ETV Bharat / politics

నాడు కోట్ల రూపాయల డిమాండ్‌- నేడు బతిమాలి మరీ వైసీపీ ఎంపీ సీట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 10:08 AM IST

No Demand to YSRCP MP Tickets: వైసీపీలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంపీ టికెట్లపై కృత్రిమ డిమాండు సృష్టికి వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో చివరకు కొత్త అభ్యర్థుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

No_Demand_to_YSRCP_MP_Tickets
No_Demand_to_YSRCP_MP_Tickets

నాడు కోట్ల రూపాయల డిమాండ్‌- నేడు బతిమాలి మరీ వైసీపీ ఎంపీ సీట్లు

No Demand to YSRCP MP Tickets: "140 కోట్లు ఇస్తే ఒంగోలు టికెట్‌ మీదే కాదంటే నెల్లూరైనా సరే" ఇది మొదటి మాట. "120 కోట్లివ్వండి, పోటీచేయండి" ఇది రెండో మాట. అలా దఫదఫాలుగా తగ్గి చివరకు "కనీసం 30 కోట్లు పెట్టుకోండి, టికెట్‌ మీదే" అనే స్థాయికి అధికార వైసీపీ దిగజారింది. ఒంగోలు లోక్‌సభ సీటు విషయంలో చెన్నైలో స్థిరపడిన రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారితో వైసీపీ పెద్దల బేరాల తీరిది. ఇది చూసి పార్టీ గెలిచే పరిస్థితే ఉంటే ఇన్నిసార్లు తనతో మాట్లాడేవారు కాదు.

ఇదేదో మునిగిపోయే నావలా కనిపిస్తోందిని భావించి సదరు వ్యక్తి మెల్లగా జారుకున్నారు. పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయన్న అనుమానంతోనే వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, సంజీవ్‌కుమార్‌ వంటివారు పార్టీని వీడి వెళ్లిపోయారు. నెల్లూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తొలినాళ్ల నుంచే విభేదించి దూరంగా ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల రాజీనామా చేశారు.

ఆరు లోక్‌సభ సీట్లపై వైసీపీ పెద్దలు కొంతకాలంగా కృత్రిమ డిమాండు పెంచారు. వీటికి ఆశావహులు ఎక్కువగా వస్తున్నారని అక్కడున్న తమ పార్టీ సిట్టింగ్‌ ఎంపీలకే చెప్పారు. మళ్లీ పోటీ చేయాలంటే ఆ లోక్‌సభ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 20 కోట్ల వరకైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడాలని స్పష్టం చేసినట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇంత ఖర్చుచేసి గెలుస్తామా? ఒకవేళ గెలిచినా ఇంత పెద్ద మొత్తం పెట్టడం అవసరమా అని కొందరు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి రానున్న ముగ్గురు అగ్రనేతలు

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఈసారి పోటీచేయనని చాలా ముందుగానే తేల్చి చెప్పేశారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముందుగానే జాగ్రత్తపడి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ విశాఖపట్నం తూర్పునకు మారిపోయారు. మాగుంట పార్టీని వీడటంతో వేరే అభ్యర్థులు దొరక్క ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా తీసుకొచ్చారు. ఏలూరులో బయట నుంచి కొత్తవారు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.

డిమాండు పెంచిన స్థానాల్లో కొనసాగాలంటే "అడిగిన మొత్తం ఇవ్వడమే కాదు తాము చెప్పినట్లుగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను నీచంగా తిట్టాలని లక్ష్యాలు కూడా పెట్టారు. హుందాగా రాజకీయాలు చేయగలం కానీ, దిగజారి మాట్లాడలేం" అని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎంపికైన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీని వీడారు. తర్వాత కొత్తవాళ్లు ఎవరూ దొరక్కపోవడంతో చేసేది లేక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు.

వైఎస్సార్​సీపీ జాబితాలో ఫ్యామిలీ ప్యాకేజీలు - ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురికి అవకాశం

అనుకున్నది ఒకటి అయినది ఒకటీ అన్నట్లు పరిస్థితి మారడంతో తాము పెట్టిన 140 కోట్ల శ్లాబ్‌ను పక్కన పెట్టి ఎవరో ఒకరు పోటీకి సిద్ధమైతే చాలనే పరిస్థితికి పార్టీ పెద్దలు దిగాల్సి వచ్చింది. నరసాపురంలో గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులను పోటీచేయాలని ఎన్నిసార్లు బతిమాలినా వారు స్పందించలేదు. దీంతో భీమవరానికి చెందిన వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉమాబాలను నరసాపురం అభ్యర్థిగా ప్రకటించారు.

నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌ను బలవంతంగా నరసరావుపేట లోక్‌సభకు మార్చారు. ఇలాంటివి చూపించి బీసీలకు సీట్లు పెంచామని సీఎం జగన్‌ ప్రకటించుకున్నారు. నిజంగా బీసీలకే టికెట్లు ఇవ్వాలనుకుంటే సీఎం సొంత సామాజికవర్గం వారి సీట్లలో ఎందుకా ప్రయత్నం చేయలేదు? మచిలీపట్నానికి తొలుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను అభ్యర్థిగా అనుకున్నారు. కానీ, ఆయన సరిపోరని డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ను బతిమలాడి మరీ తెచ్చుకున్నారు.

ముఖ్యమంత్రే ఆయనతో మాట్లాడి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఒప్పించారు. కర్నూలు ఎంపీకి నగర మేయర్‌ బీవై రామయ్యను అభ్యర్థిని చేశారు. విశాఖలో పార్టీ ఇప్పటికే కోలుకోలేని పరిస్థితిలో ఉండటంతో మంత్రి బొత్సను ఒప్పించి ఆయన భార్య ఝాన్సీని విశాఖ లోక్‌సభ అభ్యర్థిని చేశారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యతిరేకించినా ఆయనను అమలాపురం లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.