ETV Bharat / city

UPSC: అతని కోసం ఇంటర్వ్యూ తేదీ మార్చిన యూపీఎస్సీ.. ఎందుకంటే?

author img

By

Published : Sep 9, 2021, 10:47 AM IST

సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికయ్యాక ఓ యువకుడికి కరోనా సోకింది. తగ్గిపోతుందిలే కదా అనుకుని ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. కానీ కరోనా మాత్రం కనికరించలేదు. రోజు రోజుకు అతని పరిస్థితి విషమించసాగింది. అయినా యువకుడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగు నెలలపాటు మృత్యువుతో పోరాటం చేసి... విజయం సాధించాడు. అతని ధైర్యాన్ని చూసిన యూపీఎస్సీ ప్రత్యేకంగా మరో అవకాశమిచ్చింది. ప్రస్తుతం అతను సివిల్స్​కు సిద్ధమవుతున్నాడు.

Devanand Telgote
Devanand Telgote

సివిల్స్‌ సాధించాలనేది ఎంతోమంది కల. ఓ యువకుడు ఆ ప్రయత్నంలో ఎంతో శ్రమించి సివిల్స్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పూర్తి చేసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. దానికి హాజరుకావడమే తరువాయి. ఇంతలో కరోనా సోకింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లయింది. ఇంటర్వ్యూకు 15 రోజులే సమయం ఉంది. భయం వెంటాడుతున్నా.. ధైర్యాన్ని కూడగట్టుకొని కరోనా తగ్గిపోతుందని భావించాడు. ఆరోగ్యం కుదుటపడలేదు సరికదా.. రోజురోజుకు విషమంగా మారింది. చివరికి గుండె ధైర్యం, దాతల సాయం, వైద్యుల కృషితో మృత్యువును జయించాడు. సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు.

మహారాష్ట్రకు చెందిన దేవానంద్‌ తెల్గోటే (26) కథ ఇది. సివిల్స్‌ సాధించాలనేది అతడి జీవితాశయం. ఇప్పటికే ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. విజయం దక్కకపోవడంతో.. రెండోసారి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వచ్చాడు. ఈ క్రమంలో దిల్లీ వెళ్లిన సమయంలో జ్వరం వచ్చింది. చివరకు కరోనాగా తేలింది. ఆ మహమ్మారి అతన్ని మృత్యుముఖం వరకు తీసుకెళ్లింది. దిల్లీ, మహారాష్ట్రలో చికిత్స చేయించినా నయం కాలేదు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యుల సూచనల మేరకు ఆఖరి ప్రయత్నంగా ఎయిర్‌ అంబులెన్సులో మే 15న హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దేవానంద్‌ తెల్గోటేది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఓ ప్రైవేటు ఉద్యోగి. తల్లి గృహిణి. కుమారుడు సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికైనందుకు ఎంతో ఆనందించారు. అంతలోనే కరోనా అని తెలిసి తల్లడిల్లిపోయారు. తెలిసిన వారి సాయంతో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను కలిసి వేడుకోవడంతో కిమ్స్‌ వైద్యులతో మాట్లాడి పడక ఇప్పించడమే కాకుండా దేవానంద్‌ కోలుకోవటానికి తన వంతు సాయం అందించారు. అంతకుముందు దేవానంద్‌తోపాటు కోచింగ్‌ తీసుకొని సివిల్స్‌కు ఎంపికై సర్వీసుల్లో చేరినవారు తలాకాస్తా సాయం చేశారు. మహేశ్‌ భగవత్‌ విజ్ఞప్తి మేరకు పలువురు ఐపీఎస్‌లు దాతల నుంచి రూ.కోటి వరకు సమీకరించి ఆ యువకుడి చికిత్సకు వెచ్చించారు. కిమ్స్‌ ఆసుపత్రి సైతం పెద్ద మనసుతో రూ. 20 లక్షల రాయితీ ఇచ్చింది. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ నేతృత్వంలోని వైద్యబృందం అవిశ్రాంతంగా శ్రమించింది. మూడు నెలలకుపైగా ఎక్మో సపోర్టు అందించింది.

ఇంటర్వ్యూ తేదీ మార్చిన యూపీఎస్సీ

అతని సంకల్ప బలం ముందు మృత్యువు తల వంచింది. క్రమంగా కోలుకుంటుండగా మరో సమస్య ఎదురైంది. మూడు నెలలకు పైగా మంచానికే పరిమితం కావడంతో కండరాలు చచ్చుబడిపోయాయి. దీనికి ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేయించారు. దేవానంద్‌ క్రమంగా కోలుకుని బుధవారం కిమ్స్‌ నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. యూపీఎస్సీ అతడి విషయంలో సానుకూలంగా స్పందించింది. మే 5న నిర్వహించాల్సిన ఇంటర్వ్యూను సెప్టెంబరు 22కు మార్చింది. తనకు పునర్జన్మ ఇచ్చిన వైద్యులు, సిబ్బంది, క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆదుకున్న మానవతావాదులకు దేవానంద్‌ కృతజ్ఞతలు తెలిపాడు. సివిల్స్‌లో తప్పకుండా విజయం సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి:

current bill: విద్యుత్తు ఛార్జీల మోత.. అన్ని కేటగిరీల్లోనూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.