ETV Bharat / opinion

బిహార్ రాజకీయమంతా నీతీశ్ చుట్టే​- తలనొప్పిగా చిరాగ్‌ వైఖరి- ఎన్‌డీఏకి గట్టి సవాలే! - bihar lok sabha polls 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 11:02 AM IST

Updated : Apr 7, 2024, 11:27 AM IST

Winning Chances Of Alliances In Bihar LS Polls 2024
Winning Chances Of Alliances In Bihar LS Polls 2024

Winning Chances Of Alliances In Bihar LS Polls 2024 : సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో బిహార్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం నీతీశ్‌ కుమార్‌ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోసారి బిహార్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాలని బీజేపీ-జేడీఎస్​ కూటమి వ్యూహాలు రచిస్తుండగా నీతీశ్​ కుమార్​పై​ ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకుని సత్తా చాటాలని హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రధాని మోదీ హవాలో ఈసారి కూడా బిహార్‌లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న నీతీశ్‌ కుమార్‌ ఆశలకు ఈ ఎన్నికల్లో సవాళ్లు తప్పేలా కనిపించడం లేదు. బిహార్‌లో విపక్ష ఇండియా కూటమి ఎన్‌డీఏకు గట్టి సవాలే విసురుతోంది. తగ్గుతున్న నీతీశ్‌కుమార్‌ ఆదరణ, పెరుగుతున్న విపక్ష పార్టీ నేతల ఇమేజ్‌ అధికార కూటమికి తిప్పలు తెచ్చిపెడుతోంది.

Winning Chances Of Alliances In Bihar LS Polls 2024 : సార్వత్రిక ఎన్నికల సమరంలో మరోసారి బిహార్‌లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాలని ఎన్‌డీఏ వ్యూహాలు రచిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 2019 ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్‌డీఏ 39 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. 2019లో భారతీయ జనతా పార్టీ 17 స్థానాలు జేడీయూ 17 స్థానాలు, రామ్ విలాస్‌ పాశవాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేశాయి.

బీజేపీ పోటీ చేసిన 17 స్థానాల్లోనూ విజయం సాధించగా లోక్‌ జన్‌శక్తి పార్టీ కూడా ఆరు స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది. జేడీయూ 17 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో గెలిచింది. కూటమిలోని పార్టీలన్నీ ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల 40 స్థానాల్లో 39 స్థానాలు ఎన్‌డీఏ వశమయ్యాయి. ఈసారి కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలని ఎన్‌డీఏ భావిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత విడిపోయిన జేడీయూ మరోసారి ఎన్‌డీఏతో జట్టు కట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఈసారి 40 స్థానాలను కైవసం చేసుకోవాలని ఎన్‌డీఏ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్‌లో ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌ సత్తా!
బిహార్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్-ఆర్​జేడీ కూటమి ఎన్‌డీఏకు ముచ్చెమటలు పట్టించింది. 243 శాసనసభ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 125 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ 110 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. ఇప్పుడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలోనూ అదే స్ఫూర్తితో సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది. 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు మహా కూటమి ప్రణాళికలు రచిస్తోంది.

తగ్గుతున్న నీతీశ్​ గ్రాఫ్​!
2019 ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 39 సీట్లు గెలిచిన ఎన్‌డీఏకు ఈసారి మాత్రం ఆర్​జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో ముందుకు సాగుతున్న విపక్ష ఇండియా కూటమి పెను సవాలే విసురుతోంది. ఈ ఐదేళ్లలో ప్రధాని మోదీ ప్రజాదరణ తగ్గకపోయినా, బీజేపీతో జట్టు కట్టిన నీతీశ్ కుమార్ ఆదరణ మాత్రం తగ్గుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వకుండా దూరంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈసారి ఇండియా కూటమిలో ఉండటం హస్తం పార్టీకి కలిసి రానుంది. వామపక్షాలకు బిహార్‌లో దాదాపు 10 శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లు విపక్ష ఇండియా కూటమికి మళ్లితే ఎన్‌డీఏకు తిప్పలు తప్పవు.

