ETV Bharat / bharat

'భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్​ ముగిసింది'.. రాజకీయాలకు సోనియా గుడ్​బై?

author img

By

Published : Feb 25, 2023, 1:47 PM IST

Updated : Feb 25, 2023, 8:05 PM IST

Cong leader sonia gandhi
Cong leader sonia gandhi

తన ఇన్నింగ్స్ ముగిసిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల సోనియా నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సోనియా వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

భారత్ జోడో యాత్రతో 'తన ఇన్నింగ్స్' ముగిసినందుకు సంతోషంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. 3 రోజుల పార్టీ ప్లీనరీలో 1500మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా.. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రుజువైనట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు.

"మనమంతా క్రమశిక్షణలో పనిచేద్దాం. గతంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదాం. పార్టీ గెలుపు అంటే దేశానికి విజయం కాకుండా మనలో ప్రతి ఒక్కరిది అని గుర్తుంచుకుందాం."
-సోనియాగాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి

ప్లీనరీ సమావేశంలో భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సోనియా గాంధీ. మైనరిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని భాజపా ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అన్ని సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. అదానీ వంటి సంస్థలను పెంచి పోషిస్తోందని సోనియా అన్నారు. రాజ్యాంగ విలువలను భాజపా ఎప్పుడో మర్చిపోయిందని అన్నారు. తాను తొలిసారి పార్లమెంట్​లో అడుగుపెట్టిన నాటి పరిస్థితులను ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుత పాలనను పటిష్ఠంగా ఎదుర్కోవాలని.. పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని ఆమె కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.

రాజకీయాలకు గుడ్​బై?
అయితే, ఈ సమావేశంలో తన ఇన్నింగ్స్ ముగిసిందని సోనియా పేర్కొనడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు, వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోరంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రచారం తీవ్రం కావడం వల్ల దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇచ్చింది. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవటం సంతోషంగా ఉందని చెప్పారే తప్ప... ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించటం సోనియా ఉద్దేశం కాదని ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు కుమారి షెల్జా తెలిపారు. అటు దిగ్విజయ్ సింగ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సోనియా అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర ప్రారంభమైందనే విషయాన్ని సూచిస్తూ అలా వ్యాఖ్యానించారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వివరణతో సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారానికి తెరపడింది.

మరోవైపు, ఈ సమావేశంలో మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలపై నిరంతర దాడి, దేశ సరిహద్దుల్లో వివాదాలు, నిరుద్యోగం వంటి పలు సమస్యలను దేశం ఎదుర్కొంటోందని అన్నారు. ప్రజల సేవకుడిగా తనను తాను పిలుచుకునే మోదీ.. తన స్నేహితుల ప్రయోజనాలను మాత్రమే పరిరక్షిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో సమర్థమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన నొక్కి చెప్పారు.

కాంగ్రెస్​ రాజ్యాంగాన్ని సవరించిన పార్టీ
కాంగ్రెస్​ తన పార్టీ రాజ్యాంగాన్ని సవరించింది. ఈ ప్లీనరీ సెషన్‌లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత కాంగ్రెస్‌కు ఇక నుంచి డిజిటల్ సభ్యత్వం, రికార్డు మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల్లో అన్ని స్థాయిల్లో యువత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరించింది. కాంగ్రెస్ తన వర్కింగ్ కమిటీలో సభ్యుల సంఖ్యను 25 నుంచి 35కు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీలో పార్టీ మాజీ ప్రధానులు, ఏఐసీసీ మాజీ చీఫ్‌లను చేర్చడానికి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరించారు.

Last Updated :Feb 25, 2023, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.