ETV Bharat / business

అదానీ బాటలోనే అనిల్‌ అగర్వాల్‌.. అప్పుల ఒత్తిళ్లలో వేదాంత.. ఇంకో తుపాను రావొచ్చంటున్న ఎస్‌ అండ్‌ పీ

author img

By

Published : Feb 28, 2023, 9:30 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ బాటలో మరొక బిలియనీర్, వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్​ కూడా చేరనున్నారు. అనిల్​ అగర్వాల్ కూడా మార్కెట్లలో చిన్న తుపానును సృష్టించే అవకాశం ఉందని అమెరికా దిగ్గజ విశ్లేషణా సంస్థ ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది.

vedanta group share price
వేదాంతా గ్రూప్ లేటెస్ట్ న్యూస్

అమెరికాకు చెందిన హిండెన్​బర్గ్​ నివేదిక నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలోనే 236 బిలియన్‌ డాలర్ల గౌతమ్‌ అదానీ సామ్రాజ్యం కాస్తా అయిదింట మూడొంతులను కోల్పోయింది. గౌతమ్ అదానీ సంపద ఎంత వేగంగా వృద్ధి చెందిందో.. అంతే వేగంగా కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యారు. ఈ క్రమంలోనే ఇంకొక భారతీయ బిలినీయర్​​, వేదాంతా గ్రూప్​ అధిపతి అనిల్‌ అగర్వాల్‌ కూడా మార్కెట్లలో చిన్న తుపానును సృష్టించే అవకాశం ఉందని అమెరికా దిగ్గజ విశ్లేషణ సంస్థ ఎస్‌ అండ్‌ పీ తెలిపింది.

కొన్నాళ్ల క్రితం లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన వేదాంతా రిసోర్సెస్‌కు అనిల్ అగర్వాల్ అధిపతి. ఆ కంపెనీ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2024 జనవరిలో 100 కోట్ల డాలర్ల బాండ్లకు గడువు తీరిపోనుంది. ఈ క్రమంలో తనకున్న రుణాలను వేదాంతా రిసోర్సెస్​ క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. అయితే గత 11 నెలల్లో నికర అప్పులను 2 బిలియన్‌ డాలర్లు తగ్గించుకుని.. 7.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్ల)కు పరిమితం చేసుకుంది వేదాంతా రిసోర్సెస్​. 2023 సెప్టెంబరు వరకు, ఈ సంస్థ చెల్లించాల్సిన రుణాలకు ఇబ్బందేమీ ఉండబోదనీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇంక్‌ తెలిపింది. అయితే ఈ 2023 సెప్టెంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు వేదాంతా తీర్చాల్సిన రుణం కోసం 150 కోట్ల డాలర్ల నిధులు అవసరం. అయితే నిధుల సమీకరణ కోసం అగర్వాల్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులే ఆందోళనకరమని విశ్లేషణా సంస్థ ఎస్ అండ్​ పీ తెలిపింది.

వచ్చే కొద్ది వారాలు కీలకం..
'వేదాంతా అనిల్‌ అగర్వాల్‌ నిధుల సమీకరణకు వచ్చే కొద్ది వారాలు కీలకం. ఒక వేళ అందులో విఫలమైతే మాత్రం ఇప్పటికే' బి'- క్రెడిట్‌ రేటింగ్‌లో ఉన్న బాండ్లు కాస్తా మరీ ఒత్తిడిలోకి వెళ్తాయి.' అని అమెరికా విశ్లేషణా సంస్థ ఎస్‌ అండ్‌ పీ ఫిబ్రవరిలో హెచ్చరించింది. గౌతమ్ అదానీకున్న 24 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.99 లక్షల కోట్ల) రుణంతో పోలిస్తే అగర్వాల్‌ అప్పులు మూడో వంతే. అయినప్పటికీ.. అగర్వాల్​ బాండ్ల రేటింగ్‌ మరీ తక్కువగా ఉండడమే ఆందోళన కలిగించే అంశమని ఎస్ అండ్​ పీ తెలిపింది.