బిహార్​లో బీజేపీకి ప్రతికూలాంశాలు
బిహార్‌లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది. ఆర్​ఎస్​ఎస్​, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిన నేతలు కమలం పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్నారు. బీజేపీకి ఉన్న నమ్మకమైన, అంకిత భావమైన క్యాడర్‌ ప్రతిపక్ష నేతలకు కూడా విస్మయం కలిగిస్తోంది. బిహార్‌లో కమలం పార్టీకి నమ్మకమైన అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ ఉంది. ప్రధాని మోదీ మానియాతో పాటు అయోధ్య రామమందిర నిర్మాణం ప్రభావం బీజేపీకి కలిసిరానుంది. అయితే బిహారీల ఆలోచనలకు అనుగుణంగా పని చేసే మాస్‌ లీడర్‌ లేకపోవడం బీజేపీ అవకాశాలను దెబ్బ తీస్తోంది.

ఇప్పటికీ మోదీ మానియాపైనే ఆధారపడడం కూడా ప్రతికూలంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వారైనా బిహార్‌లో బీజేపీ అగ్రవర్ణ పార్టీగానే ప్రాచుర్యం పొందింది. గత ఏడాది జరిగిన కులాల సర్వే ప్రకారం బిహార్‌లో కేవలం 10 శాతం మంది మాత్రమే అగ్రవర్ణాల వారు ఉన్నారు. ఇది కూడా కమలం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

బీజేపీకి తలనొప్పిగా ఆర్​ఎల్​జేపీ వైఖరి!
బీజేపీ నేతృత్వంలోని కూటమిలో అసంతృప్త గళాలు వినిపిస్తుండడం ఎన్​డీఏను ఆందోళనకు గురిచేస్తోంది. చిరాగ్‌ పాశవాన్‌ నేతృత్వంలోని ఎల్​జేపీకి ఐదు సీట్లు కేటాయించడంపై అసంతృప్తికి గురైన చిరాగ్‌ బాబాయి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మిత్ర పక్షాలతో సీట్ల పంపకాల్లో బీజేపీ తమకు అన్యాయం చేసిందని ఎన్​డీఏకు తాను నిజాయతీ, విధేయతతో సేవ చేశానని కానీ తనకు అన్యాయం జరిగిందని పరాస్‌ వాపోయారు. ఆర్​ఎల్​జేపీ ఒంటరిగా బరిలోకి దిగితే నియోజకవర్గాల్లో ఎన్​డీఏ ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇది కూడా భాజపాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

ఎన్​డీఏకు వారి ఓట్లు అనుమానమే!
ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మాత్రమే హైకమాండ్ సంస్కృతి ఉండేది. ఇప్పుడు బీజేపీలోనూ ఈ అగ్ర నాయకత్వం మాట వినిపిస్తోంది. హిందుత్వానికి కట్టుబడి ఉండటం కూడా మైనార్టీ వర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల వరకూ అండగా ఉన్న దళిత నేత రామ్ విలాస్ పాశవాన్‌ మరణించడం వల్ల ఆయన వెనుకే ఉన్న 7 శాతం దళితుల ఓట్లు ఈసారి ఎన్​డీఏకు పడటం అనుమానంగా మారింది.

తేజస్వి ఆదరణ- ఇండియాకు ప్లస్​!
బిహార్‌లోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత బలమైన పార్టీ నిస్సందేహంగా ఆర్​జేడీనే. కానీ 2019 ఎన్నికల్లో ఆర్​జేడీ ఘోరంగా విఫలమైంది. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడింది. బిహార్‌లో మొత్తం జనాభాలో 30 శాతం ఉన్న ముస్లింలు- యాదవుల ఓట్లు ఆర్​జేడీకి ప్రధాన బలంగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్‌ స్థాపించిన ఆర్​జేడీ ఇప్పుడు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో బలంగా తయారైంది. తేజస్వి యాదవ్‌కు గత ఏడాదిన్నర కాలంలో పెరిగిన ఆదరణ కూడా ఇండియా కూటమికి ప్లస్ అవుతోంది.

17 నెలలు వర్సెస్ 17 ఏళ్లు
నీతీశ్‌తో పోలిస్తే ఇటీవల వరకు ఆయనకు డిప్యూటీగా ఉన్న తేజస్వికి బిహార్‌లో ఎక్కువ ఆదరణ లభిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో ఆర్​జేడీ అత్యధిక స్థానాలు గెలుచుకునేలా తేజస్వీ చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భారీ హామీని 17 నెలల్లో తేజస్వి నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో 17 నెలలు వర్సెస్ 17 ఏళ్లు నినాదంతో తేజస్వీ జనంలోకి వెళ్తున్నారు. బిహార్‌ యువతలో తేజస్వీకి మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా భావసారూప్యత గల పార్టీలతో పొత్తు కూడా తేజస్వీకి కలిసిరానుంది. నీతీష్ కుమార్ ఆకస్మికంగా ఎన్‌డీఏలోకి తిరిగి రావడం వల్ల ముస్లింల ఓట్లు గంపగుత్తగా విపక్ష కూటమి వైపు మళ్లే అవకాశం ఉంది.

