ETV Bharat / bharat

30 ఏళ్లు శ్రమించి ఊరికి రోడ్డేసిన అన్నదమ్ములు

author img

By

Published : Aug 6, 2021, 4:56 PM IST

మౌలిక వసతలు కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా.. వారు పట్టించుకోకపోతే.. అసహనం వ్యక్తం చేసి అక్కడితో వదిలేస్తారు కొందరు. దానిని సవాల్​గా తీసుకుని రంగంలోకి దిగుతారు మరి కొందరు. ఆ కోవకు చెందినవారే ఒడిశాకు చెందిన హరిహర్ బెహెర సోదరులు. తమ ఊరు కోసం 30ఏళ్లు కష్టపడి రోడ్డు నిర్మించారు.

mountain man build a road
హరిహర్​ సోదరులు

రోడ్డు నిర్మించిన హరిహర్ బెహెర సోదరులు

అదో మారుమూల గ్రామం. నగరానికి దూరంగా విసిరి పారేసినట్లు ఉంటుంది. కనీసం మట్టి రోడ్డు కూడా లేని.. ఆ ఊరుకు వెళ్లాలంటే అడవిని దాటాల్సిందే. తెలియనివారైతే.. కారడవిలో తప్పిపోవడం ఖాయం! అందుకే ఆ గ్రామాన్ని పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ఈ దుస్థితిని గుర్తించిన ఇద్దరు సోదరులు.. రోడ్డు నిర్మించాలని భీష్మించుకున్నారు. 30 ఏళ్లు నిర్విరమంగా శ్రమించి రోడ్డును నిర్మించారు.

Mountain man
రోడ్డు నిర్మించడానికి తరలిస్తున్న రాళ్లు

ఒడిశాలోని నయాగఢ్​ జిల్లాలోని బంతపుర్​ పంచాయతీ పరిధిలో ఉంటుంది తులుబి గ్రామం. రోడ్డు సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోని దుస్థితి. అందుకే ఆ ఊరికి చెందిన హరిహర్​​ బెహెర సోదరులు.. రోడ్డు నిర్మించాలన్న మహత్తర కార్యానికి నడుం బిగించారు.

Mountain man
హరిహర్​ సోదరులు నిర్మించిన రహదారి

దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో పొదలు, కొమ్మలు, చిన్న చెట్లు, రాళ్లను తొలగించి.. పెద్ద వాహనాలు సైతం ఆ గ్రామానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ మార్గం ద్వారా ప్రజలు సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.

Mountain man
హరిహర్​ బెహెర

"గతంలో మా ఊరికి రోడ్డు లేదు. రహదారి నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశాం. అందుకు కుదరదని సమాధానమిచ్చారు. ఆ రోజు నుంచే రోడ్డు నిర్మించడం ప్రారంభించారు" అని స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: 60 ఏళ్లలో 30 వేల మొక్కలు నాటిన 'వృక్ష గురువు'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.