుడు మా దేశ భాగస్వామిగా ఉండటానికి చైనా వస్తున్నారు. చైనా, రష్యా దేశ ప్రజల మధ్య శాశ్వత స్నేహాన్ని బలపరచడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి రష్యాతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది" అని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ తెలిపారు.

చైనా, రష్యా మధ్య బంధం బలంగా ఉందని పుతిన్ అన్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాలు సహకరించుకుంటాయని తెలిపారు. రష్యా, చైనా మధ్య అవకాశవాద సంబంధాలు లేవని వెల్లడించారు. ఈ సంబంధాలు ఎవరికీ వ్యతిరేకంగా ఉండవని చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్​తో యుద్ధం కొనసాగుతున్నవేళ చైనా శాంతి ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు తెలిపారు. ఇది దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

ఐదోసారి బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. అయితే ఈశాన్య ఉక్రెయిన్​లోని ఖర్కీవ్‌ ప్రాంతంలో రష్యా దూకుడు పెంచిన నేపథ్యంలో జెలెన్​స్కీ తన విదేశీ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. పుతిన్ మాత్రం జిన్​పింగ్​తో చర్చలు జరిపేందుకు చైనాలో పర్యటించడం గమనార్హం. ఉక్రెయిన్​పై దాడులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, చైనా అధ్యక్షుడితో పుతిన్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, రష్యా రక్షణ శాఖకు చైనా కీలకమైన సామగ్రిని ఎగుమతి చేస్తోందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా రక్షణ శాఖకు చైనా మద్దతిస్తోందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను డ్రాగన్ కొట్టిపారేసింది. అంతలోనే చైనా పర్యటనకు పుతిన్ వెళ్లడం గమనార్హం.

హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్​న్యూస్- ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండొచ్చు! - H1B Visa New Guidelines

మీటింగ్​ నుంచి వస్తుండగా స్లొవేకియా ప్రధానిపై కాల్పులు- పరిస్థితి విషమం - SLOVAK PRIME MINISTER Attacked

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.