ETV Bharat / bharat

ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడ్డ ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్ మృతి

author img

By

Published : Jan 29, 2023, 7:57 PM IST

Updated : Jan 29, 2023, 8:23 PM IST

బులెట్ గాయంతో ఆస్పత్రిలో చేరిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిశోర్ దాస్ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అపోలో ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.

OD-MINISTER-SHOT
OD-MINISTER-SHOT

ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్‌ ప్రాణాలు కోల్పోయారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజనగర్‌లో ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రిపై.. గాంధీచౌక్ వద్ద ఏఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. సమీపం నుంచి 2రౌండ్ల కాల్పులు జరపడం వల్ల మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులతో స్పృహ కోల్పోయిన మంత్రిని... కారులోనే ఝర్సుగూడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స ఇచ్చినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదని ఆస్పత్రి తన ప్రకటనలో తెలిపింది. 'గాయానికి చికిత్స చేశాం. హార్ట్ పంపింగ్ మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఐసీయూలో అత్యవసరంగా చికిత్స అందించాం. అయినప్పటికీ ఆయనను కాపాడలేకపోయాం. గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు' అని అపోలో ఆస్పత్రి స్పష్టం చేసింది.

నవదాస్ మృతిపై ఒడిశా సీఎం నవీన్ పట్నాకయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి ఆయన విలువైన ఆస్తి వంటి వారని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. మరోవైపు, మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాల్ దాస్​ను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే విషయమై దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేయాలని నేర విభాగానికి సూచించింది. నవకిశోర్‌ వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్ఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రిపై కాల్పులు జరగడంపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండించిన సీఎం... సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

బిజూ జనతాదళ్‌లో సీనియర్‌ నేత అయిన నవకిశోర్‌ దాస్‌.. మహారాష్ట్రలోని శని శింగణాపుర్‌ దేవాలయానికి కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఇటీవల వార్తల్లో నిలిచారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రిపై దాడులు జరగడం అటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఒడిశాలో ఎన్నికల సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయని.. ఇవి ఆందోళన కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Last Updated :Jan 29, 2023, 8:23 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.