ETV Bharat / bharat

గర్జించిన భరతమాత ముద్దుబిడ్డలు.. 'గదర్​ ఉద్యమం'తో బ్రిటిషర్లకు చుక్కలు!

author img

By

Published : Jun 2, 2022, 8:25 AM IST

Azadi Ka Amrit Mahotsav: పొట్ట చేత పట్టుకొని అమెరికా వెళ్లిన భరతమాత ముద్దుబిడ్డలు కన్నభూమి బానిస సంకెళ్లు తెంపటానికి అక్కడి నుంచే 'గదర్‌' అంటూ గర్జించారు. సప్త సముద్రాల ఆవలి నుంచే సాయుధ పథంలో విప్లవశంఖం పూరించారు. లక్ష్య సాధన కష్టమైనా.. బ్రిటిష్‌ పాలకులకు నిద్రలేకుండా చేసింది.. గదర్‌ ఉద్యమం!

AZADI KA Amrit Mahotsav
AZADI KA Amrit Mahotsav

కావలెను.. ఉత్సాహంగా, వీరోచితంగా పోరాడగలిగే యోధులు
జీతం- మరణం
బహుమానం- అమరత్వం
పింఛను- స్వాతంత్య్రం
పనిచేయాల్సిన చోటు- హిందుస్థాన్‌

..ఇదీ పదేపదే గదర్‌ పార్టీ ఆ కాలంలో విడుదల చేసిన పత్రికా ప్రకటన! భారత్‌లోని దుర్భర ఆర్థిక పరిస్థితుల కారణంగా అనేక మంది భారతీయులు ముఖ్యంగా పంజాబ్‌ ప్రాంతం నుంచి సముద్రమార్గంలో అమెరికా, కెనడాలకు వెళ్లారు. అక్కడ కార్మికులుగా స్థిరపడ్డారు. చైనా, జపాన్‌ల నుంచి కూడా ఇలాగే వలసలు వచ్చేవారు. ఇలా వచ్చిన విదేశీయులకు, స్థానిక ఆంగ్లేయుల నుంచి వివక్ష ఎదురయ్యేది. జపాన్‌, చైనా ప్రభుత్వాలు.. ఈ వ్యవహారాన్ని అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి తమ ప్రజలకు చట్టపరమైన రక్షణలు కల్పించుకున్నాయి. భారతీయుల గురించి పట్టించుకునేవారెవ్వరూ లేరు. భారత్‌లో సొంత ప్రభుత్వం ఉంటేనే మనకు విలువ అనే ఉద్దేశంతో.. పొలాల్లో, కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల నుంచి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, బుద్ధిజీవులూ ఒకతాటిపైకి వచ్చారు. ఒరెగాన్‌ రాష్ట్రంలో 1913 నవంబరు 1న హిందుస్థాన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ది పసిఫిక్‌ కోస్ట్‌ (హెచ్‌ఏపీసీ)ని స్థాపించారు. స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, భారతీయ తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేసే లాలా హర్‌దయాళ్‌ మార్గదర్శనంలో.. ఒరెగాన్‌లోని మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్న సోహన్‌సింగ్‌ తొలి అధ్యక్షుడయ్యారు. తెలుగువాడైన దర్శి చెంచయ్య, చంపక్‌ రామన్‌ పిళ్లై, విష్ణుగణేశ్‌ పింగ్లే, పాండురంగ కన్కోజే తదితరులు కీలకపాత్ర పోషించారు. హర్‌దయాళ్‌ సంపాదకత్వంలో గదర్‌ పేరుతో ఈ సంస్థ వారపత్రిక ఆరంభించి.. దానిపై తాటికాయంత అక్షరాలతో.. అంగ్రేజీ రాజ్‌ కీ¨ దుష్మన్‌ (బ్రిటిష్‌రాజ్‌ శత్రువులం) అని రాసేవారు. అప్పటి నుంచి హెచ్‌ఏపీసీ కాస్తా గదర్‌పార్టీగా పేరొందింది. గదర్‌ అంటే విప్లవం అని అర్థం.

