ETV Bharat / bharat

చెక్కలు చేద్దామనుకున్నారు.. దేశాన్ని రెండు ముక్కలుగా వదిలేశారు!

author img

By

Published : Jun 3, 2022, 8:16 AM IST

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

Azadi Ka Amrit Mahotsav: జూన్‌-3... భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో మరచిపోలేని రోజు. భారత విభజనను అధికారికంగా ప్రకటించిన రోజు! భారత్‌కు స్వాతంత్య్రం ఇస్తున్నట్లు వెల్లడిస్తూనే.. 1947 జూన్‌ 3న విభజన బాంబు పేల్చాడు వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌! అంతకంటే ముందు.. భారత్‌ను ముక్కలు చెక్కలు చేయటానికి ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది.

Azadi Ka Amrit Mahotsav: 1947 ఆరంభానికే ఆంగ్లేయులు భారత్‌ను వీడటం ఖాయమైంది. 1948 జూన్‌ 30కల్లా భారత్‌ను విడిచి వెళతామని బ్రిటన్‌ ప్రధానమంత్రి క్లెమెంట్‌ అట్లీ ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగానే.. అధికార మార్పిడిపై చర్యలు మొదలయ్యాయి. వైస్రాయ్‌గా వావెల్‌ స్థానంలో తమకు నమ్మకస్తుడు, చక్రవర్తికి బంధువు అయిన లూయిస్‌ ఫ్రాన్సిస్‌ అల్బర్ట్‌ విక్టర్‌ డికీ మౌంట్‌బాటన్‌ను పంపించాడు అట్లీ! పైకి స్పష్టంగా చెప్పకున్నా.. భారత్‌ను ముక్కలు చేయబోతున్నట్లు అట్లీ అన్యాపదేశంగా తన ప్రకటనలో తెలిపాడు. 1947 మార్చి 22న భారత్‌లో అడుగుపెట్టిన మౌంట్‌బాటన్‌... అందుకు అనుగుణంగా వేగంగా అడుగులు వేశాడు. 1948 ముహూర్తాన్ని కాస్తా.. దాదాపు పదినెలలు ముందుకు జరిపాడు. ఇందుకోసం.. అడ్డంకిగా ఉన్న చిక్కుముడులకు ఏదో ఒక పరిష్కారం సూచిస్తూ.. సాధ్యమైనంత త్వరగా భారత్‌కు బ్రిటన్‌ గుడ్‌బై చెప్పటానికి మార్గం సుగమం చేశాడు. అందులో భాగమే.. జూన్‌ 3 ప్లాన్‌! కానీ అంతకంటే ముందు.. తెరవెనక ఓ కథ నడిచింది.

