ETV Bharat / politics

వైఎస్సార్​సీపీ జాబితాలో ఫ్యామిలీ ప్యాకేజీలు - ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురికి అవకాశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 7:06 AM IST

Family Packages in YSRCP Candidates List: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబం నుంచి తండ్రీ కుమారులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, బాబాయ్‌ అబ్బాయ్‌లకు చోటు దక్కింది. కొంతమంది సిటింగ్‌ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు అవకాశం లభించింది. చివరి నిమిషంలో పార్టీలో చేరిన కొందరు నాయకులకూ జగన్‌ టికెట్లు కేటాయించారు.

ysrcp_candidates
ysrcp_candidates

Family Packages in YSRCP Candidates List: వైసీపీ ప్రకటించిన తుది జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి టికెట్లు దక్కగా మరికొన్నిచోట్ల వారి వారసులకు సీట్లు లభించాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నానికి బదులు ఆయన కుమారుడు పేర్ని కిట్టు బరిలో నిలుస్తున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినయ్‌రెడ్డికి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అవకాశం దక్కింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే షేక్‌ ముస్తాఫా కుమార్తె షేక్‌ నూరీ ఫాతిమాకు టికెట్‌ లభించింది. గంగాధర నెల్లూరు స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ పడనున్నారు.

కోట్లు ఉంటేనే సీట్లు- వైఎస్సార్సీపీలో టికెట్ ఫర్ సేల్!

అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ కోడలైన చెట్టి తనూజారాణికి అరకు నుంచి లోక్‌సభ టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామ కృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేశ్‌కు అదే స్థానాన్ని కేటాయించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేయనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి, ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట లోక్‌సభ నియోజకర్గం నుంచి నిలబడనుండగా ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి తంబళ్లపల్లె నుంచి పోటీ చేయనున్నారు.

హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత

అన్నదమ్ములైన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి ఆదిమూలపు సురేష్, ఆదిమూలపు సతీష్‌లు వరుసగా కొండపి, కోడుమూరు నుంచి బరిలో నిలుస్తున్నారు. సోదరులైన వై.బాలనాగిరెడ్డి, వై.వెంకట్రామరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి మంత్రాలయం, గుంతకల్లు, ఆదోని నుంచి పోటీ చేయనున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ టికెట్‌ లభించగా, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డికి చంద్రగిరి నియోజకవర్గ సీటు దక్కింది. కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ స్థానం నుంచి, ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు.

వాళ్లు అధికారంలో ఉన్నంత వరకు న్యాయం జరగదు - వివేకా వర్ధంతి కార్యక్రమంలో ప్రముఖులు

మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి, ఆయన బాబాయ్‌ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బాబాయ్, అబ్బాయ్‌లు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు తాడిపత్రి, ధర్మవరం టికెట్లు లభించాయి. ఒకే కుటుంబం నుంచి ఇలా ఇద్దరు ముగ్గురు వైసీపీ జాబితాలో చోటు దక్కించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కొన్ని రోజుల కిందటే టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయనకు అదే స్థానం నుంచి టికెట్‌ లభించింది. కొత్తగా పార్టీలో చేరిన నల్లగట్ల స్వామిదాసుకు తిరువూరు నుంచి, గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు నుంచి పోటీచేసే అవకాశం లభించింది. జొలదరాశి శాంత ఇటీవలే పార్టీలో చేరారు. ఆమెను హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలో దింపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.