ETV Bharat / state

చోరీలు పాతకథ, ఇప్పుడంతా సైబర్‌ నేరాలే - గణనీయంగా పెరుగుతున్న కేసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 11:58 AM IST

Updated : Feb 22, 2024, 12:03 PM IST

Cyber Crime Cases Increasing Tremendously in Telangana : అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది.

Cyber Crime Cases in Telangana
Cyber Crime Cases Increasing Tremendously in Telangana

Cyber Crime Cases Increasing Tremendously in Telangana : ప్రస్తుతం సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయి. సాధారణ నేరాల కంటే అత్యధికంగా నమోదవడమే కాకుండా కోట్ల రూపాయలు సొత్తు నేరగాళ్లు కాజేస్తున్నారు. గత మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే రాజధానిలో సగటున 9 నుంచి 10 వేల మధ్య ఇళ్లల్లో దొంగతనాలు, వాహన, సెల్​ఫోన్​ చోరీలు రికార్డు కాగా, సైబర్ నేరాల సగటు పెరుగుదల 10-15 శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. బాధితులు పోగొట్టుకునే సొత్తు రూ. వందల కోట్లలో ఉంటోంది. ఒక్క 2023లో నగరంలోని మూడు కమిషనరేట్లలో కలిపి సుమారు రూ.450 కోట్లు పోగొట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

దొంగతనాలు, ఇతర చోరీల పోగొట్టుకునే సొత్తు కంటే ఇది కనీసం 10 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ తదితర కేసుల్లో కాజేసిన సొత్తు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. నిందితుల ప్రమేయం నేరుగా ఉండడం, సీసీ పుటేజీలు, వేలిముద్రలు(Finger Prints), ఇతర సాంకేతిక ఆధారాలతో తేలిగ్గా చిక్కుతారు. ఇటీవలికాలంలో ఇళ్లల్లో దొంగతనాలు, సొత్తు కోసం హత్య వంటివి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో సెల్​ఫోన్​ చోరీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్​సైట్ అందుబాటులోకి రావడంతో చోరీ (పోగొట్టుకున్న) సెల్‌ఫోన్ల రికవరీ పెరుగుతోంది.

సైబర్​ నేరాల్లో డబ్బులు కోల్పోతున్న బాధితులు - కొత్త విధానంతో సొమ్మును రికవరీ చేస్తున్న పోలీసులు

Cyber Crime Cases in Telangana : అదే సైబర్ నేరాల్లో రికవరీ రేటు మాత్రం సరాసరి 5 శాతం కూడా ఉండడం లేదు. నిందితుల్ని కటకటాలు లెక్కించడమూ కష్టసాధ్యంగా మారుతోంది. ఉదాహరణకు హైదరాబాద్ కమిషనరేట్​లో గతేడాది చోరీ కేసుల్లో మొత్తం రూ.38.38 కోట్లు సొత్తు కాజేయగా పోలీసులు రూ.28.45 కోట్లు (74.15%) రికవరీ చేశారు. అదే సైబర్ నేరాల్లో సగటున 5- 6 శాతం మాత్రమే ఉంటోంది. సైబర్ క్రైమ్ పోలీసులు అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు సైబర్ నేరాల బారినపడి రోజూ సగటున రూ.3 కోట్లకు పైనే పోగొట్టుకుంటున్నారు. వాస్తవానికి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టే సొమ్ము ఇంతకు 10 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఒక్క నగరంలోనే రూ. కోటికి పైగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఏటా భారీగా నమోదవువుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రజలు అప్రమత్తంగా ఉండడమే మార్గమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు అప్రమత్తత, కనీస రక్షణ చర్యలు తీసుకుంటే చోరీలను నివారించే అవకాశముంది. సైబర్ నేరాల్లో మాత్రం కొందరు తేలిగ్గా నేరగాళ్ల బుట్టలో పడిపోతున్నారు. పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ(Crypto Currency) లాంటి ఉదంతాల్లో ప్రాథమికంగా రూ. వెయ్యి అంతకంటే తక్కువ మొత్తాల్లో లాభాలు చూపించి రూ. కోట్లల్లో కొట్టేస్తున్నారు.

నేరం జరిగాక సకాలంలో బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసి డబ్బు ఇతర ఖాతాల్లోకి బదిలీ కాకుండా చూడడం, ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలు సేకరించి న్యాయ ప్రక్రియ పూర్తి చేసి బాధితులకు డబ్బు తిరిగి అప్పగించడం సుధీర్ఘ ప్రక్రియ. ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అసలు నేరాలు జరగకుండా జాగ్రత్తపడేలా ప్రజల్లో అవగాహన కలిగేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

'ప్రముఖుల పేర్లతో ఫేక్‌ అకౌంట్స్‌ - ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి'

మీ మొబైల్​కు ఏవైనా అనుమానాస్పద లింకులు వచ్చాయా - వెంటనే ఈ నంబర్​కు వాట్సాప్​ చేసేయండి

Last Updated :Feb 22, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.