ETV Bharat / opinion

ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్​ 'పవర్​ పాలిటిక్స్​'- BJD కంచుకోటను బద్దలుగొట్టేదెవరు? - Odisha Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 5:56 PM IST

Odisha Political Scenario Analysis In Telugu
Odisha Political Scenario Analysis In Telugu

Odisha Lok Sabha Elections 2024 : ఒడిశాలో అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌ మరోసారి అధికారమే లక్ష్యంగా ఎన్నికల సమరంలోకి దూకింది. ప్రతిపక్ష బీజేపీ కూడా ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనుండడం వల్ల మోదీ మానియాతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. బీజేపీ-BJD పొత్తు ఉంటుందని ప్రచారం జరిగినా అదేమీ లేదని స్పష్టం కావడం వల్ల. ఒంటరిపోరుకు సిద్ధమైన రెండు పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపాలని పట్టుదలతో ఉంది.

Odisha Lok Sabha Elections 2024 : ఒ‍డిశా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. అభివృద్ధే నినాదంగా అధికార బిజూ జనతా దళ్‌, అవినీతి, నిరుద్యోగమే నినాదంగా ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పొత్తు పొడవకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ప్రచార జోరు పెంచింది. సంస్థాగతంగా ఇంకా పటిష్టంగానే కనిపిస్తున్న కాంగ్రెస్‌ కూడా ఈసారి సత్తా చాటి పూర్వ వైభవాన్ని చాటాలని సిద్ధంగా ఉంది.

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ రెండు దశాబ్దాలకుపైగా ఒడిశాలో బలమైన కోటను నిర్మించుకుంది. ఈ కోటను బద్దలు కొట్టి అధికారాన్ని కైవసం చేసుకోవడం ప్రతిపక్షాలకు కష్టమైన పనే. గతంలో బిజూ జనతా దళ్‌కు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగా బరిలో నిలిచింది. మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్ నుంచి కూడా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 శాసనసభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది.

ఎన్నికల్లో ప్రధాన పాత్ర వీటిదే
నిరుద్యోగం, అవినీతి, శాంతిభద్రతలు, వరి సేకరణలో అక్రమాలు, చిట్ ఫండ్, మైనింగ్ స్కామ్‌ వంటివి ఒడిశా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజూ జనతాదళ్ ఇప్పటికే 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. గత ఐదేళ్లలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని పార్టీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఒడిశాకు మోదీ సర్కార్‌ నుంచి మద్దతు లభిస్తోందని అందుకే కేంద్రానికి అండగా నిలుస్తున్నామని బిజు జనతా దళ్‌ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రధాన అస్త్రాన్ని నవీన్‌ పట్నాయక్‌ పార్టీ కోల్పోయింది. ఒడిశాలో పరిపాలన అంతా ఒడిశా యేతర అధికారులే నడిపిస్తున్నారన్న ఆరోపణ నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై ఉంది. నవీన్ పట్నాయక్ ఎక్కువగా ఒడియా యేతర అధికారులపై ఆధారపడటాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళతామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే అంశాలివే
24 ఏళ్ల పాలనలో నిరుద్యోగం, వలసలు పెరగడం అధికార బిజు జనతా దళ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. నవీన్‌ పట్నాయక్ 24 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒడిశా నుంచి యువకుల వలసలను అరికట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం విఫలమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా జరిగిన రిక్రూట్‌మెంట్ స్కామ్ ఆరోపణలు కూడా నవీన్‌ ప్రభుత్వాన్ని చుట్టు ముట్టాయి. ఒడిశాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీలు ఈ రెండు సమస్యలను ప్రధానంగా ప్రజల వద్దకు చేర్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒడిశాలో ఈసారి ఎన్నికల్లో వివక్ష, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివిధ పథకాల అమలులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన సహా పలు పథకాలకు లబ్ధిదారులను రాజకీయ ప్రాతిపదికన ఎంపిక చేశారని నవీన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నవీన్‌ ప్రభుత్వం వివిధ పనుల్లో ఒడియాయేతర కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తోంది. చిట్‌ఫండ్, మైనింగ్ కుంభకోణం కూడా నవీన్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. చిట్‌ఫండ్‌ స్కామ్‌పై ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. చిట్‌ఫండ్‌ కుంభకోణం, మైనింగ్‌ అక్రమాలు రెండింటిలోనూ అధికార పార్టీ సభ్యుల హస్తం ఉందని బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపించాయి. ఈ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ పార్టీలు డిమాండ్‌ చేశాయి.

నవీన్ పట్నాయక్​కు ఎదురయ్యే సవాళ్లివే
నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ధాన్యం సేకరణలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ధాన్యం సేకరణలో అక్రమాలను అరికట్టడంలో బిజూ జనతా దళ్‌ ప్రభుత్వం విఫలమైందని రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని మండీల్లో అవకతవకల కారణంగా కొన్నిసార్లు రైతులు మోసపోతున్నారని మండిపడుతున్నారు. వేసవిలో పోలింగ్ జరుగుతుండడం వల్ల ఎన్నికల ప్రచారంలో తాగునీటి సమస్య ప్రధానం అంశం కానుంది. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలందరికీ తాగునీరు అందించలేకపోయింది. రాయగడ, గజపతి సహా కొన్ని ప్రాంతాల్లో గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాలలో అతిసారం, ఇతర నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలడం నవీన్‌ సర్కార్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతోంది.

