ETV Bharat / international

ఉక్రెయిన్​లో బైడెన్ ఆకస్మిక పర్యటన.. భారీగా సైనిక సాయం.. పుతిన్​కు వార్నింగ్!

author img

By

Published : Feb 20, 2023, 3:46 PM IST

Updated : Feb 20, 2023, 4:26 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్​లో పర్యటించారు. పోలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్న బైడెన్.. అంతకుముందే ఉక్రెయిన్​కు వెళ్లారు.

us-joe-biden-ukraine-visit
us-joe-biden-ukraine-visit

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్​లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బైడెన్ పోలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అంతకుముందే ఉక్రెయిన్​కు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీని కలిశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్​కు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ ప్యాకేజీని బైడెన్ ప్రకటించారు.

బైడెన్ పర్యటన సందర్భంగా శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. జెలెన్​స్కీతో విస్తృత చర్చలు జరిపేందుకే ఈ పర్యటన చేపట్టినట్లు బైడెన్ పేర్కొన్నారని తెలిపింది. "ఏడాది క్రితం దురాక్రమణ ప్రారంభించినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనమైన దేశమని పుతిన్ భావించారు. పశ్చిమ దేశాలు ఒకే అభిప్రాయంతో లేవని అనుకున్నారు. మాపై విజయం సాధించవచ్చని ఊహించారు. కానీ ఆయన పూర్తిగా తప్పు. యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచినా.. ఉక్రెయిన్ ఇంకా రష్యాకు అడ్డుగా నిలబడే ఉంది. ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉంది" అని శ్వేతసౌధ ప్రకటనలో బైడెన్ పేర్కొన్నారు. అనంతరం కీవ్​లో మాట్లాడిన బైడెన్.. ఉక్రెయిన్ కోసం మిలిటరీ సాయాన్ని ప్రకటించారు. కీలకమైన సైనిక పరికరాలు, ఆర్టిలరీ, ఆయుధ వ్యవస్థలు, నిఘా రాడార్లను అందించనున్నట్లు తెలిపారు. గగనతల దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసం ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందనే విషయాన్ని జో బైడెన్ పర్యటన సూచిస్తుందని జెలెన్​స్కీ పేర్కొన్నారు.

బైడెన్ రహస్య పర్యటన నేపథ్యంలో అధికారులు ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో ఉదయం నుంచే ప్రధాన రోడ్లను పోలీసులు బ్లాక్ చేశారు. ప్రభుత్వ భవనాలకు సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. కీవ్​లోని అమెరికా ఎంబసీ వద్ద పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ఉక్రెయిన్​లో దిగిన బైడెన్.. జెలెన్​స్కీతో కలిసి నగర వీధుల్లో నడుస్తూ కనిపించారు. కాగా, బైడెన్ పర్యటన సందర్భంగా కీవ్​లో వైమానిక దాడి సైరన్లు మోగాయి.

ఉక్రెయిన్​కు సాయం ఎలా?
మరోవైపు, ఐరోపా సమాఖ్య సైతం ఉక్రెయిన్​కు మిలిటరీ సాయంపై చర్చలు జరుపుతోంది. ఐరోపాలో ఆయుధాలు, మందుగుండు నిల్వలు పడిపోయిన నేపథ్యంలో.. ఉక్రెయిన్​కు మిలిటరీ సామగ్రి ఎలా పంపాలనే విషయంపై తర్జనభర్జన పడుతోంది. ఉక్రెయిన్ సైన్యానికి నిరంతరం మందుగుండు సామగ్రి అందుబాటులో ఉండేలా చేయడమే ప్రస్తుతం ప్రధానాంశం అని ఐరోపా సమాఖ్య అధికారి జోసెప్ బోరెల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఈయూ విఫలమైతే.. యుద్ధం ఫలితం ప్రతికూలంగా ఉంటుందని అన్నారు. ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిరోజు రష్యా దళాలు 50వేల రౌండ్ల ఆర్టిలరీ ప్రయోగిస్తున్నాయి. ఉక్రెయిన్ మాత్రం 6-7వేల రౌండ్ల ఆర్టిలరీని ప్రయోగిస్తోంది. ఉక్రెయిన్​కు మన సరఫరాలు రష్యా స్థాయికి చేరాలి. ఈయూ ప్రత్యేక ఫండ్ నుంచి మందుగుండు కొనుగోలు దిశగా చర్చలు జరపాలి' అని జోసెప్ పేర్కొన్నారు.

Last Updated :Feb 20, 2023, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.