ETV Bharat / spiritual

వాస్తులో ఈశాన్యానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ దిశలో టాయిలెట్​ ఉండొచ్చా? - Significance Of Northeast In Vastu

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 7:04 AM IST

Significance Of Northeast In Vastu
Significance Of Northeast In Vastu

Significance Of Northeast In Vastu : ఇంటికి బలం ఈశాన్యం. అలాంటి ప్రాముఖ్యం కలిగిన ఈశాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Significance Of Northeast In Vastu : వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిక్కుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇల్లు నిర్మాణ విషయంలో ఈశాన్యానికి ఉన్న ప్రాధాన్యం గురించి అలాగే ఆ దిక్కున ఎటువంటి నిర్మాణాలు చేపడితే ఆ ఇంట్లో వారికీ శుభం జరుగుతుందో తెలుసుకుందాం.

దిక్కులు- విదిక్కులు
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే నాలుగింటిని మనం దిక్కులు అంటాము. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం అనే నాలుగింటిని విదిక్కులు అంటారు.

ఈశ్వరుని స్థానం ఈశాన్యం
దిక్కుల్లో తూర్పునకు ఎంత ప్రాధాన్యం ఉందో విదిక్కుల్లో ఈశాన్యానికి అంతే ప్రాధాన్యం ఉంటుంది. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈశాన్య దిక్కుకి అధిపతిగా ఉండి ఇంట్లోని వారిని సదా రక్షిస్తూ ఉంటాడు. ఈశాన్య దిక్కులో వాస్తు పురుషుని శిరస్సు ఉంటుందని చెబుతారు. ఈశాన్యం లేని స్థలం ప్రాణం లేని శరీరం వంటిది.

ఈశాన్యం ఐశ్వర్యం
ఈశాన్యం వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటే ఆ ఇంటి యజమాని, ఇల్లాలు ఎప్పుడూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. అలాగే సంతానం కూడా మంచి చదువులతో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఎల్లప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు.

ఈశాన్యంలో బరువు ఇంటికి తెచ్చే అరిష్టం
ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చి పెట్టే ఈశాన్యంలో చీపురు పుల్ల అంత బరువు కూడా పెట్టకూడదు. ఈశాన్యంలో ఎలాంటి బరువులు పెట్టకూడదు, ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఆర్థిక పురోభివృద్ధి ఉండదు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడి విపరీతంగా ధనవ్యయం చేయాల్సి వస్తుంది.

ఈశాన్యంలో మొక్కలు పెంచవచ్చా!
ముందుగా మనం చెప్పుకున్నట్లు ఈశాన్యంలో ఎలాంటి బరువు ఉంచకూడదు. అవి మొక్కలైనా సరే! పెద్ద పెద్ద చెట్లు అసలే నిషేధం కనీసం చిన్నపాటి మొక్కలు కూడా పెంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈశాన్యం చల్లగా ఇల్లు చల్లగా!
ఈశాన్యం ఎప్పుడూ చల్లగా ఉండాలి. అంటే ఇక్కడ నుయ్యి, నీటి సంపులు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో నుంచి బయటకు పోయే నీరు కూడా ఈశాన్యం వైపు నుంచి బయటకు వెళ్ళాలి. ఈశాన్యంలో అగ్నికి సంబంధించిన వేవి ఉండరాదు.

ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొచ్చా!
ఈశాన్యంలో టాయిలెట్లు దారిద్య్రానికి ఆహ్వానం పలికినట్లే! డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. ఇది ఇంట్లో నివసించే స్త్రీలకూ దుఃఖాన్ని తెచ్చిపడుతుంది.

ఈశాన్యం నడక లక్ష్మీ కటాక్షం
ఇంటికి నడక కూడా ఈశాన్యం వైపు నుంచి ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇది వాస్తు శాస్త్రంలోని ప్రాధమిక సూత్రం.

ఈశాన్యం తగ్గాలా! పెరగాలా!
ఇంటికి ఈశాన్యం మిగిలిన దిక్కుల కన్నా తగ్గి ఉండరాదు. మిగిలిన దిక్కుల కన్నా ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉంటే మంచిది. అలా అని విపరీతంగా పెరగడం కూడా మంచిది కాదు. అలాగే ఈశాన్యం చీలి ఉంటే ఆ ఇంట్లో నివసించే వారు కళావిహీనులై, కష్టాల పాలవుతారు.

ఈశాన్యం మూత పడితే ఆరోగ్యానికి హాని!
ఏ కారణం చేతనైనా ఈశాన్యం మూత పడితే ఆ ఇంట్లో నివసించే వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా!

ఈశాన్యం పరిశుభ్రం - ఆరోగ్యం పదిలం
ఇంటికి ఈశాన్యం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటే ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తించి ఇల్లు నిర్మించుకుంటే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.