ETV Bharat / business

మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చే టాప్​-10 లాంగ్​టర్మ్ ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 12:15 PM IST

Best Long Term Investment Plans And Options In India 2024 In Telugu : మీరు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. దీర్ఘకాలిక పెట్టుబడులు వల్ల భవిష్యత్​లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నష్టభయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే లాంగ్​టర్మ్ ఇన్వెస్ట్​మెంట్స్​ కోసం ఉన్న బెస్ట్ ఆప్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Long Term Investment Options
Best Long Term Investment Plans

Best Long Term Investment Plans And Options In India 2024 : మనం భవిష్యత్ కోసం పొదుపు, మదుపు చేయాలని అనుకుంటాం. ఇందుకోసం మనకు తోచినంత సొమ్మును మదుపు చేస్తుంటాం. అయితే స్వల్పకాల పెట్టుబడుల కంటే, దీర్ఘకాల పెట్టుబడుల వల్ల, భవిష్యత్​లో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల మనం అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశముంటుంది. పైగా కొన్ని పెట్టుబడి పథకాలు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పిల్లల ఉన్నత చదువులు, వివాహం, ఇల్లు కొనడం, పదవీ విరమణ ప్రణాళిక లాంటి పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ఇన్​ఫ్లేషన్ ఎఫెక్ట్​
మన ఆదాయంపై ద్రవ్యోల్బణం ప్రభావం బాగా ఉంటుంది. మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 6%-7% మధ్య ఉంది. ఇది బాగా పెరిగినా లేదా బాగా తగ్గినా మన పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.

ఉదాహరణకు ప్రస్తుతం ఈపీఎఫ్‌పై 8.15%, పీపీఎఫ్‌పై 7.10% వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ రెండు పెట్టుబడులు కూడా కొంత మేరకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే విధంగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వ పథకాలు కనుక నష్టభయం ఉండదు. అదే ఈక్విటీల్లో అయితే నష్టభయం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో అస్థిరతలు ఉన్నా, దీర్ఘకాల పెట్టుబడులు పెడితే, 10%-15% రాబడి లభిస్తుంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ఆప్షన్లు గురించి తెలుసుకుందాం.

Long Term Investment Options :

  1. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్​ : ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్​ విభిన్నమైన స్టాక్స్​ను కొనుగోలు చేస్తాయి. దీనిలో రిస్క్, రివార్డ్ రెండూ సమానంగా ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కనీసంగా, వార్షిక రాబడి 10-15% ఉండే అవకాశం ఉంది. కాస్త రిస్క్‌ చేయగల సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులకు ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతాయి.
  2. REITs : రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వాస్తవానికి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (REIT) అనేది విలువైన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. అందువల్ల మదుపరులు నేరుగా ఆస్తులు కొనకుండా, వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని ద్వారా నెలవారీగా మీకు అద్దె రూపంలో మంచి ఆదాయం లభిస్తుంది. వాస్తవానికి REITs కూడా రియల్‌ ఎస్టేట్‌ మాదిరిగానే పనిచేస్తాయి. ఇవి సెబీ నియంత్రణలో ఉంటాయి కనుక, ఆర్థిక వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. అందువల్ల మదుపరుల సొమ్ముకు భరోసా ఉంటుంది.
  3. PPF : ఈ ప్రభుత్వ పథకం వల్ల స్థిర వడ్డీరేటు, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇది 15 ఏళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉన్న దీర్ఘకాలిక పొదుపు పథకం. 6 ఏళ్ల తర్వాత అత్యవసర పరిస్థితిలో పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. దీనిలో వచ్చే రాబడిపై పన్ను ఉండదు. పదవీ విరమణ ప్రణాళిక వేసుకునేవారికి PPF బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రస్తుతం పీపీఎఫ్​ వడ్డీ రేటు 7.10%గా ఉంది.
  4. EPF : ఉద్యోగుల పదవీ విరమణ కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకం ఇది. ఇది కూడా స్థిర వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు అందరికీ ఇది తప్పనిసరి. ప్రస్తుతం ఈపీఎఫ్​ వడ్డీ రేటు 8.15%గా ఉంది.
  5. NPS : ఇది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీనికి పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈక్విటీ, డెట్‌, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతారు. పాలసీదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడికి లాక్ ఇన్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఈ ఎన్​పీఎస్ పెట్టుబడులపై 8-10% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
  6. Real Estate : రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే, చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఖాళీ ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాలు, నివాస స్థలాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే దీనిలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. మంచి రాబడి కోసం దీర్ఘకాలం పాటు వేచి ఉండాల్సి రావచ్చు. భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టగల స్థోమత ఉన్నవారికి మాత్రమే ఇవి అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ లాభాలు ఆయా ప్రాంతాలను అనుసరించి మారుతూ ఉంటాయి.
  7. Public Sector Bonds​ : ఈ బాండ్లను ప్రభుత్వ రంగ సంస్థ(PSU)లు జారీ చేస్తాయి. వీటి వడ్డీ రేట్లు 7-9% వరకు ఉంటాయి. AAA రేటెడ్ బాండ్లను సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు.
  8. సుకన్య సమృద్ధి యోజన (SSY) : ఆడ పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక పథకం ఇది. అమ్మాయిల విద్య/ వివాహ ఖర్చుల కోసం ఈ దీర్ఘకాలిక పొదుపు పథకంలో డబ్బులు పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 8.20%గా ఉంది.
  9. ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్​ (FD) : నిర్దిష్ట కాలవ్యవధికి మాత్రమే పొదుపు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. మీ అసలు, రాబడులకు కచ్చితమైన హామీ ఉంటుంది. ప్రస్తుతానికి ఎఫ్​డీలపై గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. నష్టభయం వద్దనుకునే సంప్రదాయ పెట్టుబడిదారులకు ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్లు అత్యంత అనుకూలంగా ఉంటాయి.
  10. IPO : ఒక మంచి కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (IPO)కు వచ్చినప్పుడు, దానిలో మదుపు చేయవచ్చు. లిస్టింగ్ లాభాల కోసం కాకుండా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్​మెంట్ దృక్పథంతో దీనిలో మదుపు చేయాలి. అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తే, మీ ఆర్థిక లక్ష్యాలు కచ్చితంగా నెరవేరే వీలు ఉంటుంది.

టాప్​ అప్​ హెల్త్ ఇన్సూరెన్స్​ వల్ల లభించే బెస్ట్​ బెనిఫిట్స్ ఇవే!

క్యారీ బ్యాగ్​పై డబ్బులు వసూలు చేశారా? ఇలా చేస్తే పరిహారం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.