24 ఏళ్లయినా క్లీన్ ఇమేజ్- నవీన్​ బాబుకు అదే అభయహస్తం!
24 ఏళ్లకు పైగా పాలించినప్పటికీ సీఎం నవీన్ పట్నాయక్‌కు ప్రజాదరణ తగ్గలేదు. క్లీన్ ఇమేజ్ కూడా నవీన్‌ పార్టీకి కలిసిరానుంది. నవీన్‌ పట్నాయక్ కరిష్మా ఇప్పటికీ పని చేస్తుండడం బీజేడీకు వరంలా మారనుంది. ఒడిశాలోని నాలుగున్నర కోట్ల జనాభాలో బిజూ జనతా దళ్‌ కోటి మందికి పైగా సభ్యత్వం ఉంది. పార్టీకి అంకితమై పని చేసే క్యాడర్‌ కూడా ఉంది. మహిళా సంక్షేమ పథకాల వల్ల నవీన్‌ పట్నాయక్‌ ఓటు బ్యాంకు సురక్షితంగా ఉంది. నవీన్‌ పట్నాయక్‌ పార్టీని కొన్ని బలహీనతలు కూడా వెంటాడుతున్నాయి. బిజూ జనతా దళ్‌కు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కడే ఆకర్షణీయమైన, బలమైన నేత. బీజేడీకి 100 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నా పట్నాయక్‌లాంటి నేత ఒక్కరూ లేకపోవడం ఆ పార్టీని వేధిస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వంపై నవీన్‌ పట్నాయక్‌ సానుకూలంగా ఉండడం కూడా ఆ పార్టీని ఇరుకున పెడుతోంది.

ఒడిశాలో మహిళలు ఆశీర్వదించినంత కాలం తమ పాలనకు తిరుగులేదని నవీన్ పట్నాయక్‌ ధీమాగా ఉన్నారు. అయితే అసమ్మతి నాయకులతో బిజూ జనతా దళ్‌ పార్టీకి ముప్పు పొంచి ఉంది. 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీకి అసమ్మతి వాదులు, తిరుగుబాటు నేతలు ఉండడం కలవరపరుస్తోంది. 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాలకు బీజేడీ నుంచి మొత్తం పది వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వీరంతా రెబల్‌గా బరిలోకి దిగితే బీజేడీకి తిప్పలు తప్పకపోవచ్చు. సంక్షేమ పథకాల అమలులో అవినీతి, వివక్ష కూడా పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

పాగవేయాలని బీజేపీ- కానీ సమస్య అదే!
2009లో బిజూ జనతా దళ్‌తో పొత్తు ముగిసిన తర్వాత ఒడిశాలో భారతీయ జనతా పార్టీ రాజకీయ కార్యకలాపాలు ఒక దశాబ్దం పాటు నెమ్మదించాయి. ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడం వల్ల ఇప్పుడు ఒడిశాలో బీజేపీ మళ్లీ సత్తా చాటుతోంది. ఒడిశాలో కాంగ్రెస్‌ను అధిగమించి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఒడిశాలో బీజేపీ ప్రధాన బలం ప్రధాని నరేంద్ర మోదీ. ఒడిశాలో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుడని అనేక పోల్స్‌ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇప్పుడు మోదీ కరిష్మాతో ఒడిశాలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. మోదీ సమర్థ నాయకత్వం, హిందూ అనుకూల నిర్ణయాలు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీకు కలిసిరానున్నాయి. కానీ నవీన్ పట్నాయక్ ఇమేజ్‌కు, స్థాయికి సరిపోయే నాయకుడు ఎవరూ ఒడిశాలో బీజేపీకు లేరు. ఒడిశాలో బీజేపీ నేతలు అందరూ కొన్ని నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు, ఏబీవీపీ సభ్యులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోవడం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు కూడా బీజేపీ ప్రధాన బలహీనతగా ఉంది.

ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్!​ ఆశలు దానిపైనే!
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ 24 సంవత్సరాలుగా ఒడిశాలో అధికారంలో లేదు. 2019 ఎన్నికల వరకు నంబర్ 2 స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ తర్వాత మరింత దిగజారింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. బీజేడీ-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే బాగుంటుందని కాంగ్రెస్‌ భావించినా అది సాధ్యపడలేదు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా ఇప్పటికీ బలంగా ఉంది. ఒడిశాలో రెండు దశాబ్దాలుగా పార్టీ చాలా నష్టపోయినా ఇప్పటికీ 314 బ్లాకుల్లోనూ ఆ పార్టీకి ఓటర్లు ఉండడం విశేషం. కానీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను మరింత ఊబిలోకి నెట్టేస్తోంది. అధికారంలో లేకపోయినా, పదవుల కోసం నేతలు ఒకరిపై ఒకరు పోరు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా ఒడిశాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అధికార బీజేడీ, బీజేపీలో ఒకే దిశలో నడుస్తున్నందున ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. నిధుల కొరత కూడా హస్తం పార్టీని ఇబ్బంది పెడుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేవెగౌడ ఫ్యామిలీ పాలిటిక్స్​- ఒకే కుటుంబం నుంచి బరిలో 9మంది- ఎక్కడ చూసినా వాళ్లే! - Devegowda Family In Politics

బాలీవుడ్​ నటి కంగనాకు అనేక ఎన్నికల 'సవాళ్లు'- ఆ ఒక్క అంశంతో విజయం సాధిస్తారా? - Kangana Ranaut Loksabha Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.