ETV Bharat / bharat

కూలీ పిల్లలు 'కోటీశ్వరులు'.. ప్రభుత్వ సాయం కోసం తిప్పలు!

author img

By

Published : Apr 20, 2022, 3:49 PM IST

Parivar Pehchan Patra
కుటుంబ గుర్తింపు కార్డు

కూలీ పనులు చేసుకునే తల్లిందండ్రులు, వారి పిల్లలు కోటీశ్వరులు.. అయినా ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి. అదేంటి కోట్ల రూపాయలు ఉన్నవారికి ప్రభుత్వ సాయం అవసరమేంటి అనుకుంటున్నారా? అవునండీ అది నిజమే. ప్రభుత్వ అధికారులు చేసిన నిర్వాకం కథేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, పేద విద్యార్థులు ప్రభుత్వ సాయంతో ఉన్నత చదువులకు వెళ్లాలన్నా ఆదాయ ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యం. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తుంది. అయితే.. ఒక్కోసారి అధికారులు చేసే పొరపాట్లు కొందరిని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాంటి సంఘటనే హరియాణా, జింద్​ జిల్లాలో జరిగింది. రోజువారీ కూలీ పనులు చేసుకునే ఓ వ్యక్తి పిల్లల ఆదాయం ఏకంగా కోట్ల రూపాయలు ఉన్నట్లుగా వారి ధ్రువపత్రాల్లో ఉంది. అదే వారి పైచదువులకు ఆటంకంగా మారింది.

ఇదీ జరిగింది: జింద్​ జిల్లా రామరాయ్​ గ్రామానికి చెందిన భీమ్​ సింగ్​ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భీమ్​ సింగ్​ కొడుకు 81 శాతం మార్కులతో 12వ తరగతి పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లాలనుకుంటున్నా ఎక్కడా అడ్మిషన్​ దొరకటం లేదు. మరోవైపు.. అతడి కూతురు సోనియా జియోగ్రఫీలో ఎంఎస్సీ, ఎన్​ఈటీలో ఉత్తీర్ణత సాధించినా.. సాక్షమ్​ యోజనలో దరఖాస్తు చేసుకోలేకపోయింది. అందుకు కారణం వారి ఆదాయ ధ్రువపత్రాలే. తాను బీఈడీ చేయాలనుకుంటున్నానని, తన కుటుంబ గుర్తింపు కార్డు కారణంగా అడ్మిషన్​ దొరకటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది సోనియా.

కుటుంబ గుర్తింపు కార్డులో భీమ్​ సింగ్​ కుమారుడి ఆదాయం రూ.500 కోట్లుగా, కూతురు సోనియా ఆదాయం రూ.కోటిగా పేర్కొన్నారు అధికారులు. అయితే.. కూలీ పనులు చేసే భీమ్​ సింగ్​ ఆదాయం రూ.36వేలు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ ధ్రువపత్రాన్ని సవరించేందుకు గత 4-5 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయింది భీమ్​ సింగ్​ కుటుంబం.

కుటుంబ గుర్తింపు కార్డులో ఆదాయాలు భారీగా ఉండటం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదని తెలిపాడు భీమ్​. తాను క్యాన్సర్​ రోగినని, తనకు ప్రభుత్వం నుంచి రూ.లక్షన్నర అందేవని, కార్డులో తప్పుల వల్ల అవి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పెంకుటిల్లు మాత్రమే ఉందని, అది కూడా శిథిలావస్థకు చేరుకుందని తెలిపాడు. ఇవ్వన్నీ చూసి కూడా పిల్లల ఆదాయం కోట్లుగా పేర్కొన్నారని ఆందోళన వ్యక్తం చేశాడు భీమ్​. ఎంఏసీ ఉత్తీర్ణత సాధించిన కూతురు ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం బేటీ బచావో-బేటీ పడావో అని నినదిస్తుంది కానీ, ఆచరణలో ఉండదని విమర్శించాడు. గుర్తింపు కార్డులో లోపాలు సరిదిద్దకపోతే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటమే తమకు శరణ్యమని పేర్కొన్నాడు.

హరియాణా ప్రభుత్వం ప్రారంభించిన 'పరివార్​ పెహచాన్​ పత్ర్​' పథకం సరిగా అమలు కావటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే డబ్బులు తీసుకుని ధ్రువీకరణ పత్రాల్లో తప్పుడు సమాచారం నమోదు చేసిన వారిని అరెస్ట్​ చేసిన సంఘటన జింద్​ జిల్లాలోనే జరిగింది. ప్రస్తుతం నిందితులు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి: స్కూటీ ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్​ కోసం రూ.15లక్షలు ఖర్చు

సరికొత్త పంథాలో చోరీ.. కారు ముందు నోట్లు విసిరి.. తెలివిగా బురిడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.