ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​పై కేంద్రానికి నిపుణుల సూచనలు

author img

By

Published : Apr 8, 2021, 3:59 PM IST

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్రానికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ బాధ్యతలను వైద్య కళాశాలలకు అప్పగించాలని చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. టీకా స్వీకరించేందుకు ప్రజలు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

vaccination experts suggestions
వ్యాక్సినేషన్ కేంద్రానికి సలహాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నా.. ఇది మరింత వేగంగా జరగాల్సి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వైద్య నిపుణులు ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేసేందుకు ఉన్న అన్ని వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలని చెబుతున్నారు.

ప్రారంభంలో నెమ్మదిగా సాగిన టీకా పంపిణీ కార్యక్రమం.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని ఐసీఎంఆర్ సీనియర్ సలహాదారు డా. సునీలా గార్గ్ పేర్కొన్నారు. దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న అపోహలతో ప్రజలు.. టీకా తీసుకునేందుకు తొలుత వెనకంజ వేశారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగైనందున.. వ్యాక్సినేషన్ కోసం కొత్త వ్యూహాలకు పదును పెట్టాలని సూచించారు.

"వ్యాక్సినేషన్ కోసం వినూత్న, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలి. దేశంలో 540 మెడికల్ కాలేజీలు, 60 పీజీ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రతి కళాశాలకు స్థానికంగా కొంత పరిధి ఉంటుంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు టీకా అందించాల్సిన బాధ్యత వారికి అప్పగించాలి."

-డా. సునీలా గార్గ్, ఐసీఎంఆర్ సీనియర్ సలహాదారు

'కారణమదే'

టీకాపై అపనమ్మకమే.. దేశంలో వ్యాక్సినేషన్ పేలవంగా ఉండటానికి కారణమని ఆసియన్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డా. తమోరిష్ కోలే తెలిపారు. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వీలైనంత మందికి టీకా అందించాలని సూచించారు.

"రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ యాప్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలో వ్యాక్సినేషన్ నత్తనడకన సాగింది. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి.. అర్హులైన పౌరులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తారని అనుకుంటున్నాం."

-డా. తమోరిష్ కోలే, ఆసియన్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు

కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డాక్టర్ కోలే పేర్కొన్నారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్ వ్యూహాన్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. బహిరంగంగా సమావేశాలు కావడాన్ని నివారించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.