ETV Bharat / sports

పావులు చూసి.. ఎత్తులు వేసి.. ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో 'చెన్నై' టీనేజర్​ సంచలనం

author img

By

Published : Dec 29, 2022, 7:02 AM IST

సోదరుడు చదరంగం ఆడుతుంటే.. ఆ తెలుపు, నలుపు గళ్లు.. ఆ పావులు.. ఆ చిన్నారి దృష్టిని ఆకర్షించాయి. ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తుచేయడాన్ని ఆమె ఇష్టపడింది. నాలుగేళ్ల వయసులో చెస్‌తో ప్రయాణాన్ని మొదలెట్టింది. కట్‌ చేస్తే.. ఇప్పుడామె ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేత. ర్యాంకుల్లో మెరుగైన క్రీడాకారిణులను ఓడించి.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన చెన్నై టీనేజర్‌. ఆమెనే.. 15 ఏళ్ల సంచలనం సవితశ్రీ.

indias-savitha-shri-bags-bronze-in-world-rapid-chess
indias-savitha-shri-bags-bronze-in-world-rapid-chess

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగిన తొలిసారే సవితశ్రీ అద్భుతం చేసింది. టోర్నీలో పోటీపడ్డ 98 మంది క్రీడాకారిణుల్లో ఆమె ర్యాంకు 36. ఆమె పతకం గెలుస్తుందన్న అంచనాలూ పెద్దగా లేవు. కానీ అసాధారణ ఆటతీరుతో కాంస్యం సాధించింది. గతేడాది మహిళా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (డబ్ల్యూఐఎమ్‌) హోదా దక్కించుకున్న ఆమెకు ఇలా అంతర్జాతీయ వేదికలపై సంచలనాలు సృష్టించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ప్రపంచ క్యాడెట్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ బాలికల అండర్‌-12 విభాగంలో స్వర్ణాలు ముద్దాడింది.

ఆటపై ప్రేమతో..
సోదరుడు సరదాగా ఆడుతుంటే సవితకు చెస్‌పై ఆసక్తి కలిగింది. ఇంట్లోనే ఓనమాలు నేర్చుకుంది. ఓ టోర్నీలో ఆడి మంచి ప్రదర్శన చేయడంతో తండ్రి భాస్కర్‌ ప్రోత్సహించాడు. సింగపూర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అతను.. సవిత కెరీర్‌ కోసం ఉద్యోగాన్ని వదిలి స్వదేశం వచ్చాడు. ఆమెను వివిధ దేశాల్లో టోర్నీలకు తీసుకెళ్తున్నాడు. తనయను ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. మరోవైపు సవిత కూడా తండ్రి ఆశలకు తగ్గట్లుగా ఆటలో రాటుదేలుతోంది. 2017లో బాలికల అండర్‌-9, 11 విభాగాల్లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటివరకూ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వివిధ వయసు విభాగాల్లో నాలుగేసి స్వర్ణాలు, రజతాలు దక్కించుకుంది. బాలికల అండర్‌-12 విభాగంలో 2018లో కామన్వెల్త్‌, ప్రపంచ క్యాడెట్‌ చెస్‌లో విజేతగా నిలిచింది. 2019లో బాలికల అండర్‌-12 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ఆ విరామం..
విదేశాల్లో టోర్నీల్లో ఉత్తమ ప్రదర్శనతో సవిత రేటింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది. కరోనా కారణంగా ఏడాదిన్నర పాటు ఇంట్లోనే గడపాల్సి వచ్చినప్పటికీ ఆన్‌లైన్‌లో సాధన కొనసాగిస్తూ ఆటపై మరింత పట్టు సాధించింది. 2021 ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో పోటీపడే జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు కాంస్యం గెలిచిన భారత బృందంలో సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత పదో తరగతి పరీక్షల కోసం రెండున్నర నెలల పాటు ఆటకు విరామం ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ఐరోపా పర్యటనలో ఉత్తమంగా రాణించి రేటింగ్‌ను 2374 నుంచి 2411కు పెంచుకుంది. ప్రస్తుతం ప్రపంచ జూనియర్‌ బాలికల ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో హంపి, హారిక, వైశాలి తర్వాత అత్యధిక రేటింగ్‌ ఉన్న మహిళా క్రీడాకారిణి ఆమెనే. విశ్వనాథన్‌ ఆనంద్‌, హంపి తర్వాత ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో పతకం సాధించిన మూడో భారత ప్లేయర్‌గా సవితశ్రీ ఘనత సాధించింది.

"ఆహా.. ఏమా అరంగేట్రం. సవితకు అంకితభావం, ధైర్యం ఎక్కువ. ఆమె సాధించిన ఘనత పట్ల గర్వపడుతున్నా. ఓ గొప్ప కెరీర్‌కు ఇది ఆరంభం"

--విశ్వనాథన్‌ ఆనంద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.