ETV Bharat / bharat

గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏకపక్షంగా మంత్రి బర్తరఫ్‌.. ఆ హక్కు లేదన్న సీఎం

author img

By

Published : Jun 29, 2023, 9:50 PM IST

Updated : Jun 29, 2023, 10:47 PM IST

Senthil Balaji News : తమిళనాడు గవర్నర్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి సెంథిల్‌ బాలాజీని పదవి నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ మేరకు రాజ్​భవన్​ ఓ ప్రకటనను విడుదల చేసింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

senthil-balaji-dismissed-from-the-post-of-minister-tamilnadu-governor-order
తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని బర్తరఫ్‌

Senthil Balaji News : తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని ఏకపక్షంగా బర్తరఫ్‌ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి. సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం రాజ్‌భవన్‌ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. బాలాజీ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని రాజ్‌భవన్‌ తన ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయని వెల్లడించింది. మంత్రిగా ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశముందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో జైలులో ఉన్న సెంథిల్‌ బాలాజీపై ఎన్​ఫోర్స్​మెంట్ విచారణ జరుగుతుంది. మరికొన్ని ఇతర కేసులు సైతం రాష్ట్ర పోలీసుల అధ్వర్యంలో దర్యాప్తులో ఉన్నాయి.

సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగితే న్యాయపరమైన చర్యలు అడ్డుకుంటారని.. రాష్ట్రంలో రాజ్యాంగ నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని రాజ్​భవన్​ తన ప్రకటనలో వివరించింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్​ఎన్​ రవి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.

Senthil Balaji Dismissed from the post of Minister tamilnadu Governor Order
గవర్నర్ ఉత్తర్వులు

'న్యాయపరంగా ఎదుర్కొంటాం'
Tamil Nadu CM MK Stalin: అయితే, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సంప్రదించకుండానే మంత్రి మండలి నుంచి సెంథిల్‌ బాలాజీని తొలగించడంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సీఎం స్టాలిన్‌.. గవర్నర్‌ రవి తీరును తప్పుబట్టారు. గవర్నర్‌కు ఆ హక్కులేదని.. ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.

2016లో రవాణా శాఖలో నియామకాల కోసం ముడుపులు తీసుకున్నారని సెంథిల్​ బాలాజీపై ఆరోపణలున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై ఈడీతో పాటు ఇతర జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణకు పూనుకున్నాయి. 2023 జూన్ 14న సెంథిల్​ బాలాజీని ఈడీ అరెస్ట్​ చేసింది. అనంతరం కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. అనుకోకుండా బాలాజీకి ఛాతినొప్పి రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. జూన్​ 21న బాలాజీకి సర్జరీ కూడా జరిగింది. దీంతో బాలాజీని కస్టడీలోకి తీసుకున్నప్పటకీ ఈడీ విచారణ చేయలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. జూలై 12 వరకు బాలాజీ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా సెంథిల్​ బాలాజీ ఎటువంటి శాఖ లేకుండానే మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం గవర్నర్​ ఆదేశాలతో బర్తరఫ్​ అయ్యారు.

Last Updated :Jun 29, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.