ETV Bharat / bharat

పక్కింటిపై కోపం.. మాంసం, గుడ్డు పెంకులు వేసి వేధింపులు.. చివరకు జైలులో..

author img

By

Published : Nov 29, 2022, 3:53 PM IST

Updated : Nov 29, 2022, 4:57 PM IST

వింత చేష్టలతో పక్కింటి వారిని వేధిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. గత కొంత కాలంగా ఆ మహిళ తమను వేధిస్తున్న కారణంగా.. బాధితులు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుకున్నారు. వీటిలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆ మహిళను అరెస్ట్​ చేశారు. ఈ వింత కేసు ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

Woman throws eggshells at neighbor house
Woman throws eggshells at neighbor house

పక్కింటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తున్న ఫాతిమా

ఉత్తర్​ప్రదేశ్​లో పోలీసుల వద్దకు ఓ వింత కేసు వచ్చింది. పక్కింటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తున్న ఓ మహిళను అరెస్ట్​ చేశారు. పొరిగింటివారిపై కోపంతో ఆమె ఈ పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
బండా జిల్లాలోని ఫాతిమా అనే ఓ మహిళ నిత్యం తమ ఇంటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తోందని శివనారాయణ్ త్రిపాఠీ అనే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసినా సరే.. బాధితుల వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక పోలీసులు ఆమెను అరెస్ట్​ చేయలేదు. గత కొంత కాలంగా ఫాతిమా చేష్టలతో విసుగుచెందిన త్రిపాఠీ కుటుంబం తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుకుంది. నవంబర్​ 22న ఫాతిమా తమ ఇంటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు అందించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన తర్వాత ఫాతిమాను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫాతిమా ఇల్లు త్రిపాఠీ ఇంటి కంటే ఎత్తులో ఉంది. దీని కారణంగా వాటర్​ ట్యాంక్​ నిండిన తర్వాత మిగిలిన నీరు.. త్రిపాఠీ ఇంటిపై పడేది. దీని గురించి అడిగిన ప్రతిసారీ ఫాతిమా గొడవకు దిగేదని బాధితులు తెలిపారు.

మైనర్లకు వేధింపులు
మహారాష్ట్ర నాసిక్​లో ఓ ఆశ్రమం డైరెక్టర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. బాలికలు స్నానాలు చేస్తున్న సమయంలో అతడు వీడియోలు, ఫొటోలు తీసి వారిని వేధింపులకు గురిచేశాడు.

హర్షల్ బాలకృష్ణ మోరే సామాజిక సేవ పేరుతో నాసిక్​లోని మహాస్రుల్​ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఇందులో 13 మంది బాలికలు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా హర్షల్ బాలకృష్ణ​ బాలికలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి.. బెదిరిస్తున్నట్లు కొందరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని చూపించి వారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడ్ని పోక్సోతో పాటు వివిధ సెక్షన్​ల కింద అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సత్సంగం పేరుతో ఆ మైనర్​లను పలుమార్లు బిర్​గావ్​ ప్రాంతానికి తీసుకెళ్లి.. వారిని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆరుగురు బాలికలను ఇలా వేధించినట్లు తేల్చారు. విరాళాల కోసం సోషల్ మీడియాపై ఆధారపడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠినంగా శిక్షి పడేలా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సూచించారు.

కాలేజీ విద్యార్థులపై.. దుండగుల దాడి
కేరళలో కొందరు దుండగులు ఇద్దరు కాలేజీ విద్యార్థులపై దాడి చేశారు. ఆస్పత్రిలో ఉన్న తమ మిత్రుడ్ని కలిసి వస్తున్న ఓ అమ్మాయి, అబ్బాయిలను కొందరు యువకులు వేధించారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరగగా ఆ ముగ్గురు యువకులు.. కాలేజీ విద్యార్థులను గాయపరచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కొట్టాయం సెంట్రల్​ జంక్షన్​ వద్ద నవంబర్​ 28న రాత్రి జరిగింది.

Last Updated :Nov 29, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.