ETV Bharat / sports

IND VS AUS: డక్, డక్, డక్.. మూడు వన్డేల్లోనూ సూర్య గోల్డెన్ డక్!

author img

By

Published : Mar 22, 2023, 9:54 PM IST

టీ20ల్లో తన బ్యాట్​తో చెలరేగిపోయే సూర్యకుమార్​ యాదవ్​.. వన్డే ఫార్మాట్​లో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ గోల్డెన్​ డక్​ అయ్యాడు.

IND VS AUS ODI Series Surya kumar yadav Duck out
IND VS AUS: డక్, డక్, డక్.. మూడు వన్డేల్లోనూ సూర్య గోల్డెన్ డక్!

టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు​. ఈ ఫార్మాట్​లో అగ్రస్థానంలో ఉన్న ఈ విధ్వంసకర బ్యాటర్.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తొలి రెండు వన్డే మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్​.. కీలక మూడో వన్డే మ్యాచ్​లోనూ అష్టన్ ఆగర్​ బౌలింగ్​లో మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. దీంతో ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా పేలవ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

అష్టన్ ఆగర్ వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్‌లో ఫస్ట్​ బాల్​కు విరాట్ కోహ్లీ(54) క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా.. తర్వాతి బాల్​కే సూర్యకుమార్​ పెవిలియన్​ చేరాడు. అష్టన్ ఆగర్ సంధించిన క్విక్ లెంగ్త్ డెలివరీని.. బ్యాక్ ఫుట్ పంచ్‌తో ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి వికెట్లను గీరాటేసింది. దీంతో సూర్యకుమార్ తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. అలా అప్పటి వరకు మ్యాచ్‌లో ఆధిపత్యం చూపించిన భారత్.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది.

ఫ్యాన్స్​ ఆగ్రహం... ఇలా టీ20ల్లో తన బ్యాట్​తో విధ్వంసం సృష్టించే సూర్యకుమార్​ యాదవ్​.. ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్ అవ్వడంపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్​ను వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పించాలని, అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్​మీడియాలో సూర్యను ట్రోల్స్​ చేస్తూ.. మండిపడుతున్నారు.

ఇక ఈ మ్యాచ్​లో ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దెబ్బకు 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్​ అయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 33, 4x4, 2x6 ), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 47, 8 x4, 1x6) రాణించారు. కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ (0) డకౌటయ్యాడు. మిడిలార్డర్​లో అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 38, 2x4, 1x6) పర్వాలేదనిపించాడు. మార్నస్‌ లబుషేన్‌ (28), సీన్‌ అబాట్ (26), స్టాయినిస్ (25), డేవిడ్ వార్నర్‌ (23), అగర్‌ (17), మిచెల్ స్టార్క్ (10*), ఆడమ్ జంపా (10) రన్స్​ చేశారు. టీమ్​ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య(3/44), కుల్దీప్ యాదవ్(3/56) తలో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అక్షర్ పటేల్(2/57), మహ్మద్​ సిరాజ్(2/37) తలో రెండు వికెట్లు సాధించారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ 2023లో నయా రూల్​.. ఇకపై టాస్​ వేశాకే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.