ETV Bharat / bharat

3 రోజుల్లోనే కోటి మంది టీనేజర్లకు కరోనా టీకా​

author img

By

Published : Jan 6, 2022, 5:36 AM IST

Updated : Jan 6, 2022, 7:22 AM IST

India vaccination: మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లకు కొవిడ్​ టీకా​ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో వ్యాక్సిన్​ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న యువతను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా అభినందించారు.

India vaccination
India vaccination

India vaccination: కరోనా టీకా పంపిణీలో భారత్ కీలక మైలురాయిని అందుకుంది. కోటి మందికిపైగా టీనేజర్లకు టీకా మొదటి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభమైన మూడు రోజులకే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు పిల్లలకు మొత్తం 1,24,02,515 టీకా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

బుధవారం ఒక్కోరోజే మొత్తం 82,26,211 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేయగా.. అందులో 37,44,635 డోసులను టీనేజర్లు అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వ్యాక్సిన్​ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న యువతను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా అభినందించారు. టీకా తీసుకున్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైనవారు వీలైనంత త్వరగా టీకాలు అందుకోవాలని సూచించారు. అలాగే రోజువారీగా అందిస్తున్న వ్యాక్సిన్ల సంఖ్య పెరుగుతుందని భావించారు.

దేశంలో కరోనా టీకా పంపిణీ దశలవారీగా జరుగుతోంది. తొలి దశను 2021 జనవరి 16న కేంద్రం ప్రారంభించింది. ఈ దశలో వైద్య సిబ్బంది, ఫ్రంట్​లైన్​ వర్కర్లకు వ్యాక్సిన్లు అందించారు.

రెండో దశను గతేడాది మార్చి 1న ప్రారంభించారు. ఈ విడతలో 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి పంపిణీ చేశారు.

గతేడాది ఏప్రిల్​ 1న నుంచి.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్లు అందిస్తున్నారు.

తాజాగా ఈ ఏడాది జనవరి 3న టీనేజర్లకు టీకా పంపిణీని కేంద్రం ప్రారంభించింది. మూడు రోజుల్లో కోటి మంది పిల్లలకు వ్యాక్సిన్ అందజేసి కీలక మైలురాయిని చేరుకుంది.

దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో టీకాల పంపిణీ శరవేగం సాగుతోంది. ఇప్పటివరకు 148.58 కోట్లకుపైగా టీకాల పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: త్వరలో సీఎంలతో మోదీ భేటీ.. కొవిడ్​ కట్టడిపై చర్చ!

Last Updated :Jan 6, 2022, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.