ETV Bharat / bharat

వీర్యంపైనా కరోనా ఎటాక్.. సంతానోత్పత్తికి ఇబ్బందా? మంగళగిరి ఎయిమ్స్ పరిశోధన!

author img

By

Published : Jan 5, 2023, 3:58 PM IST

కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ అనంతరం సమస్యలు మాత్రం ఇప్పటికీ వెంటాడుతున్నాయి. కరోనా వైరస్ పురుషుల వీర్యంపైనా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలో తేలింది. వైరస్ వల్ల వీర్యం నాణ్యత దెబ్బతింటోందని వెల్లడైంది.

covid-infection-impact-semen
covid-infection-impact-semen

కరోనా వైరస్ కారణంగా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటోందని ఓ పరిశోధనలో వెల్లడైంది. సార్స్ కోవ్-2 వైరస్.. వృషణ కణజాలాల్లో ఉండే యాంజియోటెన్సిన్ ఎంజైమ్-2 రిసెప్టర్​ (ఏసీఈ2) ద్వారా వివిధ అవయవాలను దెబ్బతీస్తోందని తేలింది. ఏసీఈ2 అనేది సార్స్ కోవ్-2 స్పైక్ ప్రోటీన్​ను గ్రహించి.. శరీరంలోని కణజాలాల్లోకి ప్రవేశిస్తోందని పట్నా ఎయిమ్స్​కు చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది. మొత్తం 30 మంది కొవిడ్ సోకిన పురుషులపై ఈ పరిశోధనను నిర్వహించింది. ఈ పరిశోధన ఫలితాలు క్యూరెయస్ మెడికల్ సైన్స్​ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

ఈ పరిశోధనలో పట్నా ఎయిమ్స్​ పరిశోధకులతో పాటు మంగళగిరి ఎయిమ్స్, దిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు పాల్గొన్నారు. వీర్యం నాణ్యత, జన్యుపదార్థంపై కరోనా ఏమేరకు ప్రభావం చూపుతుందనే విషయంపై వీరు పరిశోధన జరిపారు. 2020 అక్టోబర్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య ఈ అధ్యయనం నిర్వహించారు. పరిశోధనలో పాల్గొన్న 30 మందిపై రియల్ టైమ్ రివర్స్ ట్రాన్​స్క్రిప్టెస్ పరీక్షలు జరిపారు. డీఎన్​ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్​ను పరిశీలించారు. 74 రోజుల విరామం తర్వాత మరోసారి ఇవే పరీక్షలు జరిపారు.

మొదటి పరీక్షలో వీర్యం పరిమాణం, చలనశీత, శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, శుక్ర కణాల్లో లోపాలు అధికంగా కనిపించినట్లు వెల్లడైంది. దీంతోపాటు తెల్ల రక్తకణాలు, ల్యూకోసైట్లు పెరిగాయని, వీర్యం ద్రవీభవించే సమయం సైతం పెరిగిందని పరిశోధన బృందం తెలిపింది. రెండోసారి పరీక్షలు చేసే సమయానికి ఫలితాలు మారిపోయాయని, అయితే సాధారణ స్థాయికి మాత్రం రాలేదని పరిశోధకులు వివరించారు. ఈ నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఫలితం నెగెటివ్​గా వచ్చిందని చెప్పారు. కరోనా వల్ల వీర్యం నాణ్యత దెబ్బతిన్నప్పటికీ.. దీని వల్ల పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం ఉంటుందా అనేది తెలియలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

పరిశోధకుల సిఫార్సులు..
'ఈ ఫలితాలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీర్యంపై కరోనా దుష్ప్రభావం చూపిస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. వీర్యంలో కరోనా ఆనవాళ్లు కనిపించకపోయినా.. దాని నాణ్యత మాత్రం తక్కువగా ఉంది' అని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు. కరోనా సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యతను అంచనా వేయడానికి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్​టీ) క్లినిక్​లను ఏర్పాటు చేయాలని పరిశోధకులు సూచించారు. వీర్యం నిల్వ చేసే బ్యాంకులను నెలకొల్పాలని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.