ఐదుగురు అర్​జేడీ ఎమ్మెల్యేలు జంప్​!
ఆర్​జేడీని లాలూ కుటుంబ సభ్యులే ఎక్కువగా నియంత్రిస్తున్నారన్న విమర్శలున్నాయి. కుటుంబంలోని చాలామంది న్యాయపరమైన చిక్కుల్లో ఉండడం కూడా ఆర్​జేడీకి ప్రతికూలంగా మారింది. తేజ్‌ప్రతాప్‌ యాదవ్, మిసా భారతి వంటి తోబుట్టువుల కుయుక్తుల కారణంగా కుటుంబాన్ని చక్కదిద్దుకునేందుకు తేజస్వీకి ఎక్కువ సమయం పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ చాలాకాలంగా అధికారానికి దూరంగా ఉండడం కూడా విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు అర్​జేడీని వీడి ఎన్​డీఏలో చేరడం కూడా ప్రతికూలంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇంకా చాలామంది ఆర్​జేడీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉందన్న వార్తలు కూడా తేజస్వీ యాదవ్‌ పార్టీని ఆందోళన పరుస్తున్నాయి.

మోదీ క్రేజ్​- నీతీశ్​ క్లీన్ ఇమేజ్‌!
బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ బిహార్‌లో తన బలాన్ని మరోసారి నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులో వచ్చిన స్థానాలన్నింటినీ గెలుచుకునేలా ప్రణాళిక రచిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకున్న జేడీయూ ఇప్పుడు అన్నే స్థానాల్లో మళ్లీ బరిలోకి దిగుతోంది. కుల సర్వే ప్రకారం వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతుల కోటాల పెంపునకు ఇచ్చిన హామీ జేడీయూకు కలిసి రానుంది. నీతీశ్‌ కుమార్‌పై ప్రజల్లో ఇంకా మంచి ఆదరణ ఉంది. రెండు దశాబ్దాలకుపైగా సీఎంగా పదవిలో ఉన్నా అవినీతి, కుంభకోణాలకు తావులేకుండా నీతీశ్​ కుమార్ క్లీన్ ఇమేజ్‌తో ఉన్నారు. ఈ ఇమేజ్‌ మళ్లీ తమకు కలిసి వస్తుందని జేడీయూ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. బిహార్‌లో పారదర్శక పాలన, దేశవ్యాప్తంగా మోదీకి ఉన్న ప్రజాదరణ జేడీయూకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

బీజేపీతో పొత్తుతో జేడీయూకు ముస్లిం ఓటర్లు దూరం?
అయితే బిహార్‌లో నీతీశ్ కుమార్‌ విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతండడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. ఐదేళ్ల పాలనలో నీతీశ్‌ కుమార్‌ మూడుసార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం సామాన్య ఓటర్లకు రుచించడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు భిన్నంగా చిరాగ్ పాశవాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా వంటి నాయకుల నేతృత్వంలోని అనేక చిన్న పార్టీలు జేడీయూకు వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జేడీయూకు ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ-జేడీయూ మధ్య జరిగిన సీట్ల పంపకాలపైనా నీతీశ్‌ కుమార్‌ పార్టీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇరు పార్టీలు 17 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి జేడీయూ ఒక స్థానాన్ని త్యాగం చేసింది. దీనిపై జేడీయూలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌ చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ కంటే జేడీయూ తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోందని గుర్తు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్​ 'పవర్​ పాలిటిక్స్​'- BJD కంచుకోటను బద్దలుగొట్టేదెవరు? - Odisha Lok Sabha Elections 2024

దేవెగౌడ ఫ్యామిలీ పాలిటిక్స్​- ఒకే కుటుంబం నుంచి బరిలో 9మంది- ఎక్కడ చూసినా వాళ్లే! - Devegowda Family In Politics

Last Updated :Apr 7, 2024, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.