అప్పటికి స్వాతంత్య్రం ఖాయమైనా తేలని అంశం.. పాకిస్థాన్‌ ఏర్పాటు. లండన్‌ నుంచి వచ్చిన 'కేబినెట్‌ మిషన్‌' రాయబారం విఫలమైంది. పాకిస్థాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ మిషన్‌ నిరాకరించింది. దీంతో.. ముస్లింలీగ్‌ నేత మహమ్మద్‌ అలీ జిన్నా.. 'డైరెక్ట్‌ యాక్షన్‌' అంటూ పిలుపునిచ్చి రెచ్చగొట్టడంతో మతకల్లోలాలు చెలరేగాయి. దీంతో మౌంట్‌బాటన్‌ ప్రత్యామ్నాయ ప్రణాళిక రచించాడు. దీన్నే డిక్కీబర్డ్‌ ప్లాన్‌, ఇస్మే ప్లాన్‌ కూడా అంటుంటారు. జనరల్‌ సర్‌ హేస్టింగ్స్‌ ఇస్మే, జార్జ్‌ ఎబెల్‌, మౌంట్‌బాటన్‌లతో కూడిన కమిటీ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం.. బొంబాయి, మద్రాసు, యునైటెడ్‌ ప్రావిన్సెస్‌, బెంగాల్‌, పంజాబ్‌, వాయవ్యరాష్ట్రాలను స్వతంత్య్ర ప్రాంతాలుగా ప్రకటిస్తారు. రాజ్యాంగ సభలో చేరాలో లేదో నిర్ణయించుకునే అవకాశం వాటికి ఇస్తారు. ఒకవేళ భారత్‌, పాకిస్థాన్‌లుగా దేశం విడిపోతే.. ఇవి వాటిలో చేరొచ్చు.. లేదా స్వతంత్రంగా ఉండే అవకాశం కూడా వాటికి ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే భారత్‌ అనేది చీలికలు పీలికలు అవుతుంది. అయితే ఈ ప్రతిపాదనపై ఎవ్వరితోనూ చర్చించలేదు. కానీ అదే సమయంలో శిమ్లాలో మౌంట్‌బాటన్‌ అతిథిగా వచ్చిన నెహ్రూకు అనుకోకుండా ఇది కంటపడింది. వెంటనే దాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది భారత్‌ను ముక్కలు ముక్కలుగా విడగొట్టడమేనంటూ తిరస్కరించారు. దీంతో వెనక్కి తగ్గిన మౌంట్‌బాటన్‌ గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండు ముక్కల (భారత్‌, పాక్‌) ప్రణాళికను ముందుకు తీసుకొచ్చాడు. లండన్‌ వెళ్లి ప్రధాని ముందుంచాడు. ఐదు నిమిషాల్లోనే అట్లీ కేబినెట్‌ అంగీకారం తెలిపింది. మే 31న భారత్‌కు తిరిగి వచ్చిన మౌంట్​బాటన్‌ వెంటనే.. నెహ్రూ, పటేల్‌, జిన్నా, లియాఖత్‌ అలీలతో భేటీ అయి.. వారితోనూ ఒప్పించాడు. విభజనను వ్యతిరేకిస్తున్న గాంధీనీ కలసి ఆయనతోనూ మమ అనిపించాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో.. విభజన తప్ప మరో మార్గం లేదంటూ.. అందరినీ ఒప్పించి.. అధికారిక ప్రకటనకు ముహూర్తం నిర్ణయించాడు. ఇదే జూన్‌-3 ప్రణాళిక! భారత్‌ను మతపరంగా.. భారత్‌, పాకిస్థాన్‌లుగా ఆగస్టు 15న విభజిస్తున్నట్లు 1947 జూన్‌ 3న మౌంట్‌బాటన్‌ ప్రకటించాడు. దీని ప్రకారం.. భారత్‌, పాకిస్థాన్‌లకు పూర్తి స్వాతంత్య్రంతో పాటు, సొంత రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు కూడా ఉంటుంది. అయితే రెండు దేశాలూ.. బ్రిటిష్‌ కామన్వెల్త్‌లో కొనసాగుతాయి. దేశంలోని సంస్థానాలపై ఉన్న బ్రిటిష్‌ అధికారం ఆగస్టు 15తో ముగుస్తుంది. భారత్‌, పాకిస్థాన్‌లలో చేరాలో లేదా స్వతంత్రంగా ఉండాలో నిర్ణయించుకునే అవకాశం వాటికే ఇస్తారు. పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీలు (హిందూ, ముస్లిం మెజార్టీ జిల్లాల వారీగా) సమావేశమై రాష్ట్ర విభజన కోరుకుంటే.. సరిహద్దు కమిషన్‌ను నియమిస్తారు. సంస్థానాలకు నేరుగా స్వాతంత్య్రం ప్రకటించకుండా.. విలీన వెసులుబాటు ఇవ్వటంతో కాంగ్రెస్‌ కూడా విభజనకు అంగీకరించింది. మౌంట్‌బాటన్‌ ప్రకటించిన ఈ జూన్‌-3 ప్రణాళిక ఆధారంగానే.. 1947 జులై 5న బ్రిటన్‌ పార్లమెంటు భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించింది. రెండు ముక్కలు చేసి భారత్‌ను వదిలేసింది.

ఇదీ చదవండి: గర్జించిన భరతమాత ముద్దుబిడ్డలు.. 'గదర్​ ఉద్యమం'తో బ్రిటిషర్లకు చుక్కలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.