ETV Bharat / international

వచ్చే ఏడాది చైనాను దాటి మనమే నెం.1.. ఏ విషయంలో అంటే?

author img

By

Published : Jul 11, 2022, 12:21 PM IST

Updated : Jul 11, 2022, 1:19 PM IST

వచ్చే ఏడాది నాటికి జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022 నవంబర్​ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ జనాభా అంచనా 2022 పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ నివేదికను ప్రచురించింది.

india census
india census

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. జనాభా విషయంలో వచ్చే ఏడాది నాటికి చైనాను భారత్ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022 నవంబర్​ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు 'ప్రపంచ జనాభా అంచనాలు 2022' పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ నివేదికను ప్రచురించింది. 1950 నుంచి ప్రపంచ జనాభా నెమ్మదిగా పెరుగుతుండగా.. 2020లో మాత్రం ఒక్క శాతం పడిపోయింది. తాజాగా విడుదల చేసిన అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుంది. 2080 నాటికి జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని.. 2100 వరకు అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

"ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాం. ఈ ఏడాదిలోనే ఈ భూమ్మీద 800కోట్లవ శిశువు జన్మించే అవకాశముందని అంచనా వేస్తున్నాం. మన వైవిధ్యతను వేడుక చేసుకునే సందర్భం అది. ఆరోగ్య ప్రమాణాల్లో మరింత పురోగతి సాధిస్తున్నాం. ఆయుర్దాయం పెరుగుతోంది. మాతా, శిశు మరణాల రేట్లు కూడా తగ్గుతున్నాయి. ఈ భూమిని పరిరక్షించడానికి అందరూ భాగస్వాములు కావాలి."

-ఆంటోనియో గుటెరస్​, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు ప్రాంతాలుగా తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాలు నిలిచాయని ఐరాస నివేదిక వెల్లడించింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 230 కోట్ల జనాభా ఉండగా.. ప్రపంచ జనాభాలో 29శాతం ఇక్కడే నివసిస్తున్నారు. ఇక, 210 కోట్ల జనాభాతో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ఐరాస గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గే అవకాశముందని తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 11, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.