ETV Bharat / bharat

అమెరికాకే పరిష్కారం చూపించారు.. పద్మశ్రీని ఒడిసిపట్టారు.. 'జై భీమ్​'తో వెలుగులోకి..

author img

By

Published : Jan 30, 2023, 10:32 AM IST

ఎంతటి విషపూరితమైన పాములనైనా పట్టేస్తారు వీరిద్దరూ. అమెరికాలో భారీ కొండచిలువలు విధ్వంసం సృష్టిస్తుంటే వాటిని సునాయాసంగా పట్టుకున్నారు తమిళనాడుకు చెందిన వడివేల్‌ గోపాల్‌, మాసి సడైయన్. వీరి ఘనతను గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వీరి గురించి తెలుసుకుందాం.

irular community in tamilnadu
irular community in tamilnadu

భారీ కొండ చిలువలు విధ్వంసం సృష్టిస్తుంటే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుంది. వాటి నుంచి రక్షణ సర్కారుకు తలకుమించిన భారమైంది. ఈ సమస్యకు.. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలోని అరుదైన ఇరుళర్‌ తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిష్కారం చూపారు. 'ఇండియా గ్రేట్' నినాదాల్ని మారుమోగించారు. వారిరువురే.. వడివేల్‌ గోపాల్‌, మాసి సడైయన్‌. విషపూరిత పాములు పడుతూ ప్రపంచవ్యాప్తంగా వీరు చేస్తున్న సేవలకు భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' ప్రకటించింది. ఇరుళర్‌ తెగ.. జనాభా లెక్కల ప్రకారం అత్యంత అరుదైనది. 'ఇరుళర్‌' అంటే తమిళంలో 'చీకటి' అనే అర్థం. వారి జీవితాలు ఎంతో దుర్భరం. చదువు, ఉద్యోగాలు లేవు. ఎవరికైనా ఉద్యోగం వస్తే.. దాన్ని గొప్ప విషయంగా చూస్తారు. అలాంటి తెగకు చెందిన ఈ ఇద్దరూ వారసత్వంగా వస్తున్న పనిలోనే నైపుణ్యం సంపాందించి, దానికి సాహసాన్ని జోడించి కీర్తి పురస్కారాన్ని దక్కించుకున్నారు.

irular community in tamilnadu
వడివేల్ గోపాల్, మాసి నడైయన్

కన్నుపడితే అంతే..
వడివేల్‌ గోపాల్‌, మాసి సడైయన్‌లది చెంగల్పట్టు జిల్లా చెన్నేరి అనే చిన్న గ్రామం. చిన్నతనం నుంచి అడవి జీవితమే. తండ్రుల నుంచి పాములు పట్టే విద్య నేర్చుకున్నారు. ఎంతటి విషపూరిత పామునైనా సులువుగా.. వేగంగా లొంగదీసుకుంటారు. 2016-17 మధ్య వీరి ప్రతిభ వెలుగులోకి వస్తున్న సమయంలో ప్రఖ్యాత అమెరికన్‌- ఇండియన్‌ సర్పాల పరిశోధకుడు (హెర్పెటాలజిస్ట్‌) రోములస్‌ ఎర్ల్‌ విటేకర్‌కు విషయం చేరింది.

అదే సమయంలో అమెరికాలోని ప్లోరిడాలోని పలు ప్రాంతాల్లో బర్మీస్‌ పైథాన్‌లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 15 నుంచి 23 అడుగుల పొడవుతో భయంకరంగా ఉండే ఈ కొండ చిలువలు జంతువులను తినేస్తూ ప్రభుత్వానికే దడ పుట్టించాయి. ఊర్లలోకీ వచ్చేవి. అప్పట్లో ప్లోరిడా ప్రభుత్వం ఈ పైథాన్‌లను చంపేవారికి నగదు బహుమతుల్ని ప్రకటించింది. వీటిని పట్టేవారిని చూపాలని పోటీల్ని నిర్వహించేది. ఆ ప్రభుత్వం దృష్టికి వడివేల్‌ గోపాల్‌, మాసి సడైయన్‌ గురించి విటేకర్‌ తీసుకెళ్లారు. దీంతో తమిళ అనువాదకుల్ని పెట్టి మరీ ఈ ఇద్దరినీ ప్లోరిడాకు తీసుకెళ్లారు. సంప్రదాయ పద్ధతుల్లో కొండ చిలువలు పట్టే వీరి తీరు అక్కడి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. అమెరికాలోని నిష్ణాతులు సైతం వెయ్యి మంది కలిసి నెలల తరబడి 106 కొండ చిలువల్ని పడితే.. వీరిద్దరు నెలలోనే 30కిపైగా పట్టేవారు. స్థానికులకు శిక్షణ ఇచ్చేవారు. దీంతో ఇద్దర్ని ఘనంగా సన్మానించారు. తర్వాత పలు దేశాలకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. విష సర్పాలపై పరిశోధన చేసేందుకు థాయ్‌లాండ్‌లోని నిపుణులు వీరి సాయం కోరడం విశేషం.

irular community in tamilnadu
ఫ్లోరిడాలోని బృందంతో వడివేల్ గోపాల్, మాసి నడైయన్

'జైభీమ్‌'తో మరింత వెలుగులోకి..
2021లో విడుదలైన 'జైభీమ్‌' చిత్రం ఓ సంచలనం. ఇరుళర్‌ తెగపై జరుగుతున్న దాడులు, తప్పుడు కేసుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. దీంతో దేశంలో ఈ తెగపై చర్చ మొదలైంది. పలువురు ఆ తెగపై పుస్తకాలూ రాశారు. ఇరుళర్‌ తెగకు పద్మశ్రీ రావడం ఒక చరిత్రే. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వీరు మొత్తంగా 2.13 లక్షల మంది ఉన్నారు. అటవీ ప్రాంతాల్లోనే వీరి జీవనం. పాములు పట్టుకోవడం, అడవుల్లో తేనె సేకరించడం, పొలాల్లో పనులు వృత్తి. చదువుకున్నవారు తక్కువే. జంతువులతో ఎలా వ్యవహరించాలో వెన్నతో పెట్టిన విద్య. పాము కనిపిస్తే.. వెంటనే విషపూరితమా.. కాదా చెప్పేస్తారు. 1972 వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున వేటగాళ్లుగా కొనసాగుతున్నారు.

చెన్నై శివారు ఈసీఆర్‌లో వడనెమ్మేలి ప్రాంతంలో 'ఇరుళర్‌ పాములుపట్టేవారి పారిశ్రామిక సంక్షేమ సంఘం' (ఐఎస్‌సీఐసీఎస్‌) ఏర్పాటైంది. దాదాపు 50ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇక్కడ ఇరుళర్‌ తెగవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. పాముల నుంచి తీసిన విషం కొన్ని ప్రత్యేకించిన ఔషధ సంస్థలకు ఈ కేంద్రం నుంచి పంపుతున్నారు. దీంతో పాము కాటు ఔషధాలు తయారవుతున్నాయి.

సాహస ప్రయాణం
పద్మశ్రీ అవార్డు తమకు ప్రకటించినప్పుడు వీరు కరూరు జిల్లాలో ఉన్నారు. తమ శ్రమకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ విజయానికి రోములస్‌ విటేకర్‌ కారణమని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు స్పందించారు. ఇరుళర్‌ తెగ వారికి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని, వారి ప్రయాణం సాహసోపేతమైందని, ఆ జ్ఞానాన్ని ఎన్నో దేశాలు అందిపుచ్చుకోవడం గర్వకారణమని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.