ETV Bharat / bharat

జర్నలిస్టులకు 'క్యాష్‌ గిఫ్ట్‌లు'.. మరో వివాదంలో సీఎం.. దర్యాప్తునకు కాంగ్రెస్​ డిమాండ్​

author img

By

Published : Oct 29, 2022, 5:43 PM IST

కర్ణాటక సీఎం కార్యాలయం నుంచి పలువురు జర్నలిస్టులకు రూ.లక్ష నుంచి రూ.2.5లక్షల వరకు నగదు బహుమతులు అందడం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

karnataka-cong-demands-judicial-inquiry-into-allegations-of-cash-gifts-to-journalists
మరో వివాదంలో కర్ణాటక సీఎం

కర్ణాటకలో సీఎం బసవరాజు బొమ్మై నేతృత్వంలోని భాజపా సర్కారు మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు రూ.లక్షల్లో నగదు బహుమతులు పంపించారని ఆరోపణలు వచ్చాయి. కొందరు జర్నలిస్టులకు స్వీటు బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు లంచాలు పంపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రంలోని పలు మీడియా సంస్థలకు చెందిన డజను మంది సీనియర్‌ జర్నలిస్టులకు సీఎం కార్యాలయం నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని సదరు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. వీరిలో కొందరు విలేకరులు ఈ విషయాన్ని తమ సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారట. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు ఓ జర్నలిస్టు వెల్లడించారు.

ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. సీఎం సన్నిహిత వ్యక్తి నుంచి పలు మీడియా సంస్థల చీఫ్‌ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది.

కాంగ్రెస్ విమర్శలు..
తాజా ఘటన నేపథ్యంలో బొమ్మై సర్కారుపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. 'సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. 1. ఇది సీఎం ఆపర్‌ చేసిన లంచం కాదా? 2. ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? 3. దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?' అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్‌ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.