ETV Bharat / bharat

'పదేళ్లు గడిచినా.. నాటి పరిస్థితులే నేటికీ'.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన

author img

By

Published : Dec 16, 2022, 8:31 AM IST

నిర్భయ ఘటన జరిగి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళలకు భద్రత లేదని నిర్భయ తండ్రి బద్రీ నారాయణ అభిప్రాయపడ్డారు.

nirbhaya case
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు

అది 2012 డిసెంబర్‌ 16. సరిగ్గా పదేళ్ల క్రితం.. దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఓ అమ్మాయిపై దిల్లీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. దీంతో ప్రభుత్వం 'నిర్భయ' పేరుతో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష పడింది. ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా 'మృగాళ్లు'లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. 'నిర్భయ' ఘటన జరిగి 10 ఏళ్లయినా ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని నిర్భయ తల్లిదండ్రులు సైతం వాపోతున్నారు.

గడిచిన పదేళ్లలో ఏమాత్రం మార్పు రాలేదని, నిర్భయకు తప్ప ఎవరికీ న్యాయం జరిగిందని తాను అనుకోవడం లేదని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళలకు భద్రత లేదని నిర్భయ తండ్రి బద్రీ నారాయణ తెలిపారు. ఇప్పటికీ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. అయితే, లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, ఇదొక్కటే కొత్తగా వచ్చిన మార్పు అని ఆశాదేవి పేర్కొన్నారు.

గతేడాది దేశ రాజధాని దిల్లీలో సగటున రోజుకు ఇద్దరు మైనర్లు అత్యాచారానికి గురైనట్లు నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ పేర్కొంది. 2021లో దిల్లీలో మహిళలపై 13వేలకు పైగా నేరాలు జరిగాయని, 2020తో పోలిస్తే 40 శాతం పెరిగాయని తెలిపింది. నిర్భయ ఘటనకు మరో రెండ్రోజుల్లో 10 ఏళ్లు పూర్తవుతాయనగా.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్‌ దాడి జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. తాజా ఘటనపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. 'ఆ బాలిక ఏం తప్పు చేసింది? స్కూలుకెళ్లే ఆ చిన్నారి జీవితం ఇప్పుడు నాశనమైపోయింది' అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. పదేళ్లు పూర్తయినా కూతురు జ్ఞాపకాలు తమను వెంటాడుతూనే ఉన్నాయంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.