ETV Bharat / business

Warren Buffett Investment Tips : లాభాల వర్షం కురిపించే.. వారన్​ బఫెట్​ 12 గోల్డన్ ఇన్వెస్ట్​మెంట్​ టిప్స్​ ఇవే!​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 3:37 PM IST

Warren Buffett Investment Tips In Telugu : మీరు స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఈక్విటీ స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇన్వెస్ట్​మెంట్​ గురు వారెన్​ బఫెట్​ చెప్పిన 12 గోల్డన్​ ఇన్వెస్ట్​మెంట్ టిప్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.

12 Golden Investment Rules followed by Warren Buffett
Warren Buffett Investment Tips

Warren Buffett Investment Tips : వారెన్​ బఫెట్​.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప ఇన్వెస్టర్​. స్టాక్​ మార్కెట్​లో ఆయన గురించి తెలియనివారు ఉండరంటే, అది అతిశయోక్తి కాదు. వారెన్​ బఫెట్​ తన పెట్టుబడి సూత్రాలతో అపర కుబేరుడిగా ఎదిగి, ఎంతో మంది నూతన పెట్టుబడిదారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

బఫెట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫిలాసఫీ!
Warren Buffett Investment Philosophy : వారెన్​ బఫెట్​ పెట్టుబడి సూత్రాల గురించి, ఆయన ఇన్వెస్ట్​మెంట్​ ఫిలాసఫీ గురించి తెలుపుతూ రాబర్ట్​ జీ.హాగ్​స్ట్రోమ్​.. 'ది వారెన్ బఫెట్​ వే' అనే పుస్తకం రాశారు. ఇందులో వారెన్ బఫెట్​ చెప్పిన 12 గోల్డెన్​ ఇన్వెస్ట్​మెంట్​ రూల్స్​ గురించి చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా వివరించారు. అత్యంత విలువైన ఈ పెట్టుబడి సూత్రాలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు మనం వారెన్​ బఫెట్​ చెప్పిన 12 గోల్డెన్​ ఇన్వెస్ట్​మెంట్ రూల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Warren Buffett 12 Golden Investment Rules :
వాస్తవానికి స్టాక్​ మార్కెట్​లో ఒక స్టాక్​ కొన్నారంటే.. దాని అర్థం సదరు కంపెనీలో మీరు వాటాదారులుగా చేరారు అని. అందుకే ఓ స్టాక్ కొనే ముందు ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అందుకు ఉపకరించేవే వారెన్​ బఫెట్ చెప్పిన 12 గోల్డెన్​ ఇన్వెస్ట్​మెంట్ రూల్స్. ఇప్పుడు వాటి గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.

