ETV Bharat / bharat

నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ వ్యతిరేకించలేదు - నేడు రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 7:56 AM IST

Chandrababu Liquor Case Arguments: అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడిని చేయడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. మద్యం కేసులో తెలుగుదేశం అధినేతకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన వాదించారు. మంత్రివర్గం, శాసనసభ ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజు తొలగించినట్లు తెలిపారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ దీనిని వ్యతిరేకించలేదని.. అధికారం చేపట్టాక ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇబ్బందులకు గురిచేసేందుకే తప్పుడు కేసు పెట్టారన్నారు.

Chandrababu_Liquor_Case_Arguments
Chandrababu_Liquor_Case_Arguments

Chandrababu Liquor Case Arguments: నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ వ్యతిరేకించలేదు - నేడు రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు

Chandrababu Liquor Case Arguments: మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధిని చేకూర్చేలా గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో.. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున నాగముత్తు వాదనలు వినిపించారు.

మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 కాలానికి ప్రివిలేజ్‌ ఫీజు విధింపు నిబంధనను ఎక్సైజ్‌ చట్టం నుంచి తొలగిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌, శాసనసభ ఆమోదం ఉందని సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదించారు. ఫీజు తొలగింపు వ్యవహారంపై చర్చ జరిగినప్పుడు ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారని, ఏ ఒక్కరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదన్నారు.

'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'

ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపునకు గవర్నర్‌, శాసనసభ ఆమోదంతోనే చట్ట సవరణ జరిగిందని చెప్పారు. రాజ్యాంగంలోని అధికరణ 163(3) ప్రకారం ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని గవర్నర్‌కు మంత్రులు చేసిన సూచనలపై న్యాయస్థానాలు విచారణ చేయడానికి వీల్లేదని నాగముత్తు అన్నారు. వాస్తవానికి 2012 వరకు ప్రివిలేజ్‌ ఫీజు విధింపు విధానమే లేదని, ఆ తర్వాత మూడేళ్ల పాటు అమలులో ఉందన్నారు. ఆ ఫీజును తొలగించాలంటూ 2015లో అప్పటి ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ప్రతిపాదించారని, ఆ అధికారం కమిషనర్‌కు ఉందని నాగముత్తు పేర్కొన్నారు.

శాసనసభ ఆమోదంతో తీసుకున్న ప్రివిలేజ్‌ ఫీజు తొలగించారని అలాంటప్పుడు ఆ నిర్ణయం తప్పెలా అవుతుందని వాదించారు. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలకు రాజకీయ రంగు పులిమి, ప్రస్తుత సర్కార్ చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. మద్యం కేసులో చంద్రబాబు నేరానికి పాల్పడ్డారనేందుకు, దురుద్దేశంతో వ్యవహరించారనేందుకు, ఆయనకు లబ్ధి చేకూరిందనేందుకు.. సీఐడీ వద్ద ప్రాథమిక ఆధారాల్లేవన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కేసులో ఇరికించారన్నారు. చంద్రబాబు పాత్ర ఉందనేలా.. ఎఫ్‌ఐఆర్‌, ప్రాథమిక దర్యాప్తు రిపోర్టులో సీఐడీ ఎలాంటి వివరాల్నీ పేర్కొనలేదన్నారు.

మద్యం, రింగ్‌రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్​పై విచారణ వాయిదా

అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌.. కేసులో మొదటి నిందితుడు శ్రీనివాస శ్రీనరేష్‌ దురుద్దేశంతో ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపు ప్రతిపాదన చేశారని సీఐడీ దాఖలు చేసిన కౌంటర్‌లోనూ పేర్కొనలేదన్నారు. వివిధ స్థాయుల్లో ఉన్నతాధికారుల పరిశీలన తర్వాత ఎక్సైజ్‌శాఖ అప్పటి మంత్రి.. కేసులో రెండో నిందితుడు కొల్లు రవీంద్ర.. ఫైలుకు ఆమోదం తెలిపారన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మద్యం కొనుగోలుకు సంబంధించి 70 శాతం ఆర్డర్లను కొన్ని కంపెనీలకే ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోందన్న నాగముత్తు... మార్కెట్లో డిమాండ్‌ ఆధారంగా స్థానిక అధికారులు మద్యం కొనుగోలుకు ఆర్డర్లిస్తారని కోర్టుకు నివేదించారు. అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ చంద్రబాబును బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్నా, విచారణ జరపాలన్నా... అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17(ఏ) ప్రకారం గవర్నర్‌ ఆమోదం తప్పనిసరని గుర్తు చేశారు. ప్రస్తుత కేసు నమోదు విషయంలో గవర్నర్‌ నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పారు.

చంద్రబాబు బెయిల్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ఇంతకీ ఏమని పేర్కొందంటే?

లైసెన్స్‌ ఫీజు పెంపును సవాలు చేస్తూ నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ గతంలో హైకోర్టును ఆశ్రయించిందన్న చంద్రబాబు తరఫు న్యాయవాది.. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో విడతల వారీగా ఫీజు బకాయిలను చెల్లించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ వినతిని సమర్పించిందన్నారు. దానిని పరిగణనలోకి తీసుకుని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ విడతల వారీగా వడ్డీ సహా బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పుకొందని తెలిపారు. దానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం ఉందని చెప్పారు.

ఎస్పీవై ఆగ్రోకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయం ద్వారా పిటిషనర్‌కు లబ్ధి చేకూరిందా అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని సీఐడీ ఇప్పుడు చెబుతోందన్న నాగముత్తు.. సీఐడీ చేస్తోన్న క్విడ్‌ప్రోకో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టంచేశారు.దర్యాప్తునకు సహకరించేందుకు పిటిషనర్‌ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. నాగముత్తు వాదనలు ముగియడంతో సీఐడీ వాదనల కోసం విచారణ నేటికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సీఐడీ

ఇదే కేసులో ముందస్తు బెయిల్​ కోసం టీడీపీ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపు నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఫిర్యాదు చేశారని.. నిజంగా నష్టం జరిగితే గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించి బార్‌ లైసెన్స్‌ల విషయంలో ప్రివిలేజ్‌ ఫీజును ఎందుకు పునరుద్ధరించలేదని ప్రశ్నించారు. బార్‌లకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపు విషయంలో గత ప్రభుత్వ విధాన నిర్ణయాన్నే ప్రస్తుత సర్కారు కొనసాగిస్తోందని.. దీన్ని బట్టి చూస్తే దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని స్పష్టమవుతోందన్నారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్​ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.