ETV Bharat / bharat

మమత లేఖతో కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి! దీదీ గేమ్​ప్లాన్​తో భాజపాకే లాభం!!

author img

By

Published : Jun 13, 2022, 7:36 PM IST

Opposition
రాష్ట్రపతి ఎన్నికలు

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల వేళ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన లేఖ విపక్షాల ఐక్యతకు అవరోధంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాజపాయేతర పార్టీలతో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్న తరుణంలో.. దీదీ అడుగులు కాషాయ పార్టీకి ఉపయోగపడే విధంగా ఉన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి రాలేకపోతున్న తీరు.. 'పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది' అన్న చందంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీదీ సమావేశానికి ఏ పార్టీ నాయకులు వెళ్తున్నారు? మమత తీరుపై కాంగ్రెస్​ మిత్రపక్షాలు ఏం అంటున్నాయి? అనే అంశాలపై ఈటీవీ భారత్ విశ్లేషణ మీకోసం..

"ప్ర‌స్తుతం దేశానికి ఒక మంచి రాష్ట్రప‌తి అవ‌స‌రం ఉంది. రాజ్యాంగాన్ని, దేశ పౌరుల‌ను అధికార పార్టీ నుంచి ర‌క్షించే నాయ‌కుడు కావాలి. నేను కరోనాతో బాధ‌ప‌డుతున్నందున ఇతర నాయకులతో సమన్వయం కోసం లోక్​సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను నియమిస్తున్నా."

-ప్రతిపక్షాలకు రాసిన లేఖలో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ

"అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్ఠ మసకబారింది. ఇలాంటి ప‌రిస్థితిలో ప్రతిపక్షాలు ఏకం కావాలి. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై మనల్ని పీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలి. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జూన్ 15 న దిల్లీలో నిర్వ‌హించే సమావేశానికి మీరు హాజరుకావాలి."

-భాజపాయేతర పార్టీలకు రాసిన లేఖలో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee Letter: రాష్ట్రపతి ఎన్నికల వేళ.. ప్రతిపక్షాలకు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.. వేర్వేరుగా శనివారం రాసిన లేఖల సారాంశాలు ఇవి. అయితే ఇందులో బంగాల్​ సీఎం రాసిన లేఖ.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో బలంగా కనిపిస్తున్న భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలు కలిసి ముందుకెళ్తాయని అనుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్​కు కౌంటర్​గా.. దీదీ లేఖ రాయడం.. ప్రతిపక్షాల ఐకమత్యానికి అవరోధంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా ప్రతిపక్షాల ఐక్యత ప్రమాదంలో పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

దుర్భేద్యమైన భాజపాను ఢీకొట్టేందుకు.. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది కాంగ్రెస్​. ఇందుకోసం తగిన కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు స్వయంగా సోనియా గాంధీనే లేఖ రాశారు. చర్చల బాధ్యతలను మల్లికార్జున ఖర్గేను అప్పగించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే.. మమతా బెనర్టీ సైతం అనూహ్యంగా కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ సహా 22మంది విపక్ష నేతలకు లేఖలు రాశారు. జూన్ 15న దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని ఆ లేఖలో కోరారు. మమతా బెనర్జీ రాసిన ఈ లేఖ.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Congress on Mamata Banerjee Letter: మమత లేఖపై కాంగ్రెస్​ పెదవి విరిచింది. ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్​ నాయకుడొకరు.

"రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష శక్తులకు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్​ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మమత మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపలేదు. ప్రతిపక్షం నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండాలని మేం అనుకుంటున్నాం. అయితే అది ఏకాభిప్రాయంతో ఉంటే బాగుంటుంది. "

- ఓ కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు

లెఫ్ట్ ఫ్రంట్ మండిపాటు

మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంపై లెఫ్ట్ ఫ్రంట్ తీవ్రంగా మండిపడింది. సీపీఎం సీనియర్​ నేత సుజన్‌ చక్రవర్తి.. 'ఈటీవీ భారత్‌'తో మమత లేఖపై మాట్లాడారు. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ చాలా రోజుల ముందు నుంచే ఉమ్మడి అభ్యర్థి విషయంపై చర్చలు జరుపుతున్నారన్నారు సుజన్‌ చక్రవర్తి. ఆ బాధ్యతలను మల్లికార్జున్‌ ఖర్గేకు అప్పగించారన్నారు.

"మమతా బెనర్జీ అప్పటికప్పుడు సమావేశమై.. ఎవరితో చర్చించకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం భాజపాకు సహాయం చేసే ప్రయత్నం తప్ప.. మరొకటి కాదు."

- సుజన్‌ చక్రవర్తి, సీపీఎం సీనియర్​ నేత

Regional Parties on Mamata Banerjee letter: ప్రాంతీయ పార్టీలు సైతం మమత నిర్వహించే సమావేశానికి హాజరు కావాలా? వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాయి. సమావేశానికి హాజరు కావడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఝార్ఖండ్ ముక్తి మోర్చా కేంద్ర కమిటీ సభ్యుడు సుప్రియో భట్టాచార్య.. 'ఈటీవీ భారత్‌'తో చెప్పారు.

" మమత సమావేశానికి వెళ్లడంపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరాలి. అలాగే మిత్ర పక్షాలైన కాంగ్రెస్​, ఆర్జేడీతో చర్చించాలి. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం."

-సుప్రియో భట్టాచార్య, ఝార్ఖండ్ ముక్తి మోర్చా కేంద్ర కమిటీ సభ్యుడు

సీఎం కేసీఆర్​ వెళ్తారా?
ఇటీవల కాలంలో దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న.. తెరాస​ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్​ సైతం.. మమత నిర్వహించే సమావేశానికి హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్​ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ హాజరు కావాల్సిన అవసరం ఏర్పడితే.. తెరాస సీనియర్​ నాయకుడు.. కె.కేశవరావు లాంటి నేతలను సమావేశానికి పంపొచ్చని సమాచారం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మమత నుంచి ఆహ్వానం అందింది. ఆయితే ఆయన సమావేశానికి హాజరు కాలేరని స్పష్టం చేశాయి శివసేన వర్గాలు. దానికి గల కారణాలను సైతం నాయకులు చెప్పారు.

"మేం ఆ సమయంలో అయోధ్యలో ఉంటాం. కాబట్టి సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది"

- శినసేన పార్టీ నాయకుడు

తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం.. మమత నిర్వహించే సమావేశానికి హాజరు కాలేరని డీఎంకే స్పష్టం చేసింది. ఉమ్మడి అభ్యర్థి కోసం తాము కట్టుబడి ఉన్నామని, సమావేశానికి కాంగ్రెస్ రాకపోతే.. తమ పార్టీ ప్రతినిధి హాజరయ్యే విషయంపై.. అంతర్గతంగా చర్చించుకోవాలని డీఎంకే నాయకుడు ఒకరు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికల వేళ.. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొరవడటం.. బలంగా ఉన్న అధికార పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది' అన్న చందంగా ప్రతిపక్షాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేయడం వల్ల.. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకే మేలు జరిగే అవకాశమూ లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈడీ ముందుకు రాహుల్.. నియంతృత్వమా? 'నల్ల ఖజానా' రక్షణా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.