  1. సింపుల్​గా, అర్థం చేసుకునే విధంగా ఉండాలి!
    ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టేముందు.. కచ్చితంగా దానికి సంబంధించిన బిజినెస్​ వివరాలు మొత్తం తెలుసుకోవాలి. వాస్తవానికి సదరు కంపెనీ చేస్తున్న వ్యాపారం చాలా సరళంగా, అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి. మీకు అర్థంకాని మితిమీరిన సంక్లిష్టత, టెక్నికల్ ఆపరేషన్స్​ కలిగిన కంపెనీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇది వారెన్ బఫెట్ చెప్పిన మొదటి పెట్టుబడి సూత్రం.
  2. వ్యాపార కార్యకలాపాల్లో స్థిరత్వం ఉండాలి!
    కంపెనీకి మంచి ట్రాక్ రికార్డ్​ ఉండాలి. అంటే చాలా ఏళ్లుగా స్థిరంగా ఒకే విధమైన ఉత్పత్తులను లేదా సేవలను అందిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే సదరు కంపెనీ వ్యాపార స్థిరత్వాన్ని, భవిష్యత్​ను అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి స్థిరత్వం ఉన్న వ్యాపారంలో దీర్ఘకాల పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన పద్ధతి. ఇది వారెన్ బఫెట్ చెప్పిన రెండవ పెట్టుబడి సూత్రం.
  3. పెద్దగా పోటీ లేని వ్యాపారం అయ్యుండాలి!
    ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టేముందు కచ్చితంగా దాని ఫ్రాంచైజ్​ మోడల్​ను చూసుకోవాలి. అంటే సదరు కంపెనీ చేసే ఉత్పత్తులకు లేదా సేవలకు.. ప్రత్యామ్నాయం ఉండకూడదు. అలాగే ప్రభుత్వ నియంత్రణ అతిగా ఉండకూడదు. సింపుల్​గా చెప్పాలంటే, సదరు కంపెనీ చేసే వ్యాపారానికి పెద్దగా పోటీ ఉండకూడదు.
  4. తెలివిగా పెట్టుబడులు పెట్టాలి!
    కంపెనీలు తమ మూలధానాన్ని చాలా తెలివిగా పెట్టుబడి పెట్టి.. రాబడులను సంపాదించాలి. ఒక వేళ కంపెనీ మూలధన పెట్టుబడులపై లాభాలు తెచ్చుకోవడంలో విఫలమైతే.. కచ్చితంగా డివిడెండ్​ల రూపంలో పెట్టుబడిదారులకు నిధులు తిరిగి ఇవ్వాలి. ఇది కంపెనీ తన వాటాదారుల ప్రయోజనాలకు ఇచ్చే ప్రాధాన్యతను, నిబద్ధతను తెలియజేస్తుంది. వాస్తవానికి ఇలాంటి నిబద్ధత కలిగిన కంపెనీ స్టాక్స్​లోనే.. పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
  5. కంపెనీ ఖాతాలను నిబద్ధతతో నిర్వహించాలి!
    కంపెనీలు కచ్చితంగా తమ అకౌంట్లను చాలా నిబద్ధతతో, కచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. ఏ కంపెనీ అయితే నైతికంగా, పారదర్శకంగా తన ఖాతాలు నిర్వహిస్తుందో.. అలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమం అని వారెన్ బఫెట్ సూచిస్తారు. ఎందుకంటే అది ఆ కంపెనీకి సంబంధించిన నిబద్ధత, సమగ్రతలను తెలియజేస్తుంది.
  6. తెలివిగా.. నిజాయితీగా పనిచేయాలి!
    కంపెనీ మేనేజ్​మెంట్​ వ్యాపార వ్యవహారాలను చాలా నిజాయితీగా, తెలివిగా నిర్వహించాలి. మేనేజ్​మెంట్ తాము తీసుకున్న నిర్ణయాలను చాలా నిక్కచ్చిగా, షేర్ హోల్డర్లు అందరికీ తెలియజేయాలి. అలాగే తాము తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను కూడా (లాభమైనా, నష్టమైనా) నిక్కచ్చిగా, నిజాయితీగా వాటాదార్లు అందరికీ తెలియజేయాలి. ఇన్వెస్టర్లు ఇలాంటి మేనేజ్​మెంట్ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని వారెన్ బఫెట్ సూచిస్తూ ఉంటారు.
  7. లాభాలు తెచ్చే సామర్థ్యాన్ని అంచనా వేయాలి!
    వారెన్ బఫెట్ కంపెనీ... ఎర్నింగ్​ పర్​ షేర్​ (EPS) కంటే రిటర్న్​ ఆన్​ ఈక్విటీ (ROE)కే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్​ను జనరేట్ చేసే సామర్థ్యం సదరు కంపెనీకి ఉందా? లేదా? అనేది ఈ ROE ద్వారా స్పష్టంగా అంచనా వేయవచ్చు.
  8. మూలధన సామర్థ్యం
    కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం పెద్ద ఎత్తున మూలధనాన్ని ఉపయోగిస్తాయి. వాస్తవానికి ఇది వాంఛనీయమే. కానీ కంపెనీలు కచ్చితంగా తమ నిర్వహణ వ్యయాలను పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కంపెనీ అయితే తక్కువ నిర్వహణ వ్యయాలతో, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందో.. అలాంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని వారెన్ బఫెట్ అభిప్రాయం.
  9. వ్యయం తక్కువ - లాభాలు ఎక్కువగా ఉండాలి!
    ఇన్వెస్టర్లు.. వ్యయాలు తక్కువగా, లాభాలు ఎక్కువగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చాలా వ్యాపారాలు చేస్తూ, వివిధ మార్గాల ద్వారా ఆదాయాలు సంపాదించే కంపెనీలు కన్నా, ఒకే విధమైన వ్యాపారం చేస్తూ, లాభాలను గడించే కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమమని వారెన్​ బఫెట్​ సూచిస్తుంటారు. ఎందుకంటే ఇది సదరు కంపెనీకి సంబంధించిన స్థిరమైన, అంతర్గత వ్యాపార విలువలను మనకు తెలియజేస్తుంది.
  10. ప్రతీ రూపాయి మరో రూపాయిని సృష్టించాలి!
    బఫెట్​ చెప్పిన బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ సూత్రం 'వన్​ డాలర్​ ప్రామిస్'​. దీని అర్థం ఏమిటంటే.. మీరు పెట్టిన ప్రతి పైసా కూడా మరో పైసాను సృష్టించాలి. ఇందుకోసం మీరు చాలా తెలివిగా మూలధన కేటాయింపులను చేయాలి. ముఖ్యంగా క్రమశిక్షణను పాటించాలి. అప్పుడు మాత్రమే సంపదను సృష్టించగలుగుతారు.
  11. భవిష్యత్​ను అంచనా వేయాలి
    భవిష్యత్​లో కంపెనీ నగదు ప్రవాహం (క్యాష్​ ఫ్లో) ఎలా ఉంటుందో.. కచ్చితంగా ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ అంతర్గత విలువను (Intrinsic Value)ను లెక్కించాల్సి ఉంటుంది. దీని ద్వారా సదరు కంపెనీలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనే విషయంపై ఒక హేతుబద్ధమైన నిర్ణయానికి రాగలుగుతాము.
  12. భద్రత ముఖ్యం
    ప్రతి కంపెనీకి ఒక వాస్తవ విలువ (Intrinsic value) ఉంటుంది. దానిని మనం గుర్తించాలి. సింపుల్​గా చెప్పాలంటే.. స్టాక్​ మార్కెట్లో ఆ కంపెనీ షేర్​ వాల్యూ.. రియల్ వాల్యూ కంటే తక్కువగా ఉన్నప్పుడు దానిని కచ్చితంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రిస్క్ బాగా తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందగలుగుతారు.

'ఇవి బఫెట్ చెప్పిన 12 గోల్డెన్ ఇన్వెస్ట్​మెంట్​ రూల్స్​. వీటిని సరిగ్గా ఉపయోగించుకుని, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టి, సంపద సృష్టించుకోండి. మీ భవిష్యత్​ను బంగారుమయం చేసుకోండి' అని రాబర్ట్​ జీ హాగ్​స్ట్రోమ్​ తన పుస్తకంలో తెలిపారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.