ETV Bharat / business

ఎయిర్​టెల్ యూజర్లకు షాక్.. టారిఫ్​ ధరలు మరింత పెంపు!

author img

By

Published : Feb 28, 2023, 7:21 AM IST

టెలికాం వ్యాపారంలో పెట్టుబడులపై ప్రతిఫలం చాలా తక్కువుగా ఉన్నందున, ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌ల పెంపు ఉండే అవకాశం ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ తెలిపారు. ప్రజల వ్యయాలతో పోలిస్తే టారిఫ్‌ పెంపు తక్కువగానే ఉంటుందని ఆయన అన్నారు.

airtel tariff hike 2023
ఎయిర్​టెల్ టారిఫ్ పెంపు

టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ఏడాది మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ సునీల్‌ భారతీ మిత్తల్‌ తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్నందున టారిఫ్‌ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వివిధ వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే ఉంటుందన్నారు. దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమన్న మిత్తల్‌.. భారత్‌ డిజిటల్‌-ఆర్థికవృద్ధి కల సాకారమైనట్లు వివరించారు. భారతీ ఎయిర్‌టెల్‌ గత నెలలో కనీస రీఛార్జ్ ధరను 57శాతం పెంచగా.. త్వరలోనే టారిఫ్‌ ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది.

10 మిలియన్లు దాటిన యూజర్లు..
భారతీయ ఎయిర్​టెల్ 5జీ యూజర్లు 10 మిలియన్లు దాటినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 2024 చివరినాటికి 5జీ సేవలు దేశంలోని ప్రతీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చేరువయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నామని భారతీ ఎయిర్​టెల్ పేర్కొంది. ఎయిర్​టెల్ దేశంలో 5జీ సేవలను 2022 అక్టోబరు 1న ప్రారంభించింది.

ఎయిర్​టెల్ టారీఫ్ పెంపు..
2023 జనవరిలో ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్​టెల్​ టారిఫ్​లు పెంచింది. 28 రోజుల కాలపరిమితి కలిగిన బేస్‌ ప్లాన్‌ ధరను 57 శాతం పెంచి రూ.155కు చేర్చింది. అప్పటికి ఎయిర్​టెల్​ నెలవారీ రీచార్జ్​ ప్లాన్​ రూ.99 రూపాయలుగా ఉండేది. ఇందులో 200 మెగాబైట్ల డేటా,​ రూ.99 టాక్​టైక్​ (రూ.2.5/సెకను) 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా దీన్ని తొలుత హరియాణా, ఒడిశా సర్కిళ్లలో గతేడాది నవంబరులోనే ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా అమలు చేసింది ఎయిర్​టెల్​.

ఎయిర్‌టెల్‌ 2021లోనూ ఇలాగే రూ.79తో ఉన్న కనీస ప్లాన్‌ను ఉపసంహరించుకొని దాని స్థానంలో రూ.99 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అప్పుడు కూడా తొలుత కొన్ని సర్కిళ్లలో ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.