ETV Bharat / health

అలర్ట్ : నోట్లో ఈ సమస్యలుంటే - షుగర్​ ముప్పు ఉన్నట్టే! - Diabetes Warning Signs

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 3:45 PM IST

Diabetes Symptoms in Mouth : ప్రస్తుత రోజుల్లో చాలా మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య మధుమేహం. అయితే.. ఈ విషయం మీకు తెలుసా? నోట్లో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా మీకు డయాబెటిస్ ముప్పు ఉందో లేదో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ.. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.

Diabetes Symptoms in Mouth
Diabetes Symptoms (ETV Bharat)

Diabetes Warning Signs Appear in Mouth : మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది డయాబెటిస్​తో బాధపడుతున్నారు. అయితే.. సాధారణంగా యూరిన్ ఎక్కువగా వస్తే డయాబెటిస్ ఉందని అనుమానిస్తాం. అయితే.. అది మాత్రమే కాకుండా నోటిలో కనిపించే ఈ లక్షణాల ఆధారంగా కూడా మధుమేహం(Diabetes) ముప్పును పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నోరు పొడిబారడం : మీ నోరు తరచుగా పొడిబారుతున్నట్టయితే తప్పకుండా అది మధుమేహానికి సంకేతంగా అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. రక్తంలో ఎక్కువ చక్కెర చేరినప్పుడు దానిని మూత్రపిండాలు బయటకు ఫిల్టర్ చేయడానికి కష్టపడతాయి. దీని వల్ల ఎక్కువ యూరిన్ రిలీజ్ అవుతుంది. ఫలితంగా అది శరీరాన్ని డీహైడ్రేషన్​కు గురిచేయడంతో పాటు నోరు పొడిబారడానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు.

2019లో 'డయాబెటిస్ కేర్ జర్నల్‌'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు నోరు పొడిబారడం, అధిక మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియావోటాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ Xiaobin Li పాల్గొన్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా నోరు పొడిబారుతుందని ఆయన పేర్కొన్నారు.

సున్నితమైన చిగుళ్లు : రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలు నోటిలో బ్యాక్టీరియా వ్యాప్తిని సులభతరం చేస్తాయి. ఫలితంగా చిగుళ్లు ఎరుపు రంగులో సున్నితంగా మారుతాయంటున్నారు నిపుణులు. ఇలా మారినప్పుడు చాలా బాధకరంగా ఉంటుంది. అలాగే చిగుళ్ల వ్యాధికి దారితీస్తుందంటున్నారు. బ్రష్ చేసేటప్పుడు రక్తస్రావం కూడా కావొచ్చంటున్నారు.

దంతాల నష్టం : మధుమేహంతో బాధపడుతున్నవారిలో సంభవించే చిగుళ్ల వ్యాధి దంతాల నష్టానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చిగుళ్ల చుట్టూ కఫం ఏర్పడటం, పీరియాంటల్ వ్యాధులు, కావిటీస్, ఇతర నోటి ఇన్ఫెక్షన్ల కారణంగా దంతాలు పట్టు కోల్పోయి త్వరగా ఊడిపోయే అవకాశం ఉంటుందంటున్నారు.

మీ శరీరం నుంచి ఈ రకమైన దుర్వాసన వస్తోందా? - అయితే, మీకు డయాబెటిస్ ఖాయం!

లాలాజలంలో చక్కెర పెరగడం : ఇది కూడా మధుమేహానికి సూచించే ముందస్తు సంకేతాలలో ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. లాలాజలంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం బ్యాక్టీరియా అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా కావిటీస్, నోటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

చెడు శ్వాస : మీలో మధుమేహం ఉంటే నోటి నుంచి కుళ్లిన పండ్ల వాసనతో కూడిన శ్వాస వస్తుందంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి చెడువాసన వస్తుందని చెబుతున్నారు. కాబట్టి, ఇది కూడా డయాబెటిస్ నిర్ధారణకు ముఖ్యమైన సూచికగా చెప్పుకోవచ్చంటున్నారు.

నోటి పుండ్లు : డయాబెటిక్ రోగులలో నోటిలో పుండ్లు ఏర్పడటం చాలా సాధారమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్​లో లేనప్పుడు ఇవి ఎక్కువగా ఏర్పడుతాయంటున్నారు. కాబట్టి, మీ నోటిలో ఇలాంటి లక్షణం కనిపించినా అలర్ట్ కావాలంటున్నారు.

ఇవేకాకుండా.. మధుమేహం ఉన్నవారిలో ముఖ్యంగా దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, వివరించలేని బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీలో పైన లక్షణాలలో ఏవి కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్‌ : మీ కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? - షుగర్ సంకేతం కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.