ETV Bharat / sports

IND Vs WI : 'టీ20ల్లో అంతే.. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం.. ఫ్యూచర్​ స్టార్​ ప్లేయర్లు వారే!'

author img

By

Published : Aug 4, 2023, 10:12 AM IST

IND Vs WI Hardik Pandya : వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో తప్పులు చేశామని, కానీ మిగతా మ్యాచుల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ హార్దిక్​ పాండ్య తెలిపాడు. టీ20 మ్యాచుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరని అన్నాడు.

hardik pandya
hardik pandya

IND Vs WI 1st T20 Hardik Pandya : వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​ను ఓటమితో ప్రారంభించింది. చివరి వరకు పోరాడినా.. లాభం లేకుండా పోయింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే యువకులతో కూడిన భారత్​ జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ హార్దిక్​ పాండ్య తెలిపాడు. తప్పకుండా మిగతా మ్యాచుల్లో పుంజుకొని సిరీస్‌ను నెగ్గేందుకు ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గెలుపోటముల నుంచి నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగుతామని చెప్పాడు.

"విండీస్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఓ దశలో మెరుగ్గానే ఉన్నాం. కానీ.. కీలక సమయంలో పొరపాట్లు చేసి వెనుకబడిపోయాం. కుర్రాళ్లతో కూడిన జట్టు తప్పులు చేయడం సహజమే. వాటి నుంచి నేర్చుకుని మెరుగుపడతాం. మ్యాచ్‌ మొత్తం మా ఆధీనంలోనే ఉన్నప్పటికీ.. వెనువెంటనే వికెట్లు పడటంతో ఛేదన కష్టమైంది. ఇలాంటప్పుడు ఓ రెండు భారీ షాట్లు ఆడి ఉంటే తప్పకుండా విజయం మన సొంతమయ్యేది. టీ20 మ్యాచుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు"

-- హార్దిక్​ పాండ్య, టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​

"ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి పిచ్‌ పరిస్థితే కారణం. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చాం. పేసర్ ముకేశ్‌ కుమార్‌ మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. మరో యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించాడు. తప్పకుండా వీరంతా భవిష్యత్తులో భారత్‌ కోసం అద్భుతాలు చేస్తారనే నమ్మకం ఉంది" అని హార్దిక్‌ అన్నాడు.

కన్నీరు పెట్టుకున్న హార్దిక్​
IND Vs WI Hardik Pandya Emotional : వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆరంభానికి ముందు టీమ్​ఇండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం ఆలపించే సమయంలో ఉబికి వస్తున్న కన్నీరును హార్దిక్‌ ఆపుకోలేకపోయాడు. తన చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ హార్దిక్‌ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ దూరంకావడంతో హార్దిక్‌ భారత జట్టు సారధిగా వ్యవహరిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.