ETV Bharat / bharat

చిన్ని చేతులే ఆపన్నహస్తాలు.. పేదరిక నిర్మూలనకు తెలుగు కలెక్టర్​ కృషి

author img

By

Published : Feb 25, 2023, 1:36 PM IST

ఓ కలెక్టర్ సంకల్పం ఆ జిల్లా నుంచి పేదరికాన్ని తరిమేస్తోంది. విద్యార్థులకు చిన్ననాటి నుంచే సేవా గుణాన్ని నేర్పిస్తోంది. మంచి పనిలో భాగస్వామ్యమైతే కలిగే సంతృప్తిని దాతృత్వంలో ఉండే ఆత్మ తృప్తిని ఆ చిన్నారులకు ఇప్పటినుంచే అందిస్తోంది. సాయం పొందిన వ్యక్తుల కృతజ్ఞతా భావం ఎలా ఉంటుందో విద్యార్థులకు రుచి చూపిస్తోంది. వీటన్నింటికీ తెలుగువాడైన ఓ కలెక్టర్‌ కారణమంటే గర్వంగా అనిపిస్తుంది కదూ.. వినూత్న ఆలోచనలు.. విభిన్న మార్గాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తున్నఆ కలెక్టరే కృష్ణ తేజ. తాజాగా కృష్ణ తేజ చేపట్టిన సమాజ సేవ దినోత్సవం అలెప్పీ జిల్లాలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.

krishna teja ias kerala
krishna teja ias kerala

ఇప్పటికే వంద శాతం అక్షరాస్యత సాధించిన కేరళలోని అలెప్పి జిల్లా.. ఇప్పుడు నవ శకం వైపుగా నడుస్తోంది. పేదరికాన్ని జిల్లా నుంచి తరిమికొట్టాలన్న కలెక్టర్‌ కృష్ణ తేజ సంకల్పానికి విద్యార్థులు తోడయ్యారు. ఇప్పుడు ఈ చిన్న చేతులే అలెప్పీ జిల్లాలో అద్భుతాలు చేస్తున్నాయి. కడు పేదరింతో అల్లాడుతున్న ప్రజలను.. దాని నుంచి బయట పడేయాలన్న కలెక్టర్‌ వినూత్న ఆలోచనను ఇప్పుడు ఈ విద్యార్థులే ముందుకు తీసుకెళ్తున్నారు.

కేరళ ప్రభుత్వం మొదటి మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అలెప్పీ జిల్లా కలెక్టర్‌ కృష్ణ తేజ.. చిల్డ్రన్ ఫర్ అలెప్పీ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో విద్యార్థులను భాగస్వాములను చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్వచ్ఛందంగా.. పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. వంద మంది విద్యార్థులు కలిసి ఆర్థికంగా వెనకబడిన ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాయి. అలెప్పీ జిల్లాలో మొత్తం 3,613 కుటుంబాలు తీవ్ర పేదరింకలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబాలకు విద్యార్థులు దత్తత తీసుకుని నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేస్తున్నారు. అలెప్పీ జిల్లాలోని 900కి పైగా విద్యాసంస్థలు ఉండగా అందులోని విద్యార్థులు 3,613 కుటుంబాలకు ఈ సాయాన్ని అందిస్తున్నాయి.

krishna teja ias kerala
విద్యార్ధులు సేకరించిన సరకులు

జిల్లా నుంచి పేదరికాన్ని తరిమికొట్టేందుకు సహాయం చేయాలని పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ కృష్ణతేజ పాఠశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీని కోసం పక్కా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా బియ్యం, నగదు మినహా నిత్యావసరాలను పాఠశాలకు తీసుకొస్తారు. ఆహార పదార్థాలు, సబ్బులు, టూత్‌పేస్ట్‌లతో సహా నిత్యావసరాలను పాఠశాలల్లో ప్యాక్‌ చేసి 'దత్తత' కుటుంబాలకు పంపిణీ చేస్తారు.

krishna teja ias kerala
పేదలకు పంపిణీ చేస్తున్న విద్యార్థులు

దీని కోసం ప్రతి నెలా మొదటి సోమవారం పాఠశాలల్లో సమాజ సేవా దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఇలా విద్యార్థుల నుంచి సేకరించిన నిత్యావసరాలను విద్యార్థులే వారు దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి సామాజిక సేవా సమన్వయకర్తగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బృహత్తర కార్యక్రమం వేసవి సెలవుల్లోనూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి పాఠశాలలోనూ కమ్యూనిటీ సర్వీస్ క్లబ్‌ను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

krishna teja ias kerala
పేదలకు పంపిణీ చేస్తున్న విద్యార్థులు

చిల్డ్రన్ ఫర్ అలెప్పీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల రోజులలోపే.. దాదాపు 900 పాఠశాలలు ఇందులో భాగస్వాములు అయ్యాయి. తాము అనుకున్న దానికంటే విద్యార్థుల నుంచి భారీ స్పందన రావడంపై కృష్ణతేజ హర్షం వ్యక్తం చేశారు. ఇది స్వచ్ఛంద కార్యక్రమైనా దాదాపు అన్ని పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇందులో భాగం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించడంలో దేశంలోనే మొదటి జిల్లాగా అలెప్పీని తీర్చిదిద్దేందుకు.. విద్యార్థులే నాయకులుగా మారారని కృష్ణతేజ వెల్లడించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో సమాజ సేవ దినోత్సవాన్ని మరింత విస్తరించేందుకు కృష్ణ తేజ ప్రణాళికలు రచిస్తున్నారు.

krishna teja ias kerala
సేకరించిన సరకులతో విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.