అమెరికా స్వాతంత్య్రం సాధించినట్లే.. సాయుధమార్గంలో బ్రిటిష్‌ నుంచి భారత్‌కు ముక్తి, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించటం దీని లక్ష్యం. ఆంగ్లేయ పాలన వల్ల భారత్‌కు జరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ.. విదేశాల్లోని భారతీయులను గదర్‌ పార్టీ చైతన్య పరిచేది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల నుంచి సుమారు 12వేల మంది గదర్‌పార్టీలో సభ్యులుగా చేరారు.

1914లో ఆరంభమైన మొదటి ప్రపంచ యుద్ధాన్ని లక్ష్య సాధనకు గదర్‌పార్టీ మంచి అవకాశంగా భావించింది. జర్మనీ సహకారంతో.. ఆయుధాలను భారత్‌కు చేరవేసి తిరుగుబాటు చేయాలని పథకం రచించారు. అమెరికాలోని భారతీయులను భారత్‌కు చేరుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. సోహన్‌సింగ్‌, తారక్‌నాథ్‌దాస్‌, బర్కతుల్లాలకు ఈ తిరుగుబాటు బాధ్యతలు అప్పగించారు. బ్రిటన్‌ పూర్తిగా ప్రపంచయుద్ధంలో మునిగితేలుతున్న నేపథ్యంలో విప్లవం సులభమవుతుందని భావించారు. దాదాపు 8వేల మందితో.. 1915 ఫిబ్రవరి 21న పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో విప్లవానికి ముహూర్తం పెట్టారు. కానీ.. అప్పటికే గదర్‌ పార్టీలోకి చొచ్చుకు వచ్చిన బ్రిటిష్‌ నిఘావర్గాలు విషయాన్ని పసిగట్టాయి. విప్లవవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేశాయి. సోహన్‌సింగ్‌ సహా చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. 32 మందికి మరణశిక్ష విధించారు. తప్పించుకున్న కొంతమంది బాంబులతో హల్‌చల్‌ చేసినా.. నాయకత్వం లేక ఆ ప్రణాళిక విఫలమైంది. అంతేగాకుండా.. రష్యా విప్లవం.. బెంగాల్‌లో అప్పటికే చురుగ్గా ఉన్న విప్లవ సంస్థలకు.. ఈ గదర్‌ కూడా తోడవటంతో.. బ్రిటిష్‌ ప్రభుత్వం వీరందరినీ కట్టడి చేయటానికి 1919లో కఠినమైన రౌలత్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. మరోవైపు.. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. ఆచార్య హర్‌దయాళ్‌లాంటివారిని కట్టడి చేయటం మొదలెట్టింది బ్రిటిష్‌ సర్కారు. అరెస్టు చేయటానికి ప్రయత్నించగా.. ఆయన కాస్తా జర్మనీకి జారుకున్నారు. చంపక్‌ రామన్‌ పిళ్లై, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయలాంటి విప్లవవీరులంతా.. జర్మనీ వేదికగా బ్రిటిష్‌ ప్రభుత్వంపై పోరాటానికి ప్రణాళికలు రచించారు. కానీ.. వీరిలో కమ్యూనిస్టు, సోషలిస్టు సైద్ధాంతిక విభేదాలు తలెత్తాయి. వీటికి ఆంగ్లేయ సర్కారు నిఘా తోడవటంతో ప్రణాళికలన్నీ దెబ్బతిన్నాయి. 1925లో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం పన్నినా అది అమలు కాలేదు. నేరుగా తమ లక్ష్యాన్ని సాధించటంలో సఫలం కాకున్నా.. రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌, ఆజాద్‌, భగత్‌సింగ్‌లాంటి అనేక మంది విప్లవాదులను తయారు చేయటంలో గదర్‌పార్టీ స్ఫూర్తిగా నిలిచింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో గదర్‌ స్మారక భవనం (యుగాంతర్‌ ఆశ్రమం) నేటికీ ఉంది. 1948లో గదర్‌పార్టీ రద్దయింది.

ఇదీ చదవండి: మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన.. 'షికాగో' రేడియో స్పీకర్స్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.