ETV Bharat / entertainment

'ఆ సీన్‌లు సరిచేయాల్సిందే'.. బేషరమ్ సాంగ్‌పై హోంమంత్రి తీవ్ర అభ్యంతరం

author img

By

Published : Dec 15, 2022, 8:50 AM IST

Updated : Dec 15, 2022, 12:26 PM IST

షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె నటించిన పఠాన్‌ చిత్రంలోని 'బేషరమ్‌ రంగ్‌' రొమాంటిక్‌ సాంగ్‌ వివాదాస్పదమవుతోంది. ఈ పాటలో అభ్యంతరకర సీన్‌లు సరిచేయాలంటూ చిత్రబృందానికి మధ్యప్రదేశ్‌ హోంమంత్రి వార్నింగ్‌ ఇచ్చారు.

film-pathan-controversy-increase-objection-of-home-minister-narottam-mishra-now-ias-niyaz-khan
షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన పఠాన్‌ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌పై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత నరోత్తమ్‌ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. 'బేషరమ్‌ రంగ్‌' పాటలో దీపికా పదుకొనే వస్త్రధారణ తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ సీన్‌లను సరిచేయకపోతే తమ రాష్ట్రంలో ఆ చిత్రం ప్రదర్శనపై ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ఇండోర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. "బేషరమ్‌ రంగ్‌ పాటలో దీపికా పదుకొణె కాస్ట్యూమ్స్‌ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కలుషితమైన మనస్తత్వంతో ఈ పాటను చిత్రీకరించినట్టు అనిపిస్తోంది. ఈ సీన్‌లను, పాటలోని దీపికా కాస్ట్యూమ్‌ సరిచేయాలని కోరుతున్నా. లేదంటే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లో ప్రదర్శించాలో వద్దా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జేఎన్‌యూ కేసులో తుక్డే తుక్డే గ్యాంగ్‌కు దీపికా మద్దతుదారుగా కనిపించారు" అని మంత్రి వ్యాఖ్యానించారు. 2016లో దిల్లీలో జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘటన తర్వాత తుక్డే తుక్డే గ్యాంగ్‌ అనే పదాన్ని భాజపా తరచూ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు, సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'పఠాన్‌' చిత్రం జనవరి 25న విడుదల కానుండటంతో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల ‘బేషరమ్‌ రంగ్‌’ అనే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో దీపిక అందాలు, షారుక్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. రామాయణం ఇతిహాసం ఆధారంగా నిర్మించిన బాలీవుడ్‌ చిత్రం 'ఆదిపురుష్‌'లో హిందూ మతానికి చెందిన వ్యక్తుల్ని తప్పుగా చూపించే దృశ్యాల్ని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అక్టోబర్‌లో మంత్రి హెచ్చరించారు. అలాగే, ఈ ఏడాది జులైలో దర్శకురాలు లీనా మణిమేగలై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం కాళీ పోస్టర్‌ వివాదాస్పదం కావడంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Last Updated :Dec 15, 2022, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.