ETV Bharat / bharat

Center for Social Service Voluntary Organisation : ఆశ్రమం నుంచి అమెరికా దాకా..

author img

By

Published : May 18, 2023, 12:39 PM IST

Center for Social Service Voluntary Organisation : అమ్మనాన్నలు లేని వారికి అండగా నిలుస్తూ.. వారి యోగక్షేమాలు చూస్తుంది హైదరాబాద్​లోని సెంటర్​ ఫర్​ సోషల్​ సర్వీస్​ అనే స్వచ్ఛంద సంస్థ. పదో తరగతిలో ఉత్తీర్ణులైన అనాథ బాలికలకు, 80 శాతం మార్కులు సాధించిన వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి చేయూతనందిస్తుంది. ఇంతకీ ఈ సంస్థను స్థాపించడానికి గల కారణాలు ఏంటి, నడుపుతుంది ఎవరు అనేది ఓసారి తెలుసుకుందామా..?

center for social service
center for social service

Center for Social Service Voluntary Organisation : అమ్మలేని వారికి అండగా నిలిచి.. నాన్న లేని వారికి వారి బాగోగులు చూసుకుంటుంది. ఆధారం లేని వారి పైచదువులకు అయ్యే ఖర్చులన్నీ భరించి.. వారిని భవిష్యత్తులో పైకి ఎదిగేలా చేయూతనందిస్తుంది హైదరాబాద్​లోని హయత్​నగర్​లో ఉన్న సెంటర్​ ఫర్​ సోషల్​ సర్వీస్​ అనే స్వచ్ఛంద సంస్థ. అనాథ బాలికలను, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థినులను దగ్గరికి చేర్చుకుని వారి భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తోంది.

తాజాగా పదో తరగతిలో ఉత్తీర్ణులైన అనాథ బాలికలను, 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినులను తమ ఆశ్రమంలో చేర్పించుకుంటున్నారు. వారికి ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల సేవా ప్రస్థానంలో వందల మంది విద్యార్థినులు ఈ సంస్థ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. వారిలో చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

తాను పడిన వేదన.. ఇంకొకరు పడకూడదని..: విజయలక్ష్మి.. ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్య. తాను 2004లో ఈ సంస్థను ప్రారంభించారు. తన భర్త గుండెపోటుతో మరణించాక.. ఒంటరి తల్లిగా ఆమె పడ్డ ఇబ్బందులు ఇంకెవరూ పడకూడదన్న ఆలోచనతో మొదట్లో పది మంది విద్యార్థినులతో ఈ సంస్థ ప్రారంభించారు. ఇప్పటికి ఈ సంస్థ మొదలై రెండు దశాబ్దాలు పూర్తి అయ్యింది.

చదువుతో పాటు జీవితం..: ప్రస్తుతం ప్రతి సంవత్సరం కొత్తగా 80 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. దాంతోపాటు వారి ఉన్నత చదువులకయ్యే ఖర్చులను భరిస్తోంది. ఈ సంస్థ సహకారంతో చదువు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులు యూఎస్​లో ఎంఎస్​ పూర్తి చేసి అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరో ముగ్గురు యువతులు అక్కడ ఎంఎస్​ చదువుతున్నారు. మరికొంత మంది నగరంలోని ఎంఎన్​సీలైనా టాటా, డెలాయిట్ లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

వారి కోసం స్కూలు నిర్మాణం..: అమ్మానాన్నలను కోల్పోయి వచ్చిన మరికొందరు యువతులు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రతి సంవత్సరం ఆశ్రమంలో చేరే పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపడం, వారికి రవాణా, భద్రత తదితర సమస్యలను అధిగమించడానికి 2009లో ఈ సంస్థ వారే ఒక పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

550 విద్యార్థులకు చదువు..: ఓ దాత పాఠశాల భవనం నిర్మించడంతో ఆయన అభ్యర్థన అనుసారం ‘నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్‌ గర్ల్స్‌ స్కూల్‌(ఇంగ్లీష్‌ మీడియం)’ పేరుతో పాఠశాలను ప్రారంభించారు. ఇందులో విద్యార్థినులకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 550 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన అనాథ బాలికలు, 80 శాతం మార్కులు సాధించిన తల్లి/ తండ్రి లేని ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 79952 33348, 70938 00896 నంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.