హిందుస్థాన్‌ జింక్‌ కాపాడుతుందనుకుంటే..
ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌లో తన వాటాను 20 ఏళ్ల కిందటి నుంచే అనిల్​ అగర్వాల్‌ పెంచుకుంటూ వెళ్లారు. హిందుస్థాన్‌ జింక్‌లో క్రితంతో పోల్చితే తగ్గినా.. 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల)వరకు నగదు నిల్వలున్నాయి. ప్రతి త్రైమాసికంలో ఈ కంపెనీ 300-600 మిలియన్​ డాలర్ల ఎబిటాను అందిస్తోంది. ప్రస్తుతం హిందుస్థాన్​ జింక్​లో.. వేదాంతా లిమిటెడ్‌కు 65 శాతం వాటా ఉంది. ఈ ఏడాది జనవరిలో టీహెచ్‌ఎల్‌ జింక్‌ మారిషస్‌ వాటాను, హిందుస్థాన్‌ జింక్‌కు విక్రయించాలని వేదాంతా కంపెనీ నిర్ణయించింది. అందుకు ఓ కారణం ఉంది. వేదాంతాలో 70 శాతం వాటా వేదాంతా రిసోర్సెస్‌దే. అందువల్ల ఈ ఒప్పందం ద్వారా 3 బిలియన్‌ డాలర్ల రుణాలను తగ్గించుకుందామని భావించింది. అయితే హిందుస్థాన్‌ జింక్‌లో ఇంకా 30% వాటా ఉన్న కేంద్రం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఒక వేళ తమ మాట కాదని ముందుకెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫిబ్రవరి 17న రాసిన ఒక లేఖలో హెచ్చరించింది. మారిషస్‌ వాటా విలువపై కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది.

ఇపుడు అగర్వాల్‌ ముందు రెండు సమస్యలు..
వేదాంతా అధినేత అనిల్‌ అగర్వాల్‌ ముందు ఇప్పుడు రెండు సమస్యలున్నాయి. హిందుస్థాన్‌ జింక్‌ వద్ద ఉన్న నగదు నిల్వలను వినియోగించుకోకపోతే తన రుణ సామర్థ్యం తగ్గుతుందని గ్రహించింది వేదాంతా. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. అమెరికాలోనూ తక్కువ వడ్డీకి తాజాగా అప్పులు పుట్టడం కష్టమే అని చెప్పాలి.

ఇక రెండో సమస్య రాజకీయపరమైనది. ఆస్తుల విక్రయానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. దేశీయంగా గుజరాత్‌లో, ఫాక్స్‌కాన్‌తో కలిసి అనిల్‌ అగర్వాల్‌ 19 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్ష రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టును మహరాష్ట్ర నుంచి మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు మార్చడమే అందుకు కారణం. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్​ వంటి వారు సైతం చిప్‌ తయారీలో వేదాంతాకున్న అనుభవాన్ని ప్రశ్నించడం ప్రతికూలంగా మారుతోంది.

ఏడేళ్ల కిందటా ఇదే సమస్య
అనిల్ అగర్వాల్‌కు ఇదే సమస్య ఏడేళ్ల క్రితం ఎదురైనప్పటికీ.. హిందుస్థాన్‌ జింక్‌ ఇచ్చిన ప్రత్యేక డివిడెండుతో ఆయన గట్టెక్కారు. ఆ సమయంలో కంపెనీ వద్ద 5 బిలియన్​ డాలర్ల వరకు నగదు నిల్వలు ఉన్నాయి. మైనారిటీ వాటాదారుగా ఆర్థిక మంత్రిత్వశాఖకూ తన వాటా దక్కింది. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అగర్వాల్‌కు అప్పుపుట్టడం కష్టం మారింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.